సారాంశం
Masala Buttermilk: ఎండలో బయటకు వెళ్లే ఇంటికి రాగానే విపరీతంగా దాహం వేస్తుంది కదా. దీంతో ఏదో ఒక కూల్ డ్రింక్ తాగేస్తాం. ఇది తాత్కాలికంగానే దాహం తీరుస్తుంది తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. కాని చల్లని మజ్జిగ తాగితే శరీరానికి బలం, వేసవి తాపం నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. ఈ మజ్జిగకు కాస్త మసాలా యాడ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు శరీరానికి ఉష్ణాన్ని అందిస్తే, మజ్జిగ చలువ చేయడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. వేసవిలో వడదెబ్బ నుంచి రక్షణ పొందడానికి మజ్జిగ ఒక మంచి మెడిసన్ లా కూడా పనిచేస్తుంది.
మసాలా మజ్జిగతో రుచి, ఆరోగ్యం
సాధారణ మజ్జిగను మరింత రుచిగా, ఆరోగ్యకరంగా మార్చడానికి కొన్ని మసాలా దినుసులను యాడ్ చేస్తే మసాలా మజ్జిగ తయారవుతుంది. ఈ మసాలాలు మజ్జిగలో ఔషధ గుణాలను మరింత పెంచుతాయి. ఈ మసాలా మజ్జిగను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మసాలా మజ్జిగ తయారీకి కావాల్సినవి
పుల్లటి పెరుగు - 1 కప్పు
చల్లటి నీళ్ళు - 1 నుంచి 1.5 కప్పులు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - 1
కొత్తిమీర - కొద్దిగా
పుదీనా - కొద్దిగా
జీలకర్ర పొడి - 1/2 టీస్పూన్
చాట్ మసాలా - 1/4 టీస్పూన్
కళా నమక్ - 1/4 టీస్పూన్
ఉప్పు - తగినంత
తయారీ విధానం
ముందుగా, పెరుగుని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ముద్దలు లేకుండా మెత్తగా కలపాలి. తగినన్ని చల్లటి నీళ్ళు కలిపి మళ్ళీ కలపాలి. మజ్జిగ పలుచగా ఉండాలంటే మరికొన్ని నీళ్ళు కలపవచ్చు. ఇప్పుడు తురిమిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులను మజ్జిగలో వేయాలి. జీలకర్ర పొడి, చాట్ మసాలా, కళా నమక్ వేసి బాగా కలపాలి. చివరగా తగినంత ఉప్పు వేసి రుచి చూడాలి. మసాలా మజ్జిగను ఫ్రిజ్‌లో కొంతసేపు ఉంచి తాగితే చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు.
వడదెబ్బ నుంచి రక్షణ ఎలా?
వడదెబ్బ అనేది శరీరంలో అధిక వేడి కారణంగా వచ్చే ప్రమాదకరమైన సమస్య. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంటుంది. వేసవిలో మసాలా మజ్జిగ తాగడం వల్ల వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. వేసవిలో చెమట ద్వారా శరీరం నుంచి నీరు బయటకు వెళ్ళిపోతుంది. అందుకే తరచూ మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావలసిన నీరు అందుతుంది. మజ్జిగలోని ఎలక్ట్రోలైట్స్, ఖనిజాలు శరీరాన్ని చల్లగా ఉంచి, వడదెబ్బ రాకుండా కాపాడతాయి. మజ్జిగలోని మంచి బాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలకు కూడా మజ్జిగ మంచి ఔషధంలా పనిచేస్తుంది. మజ్జిగ శరీరానికి చలువ చేస్తుంది. దీన్ని తాగితే శరీర ఉష్ణోగ్రత తగ్గి, ఉత్సాహంగా ఉంటుంది. మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్లు వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి.