- Home
- Feature
- Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Kashmir of South India: హైదరాబాద్‌కి దగ్గర్లోనే దక్షిణ భారత కాశ్మీరం.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ట్రిప్ ప్లాన్ ఇదిగో !
Kashmir of South India: హైదరాబాద్ కు దగ్గరలోనే సౌత్ ఇండియా కాశ్మీర్ ఉందని మీకు తెలుసా? హైదరాబాద్ నుంచి ఈ 'దక్షిణ భారత కాశ్మీర్' ఎలా వెళ్లాలి? పూర్తి రూట్ మ్యాప్, చూడాల్సిన ప్రదేశాలు, ఆహారం పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

12 ఏళ్లకు ఒక్కసారే వికసించే అరుదైన పువ్వులు, మంచు మేఘాలు.. మున్నార్‌కు ఎలా వెళ్లాలో తెలుసా?
హైదరాబాద్‌లోని డైలీ రొటీన్ లైఫ్, ట్రాఫిక్, పని ఒత్తిడి నుంచి కాస్త గ్యాప్ తీసుకుని, చల్లని కొండల నడుమ రిలాక్స్ అవ్వాలని ఉందా? మంచు కొండలు, ఆకుపచ్చని టీ తోటలు, ఉరికే జలపాతాలు మీ మైండ్‌ని రిఫ్రెష్ చేయడానికి వెయిట్ చేస్తున్నాయి. దానికి బెస్ట్ ఆప్షన్ కేరళలోని ‘మున్నార్’. అందుకే మున్నార్‌ను అందరూ ముద్దుగా ‘దక్షిణ భారత కాశ్మీర్’ అని పిలుస్తుంటారు. కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న ఈ హిల్ స్టేషన్, సముద్ర మట్టానికి దాదాపు 1,600 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
"మున్నార్" అంటే కేరళ భాషలో "మూడు నదులు" అని అర్థం. ముధిరపుళ, నల్లతన్ని, కుండల అనే మూడు నదుల సంగమ క్షేత్రం కావడం వల్లే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు బ్రిటిష్ వారి సమ్మర్ రిసార్ట్‌గా వెలిగిన ఈ ప్రదేశం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టూరిస్టులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
చూడాల్సిన సూపర్ ప్రదేశాలు, అరుదైన నీలకురింజి పువ్వులు
మున్నార్‌కి వెళ్తే మెయిన్ అట్రాక్షన్ అక్కడ కనిపించే ఎండ్ లెస్ టీ తోటలే. కంటికి కనిపించినంత మేర పచ్చని తివాచీ పరిచినట్లు ఉండే ఈ టీ ఎస్టేట్స్ మిమ్మల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. ఇక్కడ ఉన్న 'టీ మ్యూజియం' సందర్శించి, టీ ప్రొసెసింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవచ్చు. అలాగే ఫ్రెష్‌గా తయారుచేసిన టీని టేస్ట్ చేయవచ్చు.
వైల్డ్‌లైఫ్ లవర్స్ కోసం 'ఇరవికుళం నేషనల్ పార్క్' ఉంది. అంతరించిపోతున్న అరుదైన 'నీలగిరి తార్' ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. అలాగే మున్నార్‌లో అత్యంత ఎత్తైన వ్యూ పాయింట్ 'టాప్ స్టేషన్' (సముద్ర మట్టానికి 1,700 మీటర్లు). ఇక్కడి నుంచి పశ్చిమ కనుమలు, తమిళనాడులోని తేని వ్యాలీ అందాలను, మేఘాల థీమ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
మీరు గట్టిగా అరిస్తే మీ వాయిస్ రిపీట్ అయ్యే 'ఎకో పాయింట్', బొటింగ్ చేయడానికి అనువైన 'మాట్టుపెట్టి డ్యామ్' కూడా మస్ట్ విజిట్ స్పాట్స్. ఇవే కాకుండా అట్టుకాడ్, లక్కమ్, చీయప్పార జలపాతాలు, కుండల లేక్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.
మున్నార్‌లో అత్యంత అరుదైన విశేషం 'నీలకురింజి' పువ్వులు. ఇవి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసిస్తాయి. ఇవి వికసించినప్పుడు కొండలన్నీ నీలి-ఊదా రంగులోకి మారిపోతాయి. కొలుక్కుమలైలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టీ ప్లాంటేషన్ (7,900 అడుగులు) ఉంది. ఇక్కడ సూర్యోదయం చూడటం, ఆఫ్ రోడ్ జీప్ సఫారీ చేయడం ఒక వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. అలాగే దక్షిణ భారతదేశంలో రెండో అత్యంత ఎత్తైన శిఖరం 'మీసపులిమల' ట్రెక్కర్లకు స్వర్గధామం.
