ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు పెద్దలు. సామాన్యుడుకైనా, సెలబ్రెటీకైనా ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం. ఆ విషయంలో కావాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు నాగార్జున.  ఒక టైమ్ లో తాను ఆరోగ్యపరమైన సమస్యలతో తాను ఎంతో బాధపడ్డానని అక్కినేని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా తన ఆరోగ్య సమస్యల గురించి ఎవరికీ చెప్పలేదని అన్నారు. తాజాగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వివరించాచరు.

ఈ ఇంటర్వూలో లో భాగంగా  తన ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడుతూ.. శారీరకంగానే కాకుండా మానసికంగా సంతోషంగా ఉన్నప్పుడే మనం ఫిట్‌గా ఉన్నట్టు అర్థమని తెలిపారు. ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తూ.. ఫైట్లు, డ్యాన్స్‌లు చేయడం వల్ల దాదాపు ఆరు సంవత్సరాల క్రితం తాను తరచూ నడుం నొప్పి, మోకాళ్లు నొప్పులతో బాధపడ్డానని.. అలాంటి సమయంలో స్నేహితులు స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ గురించి తెలియజేశారని నాగ్‌ తెలిపారు. స్ట్రెంత్‌ ట్రైనింగ్‌ వల్ల తాను ఎంతో ఆరోగ్యవంతంగా మారానని.. తెలిసిన వాళ్లకి కూడా దీని గురించి చెప్పానని ఆయన వివరించారు.

అలాగే  ప్రకృతిపట్ల తనకున్న ఇష్టాన్ని తెలియజేశారు. హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో ఆరు ఎకరాల స్థలంలో తన తండ్రి ఇల్లు తీసుకున్నారని, ఇంటి ఆవరణలోనే ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారని.. దాని వల్ల చిన్నప్పటి నుంచే ప్రకృతిపై ప్రేమ ఉందని నాగార్జున తెలిపారు. అంతేకాకుండా వ్యవసాయ క్షేత్రంలో పండించే కూరగాయలనే ఇంట్లో వంటలకు ఉపయోగించేవారని, ఆవులు, చేపల పెంపకం కూడా తనకి తెలుసని ఆయన పేర్కొన్నారు.

‘మన్మథుడు-2’ తర్వాత నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో నాగ్‌ ఎన్‌ఐఏ ఏజెంట్‌ విజయ్‌ వర్మగా కనిపించనున్నారు. ఇందులో నాగార్జున ఏసీపీ విజయ్‌ వర్మ అనే శక్తిమంతమైన పోలీస్‌ పాత్ర పోషిస్తున్నారు.  కొందరు సంఘ విద్రోహ శక్తులను తుదముట్టించేందుకు ఓ ఆపరేషన్‌ కోసం రంగంలోకి దిగుతారు విజయ్‌ వర్మ. మరి ఆ రహస్య ఆపరేషన్‌ ఏంటి? ఆ విద్రోహ శక్తుల్ని ఆయన ఎలా మట్టు  పెట్టారు? వంటివి తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’ చిత్రం చూడాల్సిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయామీ ఖేర్‌ కీలకపాత్రలో నటించనున్నారు.