పచ్చి బొప్పాయి ని చాలా సులభంగా ఇంట్లోనే పండించొచ్చు. అది కూడా ఎలాంటి కెమిక్సల్ లేకుండానే.. మరి, అదెలాగో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా? చదివేయండి..
బొప్పాయి పండు ఆరోగ్యానికి ఎంత మంచిదో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ తినాల్సిన ఈ పండులో విటమిన్ ఎ, సి, ఇ, బి, కె, ఫోలేట్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మాన్ని అందంగా మారుస్తాయి.
అందుకే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ ఒక గిన్నెడు బొప్పాయి ముక్కలు తినాలి అని నిపుణులు కూడా సలహా ఇస్తూ ఉంటారు. కానీ, చాలాసార్లు మనం బయట నుంచి కొనే బొప్పాయి పండ్లు చాలా పచ్చిగా ఉంటాయి. అవి పండటానికి నాలుగు ఐదు రోజులు పడుతుంది. తీరా మనం చూసి కోసేలోగా కాయ పాడైపోతుంది. అలా కాకుండా, కాయ పాడవ్వకుండా.. ఇంట్లోనే తొందరగా బొప్పాయి పండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం…

పచ్చి బొప్పాయిని త్వరగా పండించడానికి చిట్కాలు
మీరు కొన్న బొప్పాయి పచ్చిగా ఉంటే, దాన్ని పాత పేపర్‌లో చుట్టి మూసి ఉన్న డ్రాయర్ లేదా అలమారాలో ఒక రాత్రి ఉంచండి. పేపర్‌లోని తేమ, ఎథిలీన్ వాయువు బొప్పాయిని త్వరగా పండించడంలో సహాయపడతాయి. 12 నుంచి 18 గంటల్లో బొప్పాయి పండుతుంది.

బియ్యం డబ్బాలో ఉంచండి
బొప్పాయిని త్వరగా పండించడానికి, దాన్ని బియ్యం డబ్బాలో పెట్టి మూత పెట్టండి. బియ్యం నుంచి వెలువడే వాయువు బొప్పాయిని త్వరగా పండిస్తుంది. ఒక రోజులోనే బొప్పాయి పచ్చగా నుంచి ఎర్రగా మారుతుంది.
అరటిపండుతో ఉంచండి
అవును, బొప్పాయిని రెండు మూడు పండిన అరటిపండ్లతో పాటు ఒక పేపర్ సంచిలో లేదా పేపర్‌లో చుట్టి ఉంచండి. అరటిపండు నుంచి వెలువడే ఎథిలీన్ వాయువు బొప్పాయిని పండించడంలో సహాయపడుతుంది. పచ్చి బొప్పాయి 8 నుంచి 10 గంటల్లోనే పండుతుంది.

బెల్లంతో ఉంచండి
బొప్పాయి దగ్గర బెల్లం ముక్కలు ఉంచడం వల్ల కూడా బొప్పాయి త్వరగా పండుతుంది. పేపర్‌లో చుట్టేటప్పుడు బెల్లం ముక్కలు కూడా వేయండి. బెల్లంలో కూడా సహజ వాయువు ఉంటుంది, ఇది పండ్లను త్వరగా పండిస్తుంది.
వేడి నీటిలో నానబెట్టండి
బొప్పాయిని గోరువెచ్చని నీటిలో 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టి, తర్వాత దాన్ని బయటకు తీసి, ఒక వస్త్రంలో చుట్టి, వెచ్చని ప్రదేశంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఒక రోజులోనే పచ్చి బొప్పాయి పండుతుంది.
