- Home
- Life
- Food
- Black Garlic: బ్లాక్ వెల్లుల్లి గురించి ఎప్పుడైనా విన్నారా.? తెల్ల వాటికి వీటికి తేడా ఏంటంటే
Black Garlic: బ్లాక్ వెల్లుల్లి గురించి ఎప్పుడైనా విన్నారా.? తెల్ల వాటికి వీటికి తేడా ఏంటంటే
Black Garlic: వెల్లుల్లి అంటే తెల్లగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బ్లాక్ వెల్లుల్లి కూడా ఉంటుందని మీలో ఎంత మందికి తెలుసు.? ఇంతకీ ఏంటీ బ్లాక్ గార్లిక్.? దీంతో కలిగే ప్రత్యేక ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ గార్లిక్ ఎలా తయారవుతుంది?
బ్లాక్ గార్లిక్ కొత్త రకం వెల్లుల్లి కాదు. మనం వాడే సాధారణ వెల్లుల్లినే కొన్ని వారాల పాటు నియంత్రిత ఉష్ణోగ్రత, తేమలో ఉంచుతారు. ఈ ప్రక్రియలో రసాయన మార్పులు జరుగుతాయి. దాంతో వెల్లుల్లి నల్లగా మారుతుంది. ఘాటు తగ్గి, మృదువైన తీపి రుచి వస్తుంది. ఈ ప్రక్రియ ఫర్మెంటేషన్ లాంటి దశల ద్వారా జరుగుతుంది.
రెండింటి మధ్య తేడా ఏంటి.?
నిపుణుల ప్రకారం సాధారణ వెల్లుల్లిలో అలిసిన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. అదే ఘాటు వాసనకు, బ్యాక్టీరియా నిరోధక లక్షణాలకు కారణం. అయితే ఇది కొందరికి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు. కానీ బ్లాక్ గార్లిక్‌లో అలిసిన్ ఎక్కువ భాగం స్థిరమైన యాంటీఆక్సిడెంట్స్‌గా మారుతుంది. ముఖ్యంగా S-అలైల్ సిస్టీన్ అనే పదార్థం సులభంగా శరీరంలో కలిసిపోతుంది. అందువల్ల యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాల కోసం బ్లాక్ గార్లిక్ మెరుగైన ఎంపికగా భావిస్తున్నారు.
జీర్ణ సమస్యలున్న వారికి
చాలా మందికి తెల్ల వెల్లుల్లి పడదు. ముఖ్యంగా ఆసిడిటీ, రిఫ్లక్స్ సమస్యలు ఉన్నవారికి ఇది ఇబ్బంది కలిగించవచ్చు. బ్లాక్ గార్లిక్ మాత్రం తక్కువ ఘాటు వల్ల కడుపునకు మృదువుగా ఉంటుంది. అజీర్తి సమస్య ఉన్నవారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా నిపుణులు సూచిస్తున్నారు.
బ్లాక్ గార్లిక్ ప్రయోజనాలు
బ్లాక్ గార్లిక్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. లివర్‌కి రక్షణ కల్పించడంలో కూడా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలుష్య ప్రభావాలను కొంతవరకు తగ్గించడంలో సహాయపడే లక్షణాలు కూడా ఉన్నాయి. రోజుకు ఒకటి లేదా రెండు రెబ్బలు తింటే మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతారు. వీటిని నేరుగా నమలవచ్చు లేదా వంటల్లో ఉపయోగించవచ్చు. రెస్టారెంట్లలో కూడా బ్లాక్ గార్లిక్‌తో చేసిన వంటకాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
మంచి చేస్తుంది కానీ..
బ్లాక్ గార్లిక్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఇది ఏ వ్యాధికైనా మందు కాదు. ఒక్క ఆహారంతోనే ఆరోగ్యం మెరుగుపడదు. సమతుల ఆహారం, సరైన జీవనశైలి ఉంటేనే ఫలితం ఉంటుంది. రక్తం పలుచన చేసే మందులు వాడేవారు మాత్రం బ్లాక్ గార్లిక్ ఎక్కువగా తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే, బ్లాక్ గార్లిక్ రెగ్యులర్ వెల్లుల్లికి ప్రత్యామ్నాయమని చెప్పాలి. అయితే సరైన పరిమాణంలో, నిత్యాహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. కానీ కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్యుల సూచన మేరకు తీసుకోవడం మంచిది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే మంచిది.

