అన్నం బదులు ఇవి తింటే.. మీ ఆయుష్షు మరింత పెరుగుతుంట!
అందరూ తమ ఆరోగ్యంపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా తినే విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అన్నం తినడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతుండటంతో అన్నం బదులు ఇతర ప్రత్యామ్నాయాల వైపు దృష్టిపెడుతున్నారు. అన్నానికి బదులు ఏయే ధాన్యాలు తింటే ఆరోగానికి వచ్చిందో తెలుసుకుందాం.

డాలియా
డాలియా అనేది గోధుమలతో తయారు చేసే ఆహార పదార్ధం. ఇందులో ఫైబర్, విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ఉపయోగించే విధానాలు: ఉప్మా, కిచిడి, గంజి, సలాడ్ లాగా తినొచ్చు. గోధుమ రవ్వగా కూడా వాడతారు.
బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్‌లో సెలీనియం, మాంగనీస్, ఫైటిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల దెబ్బతినకుండా కాపాడతాయి.
- బ్రౌన్ రైస్‌లోని ఫైబర్, మెగ్నీషియం రక్తపోటును తగ్గించి, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- అన్నం కంటే బ్రౌన్ రైస్‌కు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి మంచిది.
ఉపయోగించే విధానాలు: బిర్యానీ, పొంగల్ లలో వాడొచ్చు. కూరలు, పప్పులతో కలిపి తీసుకోవచ్చు.
క్వినోవా
క్వినోవాలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ఆహారం. కండరాల పెరుగుదలకు, శరీర విధులకు ప్రోటీన్ చాలా ముఖ్యం.
- క్వినోవాలో ఇనుము, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యానికి, నాడీ వ్యవస్థకు, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
- ఇతర ధాన్యాల కంటే క్వినోవా త్వరగా జీర్ణమవుతుంది. వృద్ధులకు, జీర్ణ సమస్యలున్నవారికి మంచిది.
ఉపయోగించే విధానాలు: అన్నంలా వండుకుని కూరలు, పప్పులతో తినొచ్చు. సలాడ్స్, సూప్‌లు, దోశల్లో కూడా వాడొచ్చు.
కాలీఫ్లవర్ రైస్
బరువు తగ్గాలనుకునేవారికి కాలీఫ్లవర్ రైస్ కూడా చాలా మంచిది. తక్కువ కేలరీలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
- కాలీఫ్లవర్‌లో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి, రక్తం గడ్డకట్టడానికి సహాయపడే విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
- కాలీఫ్లవర్ రైస్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని నియంత్రిస్తుంది.
ఉపయోగించే విధానాలు: వేయించి లేదా ఆవిరిలో ఉడికించి తినొచ్చు. పులావ్, బిర్యానీల్లో అన్నం బదులు వాడొచ్చు. గుడ్డు లేదా ఇతర కూరలతో కలిపి బ్రేక్‌ఫాస్ట్‌గా తినొచ్చు.
బార్లీ
బార్లీలోని బీటా-గ్లూకన్ అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.
- బార్లీలోని ఫైబర్ పేగుల్లోని మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించి, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
- బార్లీ నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్ కాబట్టి, శరీరానికి ఎక్కువ సేపు శక్తినిస్తుంది.
ఉపయోగించే విధానాలు: గంజి, ఉప్మా, సూప్, సలాడ్స్‌లో వాడొచ్చు. బార్లీ పిండిని రొట్టెలు, ఇతర బేకరీ పదార్థాలలో వాడొచ్చు. నానబెట్టిన బార్లీని కూరలతో కలిపి తినొచ్చు.