Healthy Winter Food: చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి? తింటే ఏం జరుగుతుంది?
Healthy Winter Food: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నువ్వులు ఒకటి. రోజూ గుప్పెడు నువ్వులు తింటే చాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నువ్వులను ఎలా తినాలో తెలుసుకోండి.

చలికాలంలో నువ్వులు
శీతాకాలం వచ్చిందంటే శరీరానికి ఎక్కువ శక్తి అవసరం. చలికాలంలో జీర్ణశక్తి కొంచెం మందగిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆహారంలో కొన్ని తప్పనిసరిగా ఉండాలి. వాటిలో ముఖ్యమైనవి నువ్వులు. తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో నువ్వులు మంచి పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే శీతాకాలంలో నువ్వులతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
నువ్వులు ఎందుకు తినాలి?
నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. నువ్వుల్లో ఉండే సెసమిన్, సెసమోల్ అనే యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటాయి. అలాగే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో నువ్వులు ఉపయోగపడతాయి. రోజూ కొద్దిపాటి నువ్వులు తీసుకుంటే గుండె బలంగా ఉంటుంది.
ఎముకల కోసం
నువ్వులు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో కాల్షియం, ఫాస్ఫరస్, మగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. శీతాకాలంలో చాలామందికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారికి నువ్వులు మంచి ఆహారం. నువ్వులు తినడం వల్ల ఎముకలు బలపడతాయి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ముఖ్యంగా వయసు పెరిగిన వారు, మహిళలు నువ్వులను ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.
ఏదైనా అరిగిపోతుంది
నువ్వులు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. శీతాకాలంలో మలబద్ధకం సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. నువ్వులతో చేసిన లడ్డూలు, చట్నీలు లేదా నువ్వుల నూనెతో వంటలు చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే నువ్వులు శరీరానికి వేడి ఇస్తాయి. చలికాలంలో చలిని తట్టుకునేందుకు ఇవి సహాయపడతాయి. దీంతో శరీరం ఉత్సాహంగా ఉంటుంది.
ఎలా తినాలి?
నువ్వులను రోజూ ఎలా తినాలి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. నువ్వులను నేరుగా తినవచ్చు, నువ్వుల లడ్లు చేసుకోవచ్చు. నువ్వుల చట్నీ లేదా పొడి తయారు చేసి అన్నంలో కలుపుకుని తినవచ్చు. నువ్వుల నూనెతో వంటలు చేయడం కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. రోజుకు ఒకటి రెండు చెంచాల నువ్వులు లేదా వాటితో చేసిన పదార్థాలు సరిపోతాయి. ఇలా శీతాకాలంలో నువ్వులను ఆహారంలో చేర్చుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణతో పాటు సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు.

