బాలయ్య సినిమాల టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. టైటిల్ లోనే మాస్ ని ఎట్రాక్ట్ చేసే టెక్నిక్ తో ముందుకు వెళ్తూంటారు.  అందులోనూ బోయపాటి శ్రీను తో చేస్తున్న సినిమా అంటే ఆ టైటిల్ ఎలా ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో "సింహా", "లెజెండ్" చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు కూడా వీళ్లద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రానికి ఓ శక్తివంతమైన టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం. బాలయ్య 60 వ పుట్టిన రోజైన జూన్ 10 న టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ రివీల్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి. ఇంతకీ టైటిల్ ఏంటి అంటారా.."మోనార్క్".
 
ఇక లాక్ డౌన్ కు ముందే  షూటింగ్ మొదలెట్టిన బోయపాటి..ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే ఉంటున్నారు. అయితే సినిమాకు సంభందించిన రకరకాల పనులలో బోయపాటి బిజీగా ఉన్నారు. ఇక  ఈ సినిమా గురించి రకరకాల వార్తలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించిన ఓ వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో కీ రోల్ చేయబోతున్నట్లు సమాచారం. 

మొదట నుంచీ ఆ పాత్రను సీనియర్ హీరోలలో ఎవరైనా చేస్తే బాగుంటుందని భావించిన బోయపాటి, చివరికి తొట్టెంపూడి వేణును ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కూడా ఎన్టీఆర్ హీరోగా బోయపాటి తెరకెక్కించిన 'దమ్ము' సినిమాలోను వేణు ఒక ముఖ్యమైన పాత్రను చేశాడు. మళ్లీ ఇంతకాలానికి ఆయనకి బోయపాటి అవకాశం ఇవ్వటం జరుగుతోంది. 

బాలయ్యతో చేస్తున్న బోయపాటి సినిమాలో ఆయన పాత్రకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని,కథను మలుపు తిప్పే కీ రోల్ అని  అంటున్నారు.  బాలయ్య పాత్ర గురించిన కొన్ని నిజాలు ఈ పాత్రకు తెలుస్తాయని, వాటితో కొంత డ్రామా నడుస్తుందని సమాచారం. ఈ మేరకు వేణు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.  

ఇక ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది.  అందులో ఓ పాత్రే అఘోరా అని సమాచారం. ఈ సినిమాలో బాలయ్య కవలలుగా రెండు పాత్రల్లో నటిస్తున్నారని, చిన్నతనంలోనే వారిద్దరు వేరు అయి ఒకరు వారణాసిలో, మరొకరు అనంతరపురంలో పెరుగుతారని ఇటీవల ప్రచారం జరిగింది.  
 
బోయపాటి మాట్లాడుతూ.. అఘోరా టైపు క్యారెక్టర్ ఒకటి ఉన్నమాట వాస్తవమే. దాన్ని ఎలా డిజైన్ చేశాం, ఎలా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. "సింహా", "లెజెండ్" నుంచి కొంచెం బయటకొచ్చి కొత్తగా ఏదైనా చేయాలని అనుకున్నప్పుడు నాకు ఆ పాత్ర తట్టింది. కాకపోతే సెటప్ అంతా కొత్తగా ఉంటుంది. కొత్తదనం కావాలంటే ఈమాత్రం ట్రై చేయాల్సిందే అని చెప్పారు.