స్యాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా 'సైరా నరసింహారెడ్డి' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఇలా ఉండగా.. ఇటీవల ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబానికి చెందిన కొందరు వ్యక్తులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే.

‘సైరా’ సినిమా కోసం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను తమ వద్ద నుంచి తీసుకున్నారని, తమ పొలాల్లో షూటింగ్‌ చేసి వాటిని నాశనం చేశారని ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఆరోపణలు చేశారు. ఆ సమయంలో రామ్ చరణ్ తమకు ఆర్ధిక సహాయం చేసి ఆదుకుంటామని చెప్పారని కానీ ఇప్పటివరకు తమకు ఎలాంటి సహాయం 
అందలేదని అన్నారు.

తాజాగా ఈ వివాదంపై రామ్ చరణ్ స్పందించారు. గతంలో ఉయ్యాలవాడ కుటుంబాలను కలిశానని.. వారితో మాట్లాడానని చెప్పారు రామ్ చరం. ఒక వ్యక్తి జీవిత చరిత్రను తీసేటప్పుడు 100 సంవత్సరాల దాటిన తరువాత దాన్ని ఎవరైనా తీసుకోవచ్చని.. ఇది సుప్రీంకోర్టు  తీర్పనిఅన్నారు. ‘ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి’ లాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడిని ఒక కుటుంబానికి లేదా కొంతమంది వ్యక్తులకు పరిమితం చేయడమనేది తనకు అర్ధం కావడం లేదని అన్నారు.

ఆయన దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తని.. ఉయ్యాలవాడ అనే ఊరి కోసం నిలబడ్డారని.. ఏదైనా చేయాలనుకుంటే ఆ ఊరి కోసం చేస్తానని, ఆ జనం కోసం చేస్తానే తప్ప.. ఒక కుటుంబానికి లేదా నలుగురి వ్యక్తుల కోసం చేయనని తేల్చి చెప్పారు రామ్ చరణ్.