బరువు తగ్గాలని ఆలోచిస్తూ చాలా మంది ఆహారాన్ని పూర్తిగా తగ్గించే పొరపాటు చేస్తారు. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను ఇవ్వకుండా బలహీనతకు దారితీస్తుంది
ఈ రోజుల్లో చాలా మందికి థైరాయిడ్ సమస్య తో బాధపడుతున్నారు. కొందరిలో ఇది బరువు తగ్గడానికి కారణమవుతుంటే, మరికొందరిలో బరువు విపరీతంగా పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా తయారవడం వల్ల మెటబాలిజం మందగిస్తుంది. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుని బరువు వేగంగా పెరుగుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలని చాలామంది ప్రయత్నిస్తారు కానీ కొన్ని ముఖ్యమైన తప్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా, బరువు ఇంకా పెరిగేలా చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
గ్లెసమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం..
థైరాయిడ్ పేషెంట్లు బరువు తగ్గాలని చూస్తున్నప్పుడు, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను పూర్తిగా నివారించాలి. మైదా పిండి, వైట్ బ్రెడ్, కేకులు వంటి వాటిలో GI ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను వేగంగా పెంచి, కొవ్వుగా మారే అవకాశాన్ని పెంచుతాయి. అందుకే ఇవి మీ డైట్ నుంచి తీసేయాలి.
ఆహారాన్ని పూర్తిగా మానేయడం..
బరువు తగ్గాలని ఆలోచిస్తూ చాలా మంది ఆహారాన్ని పూర్తిగా తగ్గించే పొరపాటు చేస్తారు. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను ఇవ్వకుండా బలహీనతకు దారితీస్తుంది. మెటబాలిజం మరింత మందగిస్తుంది. కాబట్టి, ప్రొటీన్, ఫైబర్, మినరల్స్ ఉన్న ఆరోగ్యకరమైన ఆహారాన్ని తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి.
వీటిని మాత్రం తినకూడదు..
థైరాయిడ్ సమస్య ఉన్నవారు గోయిట్రోజెన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను అప్రమత్తంగా తీసుకోవాలి. ఇవి అయోడిన్ శోషణను తగ్గించే అవకాశముండడం వల్ల, ఎక్కువగా తీసుకుంటే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. కావున బ్రోకలి, కాలీఫ్లవర్, సోయా వంటి పదార్థాలను పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
తగినంత నీరు..
థైరాయిడ్ పేషెంట్లు పుష్కలంగా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపించడంలో, జీర్ణక్రియను మెరుగుపరిచే విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకి కనీసం 8 గ్లాసుల నీరు తాగడం, కొన్నిసార్లు నారింజ రసం, కొబ్బరి నీరు వంటి హెల్తీ లిక్విడ్స్ తీసుకోవడం ఉత్తమం.


