- Home
- Technology
- Gadgets
- iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లాంచ్.. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్‌తో బిగ్ అప్‌గ్రేడ్స్
iPhone 18 Pro : ఆపిల్ ఐఫోన్ కొత్త సిరీస్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. సర్ ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్ తో ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ కానుంది. వేరియబుల్ అపెర్చర్ కెమెరా, ఏ20 ప్రో చిప్, భారీ బ్యాటరీతో కొత్త సిరీస్ వస్తోంది. ధరలు, ఇతర ఫీచర్ల వివరాలు మీకోసం.

ఆపిల్ ఐఫోన్ 18 ప్రో లో టాప్ 7 మార్పులు ఇవే
ఆపిల్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐఫోన్ 18 ప్రో సిరీస్ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా లాంచ్ కాబోతోంది. భారతీయ కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు "సర్ ప్రైజ్ అండ్ షైన్" (Surprise and Shine) పేరుతో ఆపిల్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను యాపిల్ అధికారిక వెబ్‌సైట్, యాపిల్ టీవీ యాప్ తో పాటు యూట్యూబ్ ఛానెల్‌లో ఫ్రీగా లైవ్ చూడొచ్చు. ఈసారి ఈవెంట్ చాలా స్పెషల్. టిమ్ కుక్ స్థానంలో జాన్ టెర్నస్ సఈఓగా బాధ్యతలు స్వీకరించాక జరుగుతున్న మొదటి బిగ్ ఐఫోన్ ఈవెంట్ ఇది. మరి ఈ ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్‌లో రాబోతున్న ఆ టాప్ ఫీచర్లు, ఇండియాలో వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.
డిజైన్, డిస్‌ప్లే అండ్ కలర్స్: ఈసారి కొత్త లుక్ ఉందా?
లుక్స్ పరంగా ఐఫోన్ 17 ప్రో మోడల్స్ మాదిరిగానే కొత్త ఐఫోన్ 18 ప్రో కూడా కనిపిస్తుంది. పెద్దగా బయటి డిజైన్‌లో మార్పులు చేయకుండా ఫోన్ లోపలి హార్డ్‌వేర్‌పై యాపిల్ ఎక్కువ దృష్టి పెట్టింది. అయితే, ప్రో మ్యాక్స్ బ్యాటరీ సైజ్ పెరగడం వల్ల కొద్దిగా బరువు, మందం పెరిగే ఛాన్స్ ఉంది. డిస్‌ప్లే విషయానికొస్తే 6.3 అంగుళాల స్క్రీన్ సైజ్ ఉంటుంది. ముందు భాగంలో ఉండే డైనమిక్ ఐలాండ్ సైజ్ కాస్త చిన్నదిగా కాబోతోంది. ఇక కలర్స్ విషయానికి వస్తే డార్క్ చెర్రీ, స్కై బ్లూ, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లో ఈ ఫోన్లు రానున్నాయి.
నెక్స్ట్ లెవెల్ ఏ20 ప్రో చిప్‌సెట్, సీ2 మోడెమ్
ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన ఏ20 ప్రో (A20 Pro) చిప్‌ను వాడబోతున్నారు. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా advanced 2nm టెక్నాలజీతో తయారైంది. దీనివల్ల ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా, గేమింగ్, ఏఐ టాస్క్‌లు చాలా స్మూత్‌గా పనిచేస్తాయి. బ్యాటరీ వినియోగం కూడా చాలా తగ్గుతుంది. అలాగే యాపిల్ సొంతంగా తయారుచేసిన సీ2 మోడెమ్‌ను ఇందులో అందిస్తున్నారు. దీనివల్ల 5జీ కనెక్టివిటీ, నెట్‌వర్క్ స్పీడ్ మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉంటుంది.
కెమెరా గేమ్ ఛేంజర్: వేరియబుల్ అపెర్చర్ ఎంట్రీ
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఐఫోన్ 18 ప్రో ఒక మంచి గిఫ్ట్ అని చెప్పాలి. ఇందులో మెయిన్ కెమెరాకు 'వేరియబుల్ అపెర్చర్'టెక్నాలజీని ఇస్తున్నారు. అంటే వెలుతురు ఆధారంగా కెమెరా లెన్స్ కాంతిని సర్దుబాటు చేసుకుంటుంది. చీకటిలో కూడా సూపర్ ఫోటోలు వస్తాయి. నైట్ మోడ్, పోర్ట్రెయిట్ ఫోటోలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ప్రో మ్యాక్స్ మోడల్‌లో ట్రిపుల్ 48MP కెమెరా సెటప్ రాబోతోంది. సైడ్‌లో ఉన్న కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా వాడుకకు సులువుగా ఉండేలా చిన్న చిన్న మార్పులు చేశారు.
బ్యాటరీ లైఫ్ అండ్ చార్జింగ్ అప్‌గ్రేడ్
ఫోన్ లవర్స్‌కు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో ఏకంగా 5,200mAh కంటే పెద్ద బ్యాటరీని అమర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ20 ప్రో చిప్ పవర్ సేవింగ్ వల్ల ఒకసారి చార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడేయవచ్చు. హెవీ గేమింగ్, వీడియోగ్రఫీ చేసేవారికి ఇది సూపర్ అప్‌గ్రేడ్ కానుంది.
ఇండియాలో ధర ఎంత ఉండొచ్చు?
ఈసారి ర్యామ్, కాంపోనెంట్స్ ధరలు పెరగడం వల్ల ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధర కాస్త పెరిగే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో బేస్ మోడల్ ధర $1,099 నుంచి $1,199 వరకు ఉండొచ్చు. ఇక ఇండియా విషయానికి వస్తే, మునుపటి ఐఫోన్ 17 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900గా ఉండేది. కానీ ఈసారి 10 నుంచి 20 శాతం వరకు ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ఫలితంగా ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,44,900 నుంచి రూ. 1,49,900 మధ్య ఉండే అవకాశం ఉంది. టాప్ వేరియంట్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ధర రూ. 1.60 లక్షల మార్కును దాటే అవకాశం ఉందని రిపోర్టులు చెబుతున్నాయి.