ప్రకృతి అందాలను చూడటానికి బెస్ట్ టైమ్: పొద్దున్నే సూర్యోదయం వేళ, లేదా సాయంత్రం సూర్యాస్తమయం వేళ మంచు తొలగిపోతున్నప్పుడు ఇక్కడి వ్యూస్ అద్భుతంగా ఉంటాయి.
టేస్టీ కేరళ ఫుడ్ అండ్ షాపింగ్
ట్రావెలింగ్‌లో ఫుడ్ లేకపోతే కిక్ ఉండదు కదా! మున్నార్ వెళ్తే కేరళ సాంప్రదాయ ఫుడ్ తప్పకుండా ట్రై చేయాలి. అరటి ఆకులో వడ్డించే సాంప్రదాయ 'కేరళ సద్య', వెజిటెబుల్ లేదా చికెన్ స్టూతో సాఫ్ట్ 'ఆప్పం', స్పైసీ కర్రీస్‌తో 'మలబార్ పరోటా' తింటే ఆహా అనాల్సిందే.
షాపింగ్ లవర్స్ కోసం ఇక్కడ ఫ్రెష్‌గా దొరికే ఏలకులు, లవంగాలు వంటి మసాలా దినుసులు, హోమ్‌మేడ్ చాక్లెట్స్, కరకరలాడే బానానా చిప్స్ దొరుకుతాయి. ఇవి ఇంటికి స్వీట్ మెమోరీస్‌గా తెచ్చుకోవచ్చు.
ఎక్కడ స్టే చేయాలి? ప్రశాంతమైన వాతావరణం
మున్నార్‌లో బడ్జెట్ హోటళ్ల నుంచి లగ్జరీ రిసార్ట్‌ల వరకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. టీ తోటల వ్యూస్ కనిపించే లగ్జరీ రిసార్ట్‌లు, బొటిక్ హోటళ్లు, హోమ్‌స్టేలు, గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి.
టీ తోటల మధ్య కొండలపై ఉన్న 'ఫ్రాగ్రెంట్ నేచర్ మున్నార్' వంటి బొటిక్ రిసార్ట్‌లు లగ్జరీకి, ప్రశాంతతకు మంచి ఆప్షన్. ఇక్కడ సాంప్రదాయ కేరళ ఆతిథ్యం, ఆయుర్వేద స్పా సౌకర్యాలు లభిస్తాయి. అయితే, వీకెండ్స్, పీక్ హాలిడే సీజన్లలో వెళ్లేవారు ముందుగానే రూమ్స్ బుక్ చేసుకోవడం మంచిది.
హైదరాబాద్ నుంచి మున్నార్ ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి మున్నార్ చేరుకోవడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి..
• విమానం ద్వారా: హైదరాబాద్ నుంచి కొచ్చి కి ఫ్లైట్‌లో వెళ్లవచ్చు. కొచ్చి ఎయిర్‌పోర్ట్ నుంచి మున్నార్ సుమారు 119 నుండి 125 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి టాక్సీ లేదా బస్సులో 4 గంటల్లో మున్నార్ చేరుకోవచ్చు.
• రైలు ద్వారా: హైదరాబాద్ నుంచి ఎర్నాకుళం జంక్షన్ లేదా అలూవా రైల్వే స్టేషన్‌కు రైలులో వెళ్లవచ్చు. ఎర్నాకుళం నుంచి మున్నార్ సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి క్యాబ్ లేదా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు ద్వారా వెళ్లవచ్చు.
• రోడ్డు ద్వారా: లాంగ్ డ్రైవ్ లేదా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేసేవారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన మున్నార్ వెళ్లవచ్చు. ఈ దూరం సుమారు 900 నుంచి 950 కిలోమీటర్లు ఉంటుంది. డ్రైవింగ్‌కు దాదాపు 15 నుంచి 17 గంటల సమయం పడుతుంది.
ఎప్పుడు వెళ్లాలి?
మున్నార్ సందర్శించడానికి సెప్టెంబర్ నుంచి మార్చి వరకు సరైన సమయం. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా, స్పష్టంగా ఉండి సైట్‌సీయింగ్‌కు చాలా బాగుంటుంది. ఇక వర్షాకాలం అందాలు, ఉధృతంగా పారే జలపాతాలు చూడాలనుకునేవారు జూన్ నుంచి ఆగస్టు మధ్య ప్లాన్ చేసుకోవచ్చు. చల్లని గాలి, టీ తోటల సువాసన, మంచు మేఘాల నడుమ మరపురాని అనుభూతిని పొందడానికి మున్నార్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్.

