- Home
- Life
- Food
- Rasam: మిరియాల రసం ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే.. జలుబు, దగ్గు పరార్ అవ్వాల్సిందే
Rasam: మిరియాల రసం ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో తింటే.. జలుబు, దగ్గు పరార్ అవ్వాల్సిందే
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పడు వేడి వేడి అన్నంలో ఘాటుగా మిరియాల చారు తింటే.. చాలా కమ్మగా ఉంటుంది. జలుబు కూడా తగ్గుతుంది.

జలుబు తగ్గించే మిరియాల రసం..
వాతావరణం మారిపోయింది. వర్షాలు బాగా కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరికీ జలుబు, దగ్గు రావడం చాలా కామన్. ఇక.. ఈ జలుబు, దగ్గు.. మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నీరసంగా అనిపిస్తుంది. నోటికి ఏదీ తినాలని కూడా అనిపించదు. అలాంటి సమయంలో వేడి వేడిగా మిరియాల రసం చేసుకొని తాగితే.. ఆ జలుబు నుంచి ఉపశమనం పొందాల్సిందే.
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పడు వేడి వేడి అన్నంలో ఘాటుగా మిరియాల చారు తింటే.. చాలా కమ్మగా ఉంటుంది. జలుబు కూడా తగ్గుతుంది. మరి, సరైన కొరతలతో మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా...
మిరియాల రసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
టమోటా - 2
చింతపండు - 1 చిన్న నిమ్మకాయ సైజు
పచ్చిమిర్చి - 2
వెల్లుల్లి - 1 గుప్పెడు
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 2 టీస్పూన్లు
కరివేపాకు, కొత్తిమీర - 1 గుప్పెడు
నూనె - 1 1/5 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మెంతులు - 1/2 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 5
ఇంగువ - 1/2 టీస్పూన్
ఉప్పు, నీరు - అవసరమైన విధంగా
మిరియాల రసం తయారు చేసే విధానం...
ఒక గిన్నెలో కప్పు నీరు తీసుకొని అందులో నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని కనీసం గంటసేపు నానపెట్టాలి. ఇప్పుడు, మిక్సర్ జార్‌లో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు , కరివేపాకు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.తరువాత, అదే మిక్సర్ జార్‌లో 2 టమోటాలు వేసి మెత్తగా రుబ్బుకోండి. తరువాత, నానబెట్టిన చింతపండును బాగా పిసికి.. దాని నుంచి చింతపండు రసం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు, స్టవ్ మీద పాన్ వేడి చేసి నూనె వేయండి. ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి. అందులోనే పసుపు, ఇంగువ కూడా వేయాలి. ఆ తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి, మిరియాల మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది వేగినప్పుడు కమ్మని వాసన వస్తుంది. అలా వచ్చిన తర్వాత.. మీ అవసరానికి సరిపడా నీరు పోయాలి. ఆ నీరు కాస్త మరిగిన తర్వాత టమాట పేస్టు, చింతపండు రసం కూడా వేసి మరికాసేపు మరగనివ్వాలి.
తర్వాత, అవసరమైనంత ఉప్పు, కరివేపాకు , కొత్తిమీర వేసి స్టవ్‌ను తక్కువ మంట మీద కాసేపు సిమ్ లో మరిగించాలి. రసం బాగా మరిగిందని మీకు అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే.. సింపుల్ గా రుచికరమైన మిరియాల రసం తయారైనట్లే. వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ గా ఆలుగడ్డ ఫ్రై కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కావాలంటే.. టమాటలను ముందుగానే నీటిలో ఉడికించి.. తర్వాత దానిని పేస్టులా చేసి కూడా రసంలో కలుపుకోవచ్చు.
NCBI జర్నల్‌లో A Comprehensive Review on Rasam: A South Indian Traditional Functional Food అనే టైటిల్ తో ఒక కథనం ప్రచురించారు. ఆ కథనంలో ఈ మిరియాల రసం మంచి ఔషధం అని పేర్కొన్నారు. దీనిని చాలా మంది తక్కువ అంచనా వేస్తారు కానీ.. ఆరోగ్యానికి మేలు చేసే చాలా పోషకాలు ఇందులో ఉన్నాయి అని ఆ కథనంలో పేర్కొన్నారు.