Kitchen Hacks: చలికాలం ఇడ్లీ పిండి పులవడం లేదా? ఇదొక్కటి కలిపితే చాలు
Kitchen Hacks: మనలో చాలా మందికి రెగ్యులర్ గా ఉదయాన్నే ఇడ్లీ తినే అలవాటు ఉంటుంది. కానీ, చలికాలంలో ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అలా కాకుండా, పిండి బాగా పులిసి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఈ చిన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు

ఇడ్లీ పిండి...
చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. కాబట్టి, ఇడ్లీ పిండి తొందరగా పులవదు( Ferment). అందుకే.. ఇడ్లీలు మెత్తగా రావు. దాని కోసం మీరు గోరు వెచ్చని నీటిని వాడితే సరిపోదు. పిండి కోసం పప్పును నానపెట్టుకునేటప్పుడు, లేదా రుబ్బుకునే సమయంలో వేడి నీటిని వాడాలి. ఇలా చేయడం వల్ల పిండి పులియబెట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. పిండి రుబ్బుకున్న వెంటనే ఉప్పు కలపకూడదు. మరుసటి రోజు కలపాలి.
ఇవి కలిపినా చాలు...
మీరు కొద్దిగా అటుకులు లేదా వండిన అన్నం కూడా కలపొచ్చు. రుబ్బేటప్పుడు 2-3 చెంచాల మందపాటి అటుకులు లేదా కొద్దిగా వండిన అన్నం కలపడం వల్ల పులియబెట్టే ప్రక్రియకు సహాయపడుతుంది. పిండి మరీ నీళ్లలా పలచగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోండి. పల్చటి పిండి త్వరగా పులవదు.
పాత పిండి కలపండి..
మీ దగ్గర పాత పులిసిన పిండి ఉంటే దాన్ని కూడా వాడొచ్చు. 1-2 చెంచాల పాత పులిసిన ఇడ్లీ పిండిని కొత్త పిండితో కలపండి. కానీ ప్రతిసారీ గిన్నె మూత తెరిచి చూడొద్దు. చలికాలంలో పిండి పొంగడానికి 12-18 గంటలు పట్టొచ్చు. కాబట్టి తొందరపడొద్దు.
ఒక స్పూన్ పంచదార..
ఇంకా పులవకపోతే 1 చెంచా చక్కెర కలపండి. 2-3 గంటలు వెచ్చని ప్రదేశంలో ఉంచండి లేదా 1-2 చెంచాల పాత పులిసిన పిండిని కలపండి. ఇలా చేయడం వల్ల ఇడ్లీ పిండి త్వరగా పులుస్తుంది. ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయి.
వేడి ప్రదేశంలో..
ఇడ్లీ పిండిని తయారు చేశాక, గ్యాస్ దగ్గర, ఫ్రిజ్ పైన లేదా వంటగదిలో ఏదైనా వెచ్చని ప్రదేశంలో ఉంచండి. మీ దగ్గర ఓవెన్ ఉంటే, లైట్ ఆన్ చేసి లోపల పెట్టండి. కానీ వేడి చేయొద్దు.

