Asianet News TeluguAsianet News Telugu

పిల్లి మెడలో గంట కట్టేది రాజమౌళే, వీడియో వదలుతారట

క‌రోనా సినీ ఇండ‌స్ట్రీని భారీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. షూటింగ్‌లు లేవు, రిలీజ్‌కి రెడీగా వున్న సినిమాల‌కు థియేట‌ర్లు లేవు. రోజు వారీ కార్మికుల‌కు ప‌ని లేదు. ఈ నేపధ్యంలో షూటింగ్స్ కు కేసీఆర్ ఫర్మిషన్ ఇవ్వటం ఇండస్ట్రీకి పెద్ద ఊరటగా మారింది

RRR to resume test shoot adhering guidelines
Author
Hyderabad, First Published Jun 12, 2020, 10:11 AM IST

సినిమా షూటింగ్ లకు ఎట్టకేలకు ఫర్మిషన్స్ లభించాయి. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వరకూ చేసుకోవచ్చని ఇదివరకే చెప్పిన తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ లకి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పనిలో పనిగా... ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ  ఫర్మిషన్స్ ఇచ్చేసింది. దాంతో దాదాపు రెండున్నర నెలలుగా షూటింగ్ లు ఆపేసిన సినీ పరిశ్రమ  తిరిగి పనులు  ప్రారంభించేందుకు రెడీ అయ్యింది. అయితే అదే సమయంలో ఫర్మిషన్స్ వచ్చాయన్న ఆనందంకంటే...అనేక పరిమితుల మధ్య షూటింగ్ లు  చేసుకోవాల్సి రావడం దర్శక నిర్మాతల్ని, నటుల్ని, సాంకేతిక టీమ్ లను ఆలోచనలో పడేసింది. కొవిడ్‌-19 రూల్స్ ని, షూటింగ్ ల కోసం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్‌లు చేయడం మామూలు విషయం కాదని అందరూ భావిస్తున్నారు.

దాంతో ఎవరైనా షూటింగ్ లు మొదలెట్టి సక్సెస్ అయ్యితే ఆ సాధక బాధకాలు గమనించి, అప్పుడు తాము ముందుకు అడుగు వేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అంటే పిల్లి మెడలో గంట కట్టేదెవరు అన్న పరిస్దితి ఉందన్నమాట. ఈ పరిస్దితుల్లో  ఈ పరిమితుల్లో షూటింగ్ చేయటానికి రాజమౌళి ముందుకు వస్తున్నట్లు సమాచారం. ఆయన రెండు రోజుల టెస్ట్ షూట్ కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.భౌతిక దూరం, పీపీఈ కిట్స్, థెర్మామీటర్స్, హ్యాండ్ శానిటైజర్స్, మిగిలిన కరోనా జాగ్రత్తలు  పాటిస్తూ `ఆర్ఆర్ఆర్‌` కోసం రాజ‌మౌళి టెస్ట్ షూట్ చేయ‌డానికి రంగం సిద్దం చేస్తున్నారు. 

రాజ‌మౌళి టెస్ట్ షూట్ రిజ‌ల్ట్ ని బ‌ట్టి మిగతా సినిమాలు షూటింగ్‌ల‌ు మొదలు కానున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం పరిశ్రమ కోసం రాజమౌళి ఈ ముందడగు వేస్తున్నారు. ఈ షూట్ అయ్యాక తాము సెట్ పై ఎదుర్కొన్న సమస్యలు, ఎలా ఇబ్బందులను అధిగమనించారు వంటివి వీడియో రూపంలో మీడియాకు రిలీజ్ చేస్తారని వినపడుతోంది. దాంతో అందరూ రాజమౌళి వైపే చూస్తున్నారు.   ‘షూటింగ్‌కు   వెళ్లకుండా ఇక ఆగలేను. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సిద్ధమైపోదాం.’  అంటున్నారు దర్శకుడు రాజమౌళి.   `ఆర్ఆర్ఆర్‌` ఇప్ప‌టి వ‌ర‌కు 70 శాతం షూటింగ్ పూర్త‌యిన విష‌యం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios