Food: వీటిని నానపెట్టిన తర్వాతే వండాలి, ఎందుకో తెలుసా?
నీటిలో నానపెట్టిన కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మరి, వేటిని కచ్చితంగా నానపెట్టి తినాలో మీకు తెలుసా?

ఈరోజుల్లో అంతా ఉరుకుల పరుగుల జీవితం అయిపోయింది. ఆఫీసు పనులు, ఇంటి పనులతో చాలా మందికి ఒత్తిడికి గురౌతున్నారు. తీరిగ్గా వంట చేసుకొని కూడా తినలేకపోతున్నారు. ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడిపోతున్నారు. కానీ, పూర్వం అలా ఉండేది కాదు. మన అమ్మలు, అమ్మమ్మలు వంట చేసేటప్పుడు ఒక పద్దతి ప్రకారం వండేవారు. వంట చేయడానికి కనీసం గంట ముందే బియ్యం, పప్పు లాంటివి నానపెట్టుకునేవారు. తర్వాత మాత్రమే మాత్రమే వండేవారు. నానపెట్టడం వల్ల వంట చేయడం సులభం అవుతుందని, అందుకే అలా చేసేవారు అని అనుకుంటారు. కానీ ఇలా నానపెట్టి తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?
ఆహారం నానపెట్టడం అనేది మన సంప్రదాయ ఆహార సంస్కృతిలో భాగమైన ఒక ఆరోగ్య పద్దతి. కొన్ని ఆహార పదార్థాలను కచ్చితంగా నీటిలో నానపెట్టి మాత్రమే తినాలి. అలా చేయడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. శరీరానికి శ్రేయస్సును కూడా అందిస్తుంది. శరీరంలో వేడి తగ్గడంతో పాటు, ఇన్ ఫ్లమేషన్ సమస్య కూడా తగ్గుతుంది.. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. మరి, కచ్చితంగా నానపెట్టిన తర్వాత మాత్రమే తినాల్సిన ఆహారాలు ఏంటో చూద్దాం..
ధాన్యాలు:
బియ్యం, క్వినోవా, ఓట్స్ వంటి ధాన్యాలను నానబెట్టడం వల్ల ఫైటిక్ ఆమ్లం విచ్ఛిన్నం అవుతుంది. ఇది శరీరానికి పోషకాలు సులభంగా గ్రహించేందుకు సహాయపడుతుంది. వీటిని నానపెట్టడం వల్ల వంట సమయం తగ్గుతుంది. అంతేకాకుండా.. వాటిలో ఎవైనా కెమికల్స్ లాంటివి ఉన్నా.. అవి కూడా తొలగిపోయే అవకాశం ఉంది.
గింజలు:
బాదం, అవిసె గింజలు వంటి వాటిని నానబెట్టడం టానిన్లు , ఇతర యాంటీ-న్యూట్రియంట్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది వాటి పోషక విలువను పెంచుతుంది, ఫైబర్ , ప్రొటీన్ ను శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది.
leafy vegetables
ఆకుకూరలు:
పాలకూర, తోటకూర లాంటి ఆకుకూరలను తినే ముందు కొద్దిసేపు నీటిలో నానబెట్టడం వల్ల వాటిపై ఉన్న ఇసుక, మలినాలు తొలగిపోతాయి. ఇది శుభ్రతను పెంచి, ఆరోగ్యకరమైన భోజన అనుభవాన్ని అందిస్తుంది.
పప్పులు, చిక్కుళ్ళు:
బీన్స్, పప్పులను వండే ముందు నీటిలో నానబెట్టడం వల్ల అవి మృదువుగా మారతాయి. వంట చేయడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. అలాగే, ఫైటిక్ ఆమ్లం, ఎంజైమ్ నిరోధకాలు తొలగిపోతాయి, ఫలితంగా అవి సులభంగా జీర్ణమవుతాయి.
ఓట్స్ , శనగలు..
ఓట్స్ , శనగలను (చిక్పీస్) నానబెట్టడం వాటి పోషకాలను యాక్టివేట్ చేయడంలో సహాయపడుతుంది. ఫైటిక్ ఆమ్లం తగ్గిపోతుంది, వంట సమయం తగ్గుతుంది, అసౌకర్యం లేకుండా జీర్ణమవుతాయి.
ఈ సాధారణమైన కానీ శక్తివంతమైన పద్ధతిని అనుసరించడం వల్ల భోజనం మరింత పోషకవంతంగా మారుతుంది. రోజువారీ ఆహారంలో ఈ ఆచరణను భాగం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.