Eggs: పిల్లలకు ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు ఇస్తే ఏమౌతుంది?
Eggs: కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు బి12, డి, కోలిన్, లుటిన్ వంటి ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. మరి, వీటిని పిల్లలకు అందిస్తే ఏమౌతుంది?

పిల్లలకు కోడిగుడ్డు పెట్టొచ్చా?
కోడి గుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సంవత్సరం వయసు దాటిన తర్వాత నుంచి పిల్లలకు ఈ కోడి గుడ్డును పెట్టొచ్చు. గుడ్డులో ప్రోటీన్ తో పాటు చాలా రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మెదడు శక్తికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి.
కోడి గుడ్డు కేవలం మంచి అల్పాహారం మాత్రమే కాదు, పిల్లలలో పోషకాహారాన్ని పెంచడానాికి ఇది ఒక గొప్ప ఆహారం. ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది పిల్లల్లో మెదడు అభివృద్ధికి, తెలివితేటలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
పిల్లలకు రోజుకి ఒక గుడ్డు అందిస్తే..
పిల్లలకు రోజూ ఒక కోడి గుడ్డు ఇవ్వడం వల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలను గుడ్డు అందిస్తుంది. కంటి చూపును మెరుగుపరిచే లుటిన్, జియాక్సంతిన్ కూడా గుడ్లలో ఉంటాయి. గుడ్లు ప్రోటీన్‌ను మాత్రమే కాదు. పిల్లలకు రోజూ అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
ఎన్ని గుడ్లు తినొచ్చు..?
1 నుంచి 8 ఏళ్ల పిల్లలు రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మోతాదు పెరుగుతున్న పిల్లలకు అవసరమైన ప్రోటీన్, పోషకాలను అందిస్తుంది. శక్తిని నిలబెట్టడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, శరీర పెరుగుదలలో ఇది పాత్ర పోషిస్తుంది.
గుడ్లు తినని పిల్లలతో పోలిస్తే, గుడ్లు తినే పిల్లలకు ప్రోటీన్, మంచి కొవ్వు, డిహెచ్‌ఏ, కోలిన్, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పోషకాలన్నీ శక్తిని నిలబెట్టడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, శరీర పెరుగుదలలో పాత్ర పోషిస్తాయి.
రోజూ గుడ్డు తినడం వల్ల పిల్లల్లో పెరుగుదల వేగవంతమవుతుందని ఓ అధ్యయనంలో నిరూపితమైంది. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల పెరుగుదల లోపం 47%, బరువు తక్కువగా ఉండటం 70% నివారించవచ్చని పీడియాట్రిక్స్ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం తేల్చింది.
ఏ రూపంలో ఇవ్వొచ్చు..?
ఇతర ఆహారాలతో పాటు రోజుకు 1-2 గుడ్లు ఇవ్వండి. కూరగాయలతో కలిపి స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ రూపంలో కూడా ఇవ్వొచ్చు. ఇంకో విషయం, పిల్లలకు మొదటిసారి గుడ్డు పెట్టినప్పుడు అలర్జీ సమస్య ఉందేమో గమనించండి. ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించండి.

