కొన్ని హిట్ కాంబినేషన్స్ కు ఉండే క్రేజ్ వేరు. అలాంటి కాంబోలలో ...రవితేజ, గోపీచంద్ మలినేని ది ఒకటి. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్‌'.  ఈ చిత్ర షూటింగ్‌కు క‌రోనా వ‌ల‌న తాత్కాలిక బ్రేక్ ప‌డింది. రీసెంట్‌గా తిరిగి షూటింగ్ మొద‌లు పెట్టారు. చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. కోవిడ్‌ నిబంధనలను పాటిస్తూ 'క్రాక్‌' యూనిట్‌ షూటింగ్‌ను ఎలా నిర్వహిస్తుందనే విషయాలతో ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు. 

యూనిట్‌ సభ్యులకు కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడం, యూనిట్‌ సభ్యులు మాస్కులు ధరించి శానిటైజర్స్‌ ఉపయోగిస్తూ షూటింగ్‌లో పాల్గొనే సన్నివేశాలన్నీ ఈ మేకింగ్‌ వీడియోలో ఉన్నాయి. వీడియో చివ‌ర‌న స్టేషన్‌లో ఉన్న‌ప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్‌లో పెట్టుకోవ‌డం నేర్చుకో అంటూ ర‌వితేజ సీరియస్‌గా డైలాగ్ చెబుతారు. 

ఠాగూర్‌ మధు నిర్మిస్తోన్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఇందులో కీలక పాత్రల్లో  నటిస్తున్నారు. 'డాన్‌శీను, బలుపు' చిత్రాల తర్వాత రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలున్నాయి. ఇందులో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటిస్తున్నారు.