Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్ కోసం సన్నిహితులను వాడుకున్నాడు: సుశాంత్‌పై రియా సంచలన ఆరోపణలు

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సినీనటి రియా చక్రవర్తి రెండోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబై హైకోర్టు నేటి త‌న విచార‌ణ‌ల‌న్నింటిని వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌ల‌తో స‌హా వాయిదా వేసింది

Sushant "Took Advantage Of Those Closest" For Drugs: Rhea Chakraborty says In her bail plea
Author
Mumbai, First Published Sep 23, 2020, 4:30 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ సినీనటి రియా చక్రవర్తి రెండోసారి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంది. భారీ వ‌ర్షాల కార‌ణంగా ముంబై హైకోర్టు నేటి త‌న విచార‌ణ‌ల‌న్నింటిని వ‌ర్చువ‌ల్ విచార‌ణ‌ల‌తో స‌హా వాయిదా వేసింది.

ఈ నేప‌థ్యంలో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించి డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ల విచార‌ణ వాయిదా ప‌డింది.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జస్టిస్ సారంగ్ కొత్వాల్ సింగిల్ బెంచ్ రియా బెయిల్ పిటిష‌న్‌ను బుధవారం విచారించాల్సి ఉంది. కాగా ఈ కేసులో రియా చక్రవర్తి పాత్రను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆరా తీస్తోంది.

ఈడీ, ఎన్సీబీ, సీబీఐలు వేరు వేరుగా సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. అయితే సుశాంత్ తన మాదక ద్రవ్యాల అలవాటును కొనసాగించడానికి తన సన్నిహితులను వాడుకున్నాడంటూ రియా ఆరోపిస్తోంది.

జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్, ఇతర ఆరోపణలపై రియా చక్రవర్తిని సెప్టెంబర్ 9న  ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఆమె డ్రగ్స్ సిండికేట్‌లో కీలక సభ్యురాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆరోపించింది.

ప్రస్తుతం ముంబై బైకుల్లా జైలులో ఉన్న రియా కస్టడీని కోర్టు అక్టోబర్ 6 వరకు పొడిగించింది. కోర్టుకు సమర్పించిన బెయిల్ పిటిషన్‌లో సుశాంత్ మాత్రమే డ్రగ్స్ తీసుకునేవాడని..అతను తన సిబ్బందిని మాదక ద్రవ్యాలు తీసుకురావాల్సిందిగా చెప్పేవాడని రియా పేర్కొంది.

సుశాంత్ ఒకవేళ ప్రాణాలతో వుంది వుంటే అతనిపై అనేక డ్రగ్స్ కేసులు నమోదయ్యేవని ఆమె ఆరోపించింది. డ్రగ్స్‌ను వినియోగించిన వ్యక్తికి కనిష్టంగా ఏడాది.. గరిష్టంగా 20 ఏళ్లల జైలు శిక్ష విధిస్తారని రియా పేర్కొంది.

తన ఇంట్లో పనిచేసే వ్యక్తిగత సిబ్బంది, తాను, తన సోదరుడు షోవిక్ చక్రవర్తిని మాదక ద్రవ్యాలను తీసుకురావాల్సిందిగా సుశాంత్ కోరేవాడని ఆమె చెప్పింది. ఇందుకు సంబంధించి ఆధారాలు దొరక్కుండా చూసుకున్నాడని రియా తన బెయిల్ పిటిషన్‌లో పేర్కొంది.

తన అలవాటు కోసం సన్నిహితులను ఉపయోగించుకోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరణానికి మూడు రోజులు ముందు కూడా సుశాంత్ తన కుక్ నీరజ్‌ను గంజా జాయింట్లు, రోల్స్, డూబీలు తయారు చేసి బెడ్‌రూమ్‌లో ఉంచాల్సిందిగా కోరాడని రియా పేర్కొంది.

సీబీఐ, ముంబై  పోలీసుల విచారణలో నీరజ్ ఈ విషయాన్ని ఒప్పుకున్నట్లుగా ఆమె తెలిపింది. దర్యాప్తు సంస్థలు సేకరించిన ఆధారాలను ఒకసారి పరిశీలిస్తే కేవలం సుశాంత్ మాత్రమే డ్రగ్స్ వాడేవాడని, తాము అతనికి సహాయం చేసేవాళ్లమన్న సంగతి తెలుస్తుందని రియా తన బెయిల్ పిటిషన్‌లో ప్రస్తావించింది.

47 పేజీలో పిటిషన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అతని కుటుంబంతో సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపింది. కేదార్‌నాథ్ సినిమా షూటింగ్ సమయంలో సుశాంత్‌కి గంజాయితో సిగరెట్లు తాగే అలవాటుందని తనకు తెలిసిందని రియా వెల్లడించింది.

సుశాంత్‌కు మాదక ద్రవ్యాలు సరఫరా చేసినందుకు తనని, అతని సిబ్బందిని, తన సోదరుడు షోవిక్‌తో ఇతరులను నిందించడం కంటే.. సుశాంత్ డ్రగ్స్‌ను ఎలా సంపాదించాడనే దానిపై అతని ఫోన్, ఫోన్ కాల్ డేటా, వాట్సాప్, ఈ మెయిల్‌ల సంగతిని ప్రాసిక్యూషన్‌ ప్రస్తావించలేదని రియా తెలిపారు. తను చేసిన నేరం పరిధి చాలా తక్కువని ఆమె బెయిల్ పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios