Asianet News TeluguAsianet News Telugu

‘మార్క్ ఆంటోని’రిలీజ్ పై హైకోర్ట్ స్టే, ఫేక్ అంటూ నిర్మాత?

 సినిమా రిలీజ్ కు ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు చిత్ర యూనిట్‌కు షాకే. 

Madras High Court Issues An Order Of Injunction Restraining The Release Of Vishal Mark Antony?jsp
Author
First Published Sep 9, 2023, 6:37 AM IST

శాల్ టైటిల్ పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్క్ ఆంటోని’. పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్‌పై అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా ‘మార్క్ ఆంటోని’ మూవీ ఈనెల 15న రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ టైమ్ లో ఈ సినిమా రిలీజ్ కు కోర్ట్ స్టే ఇచ్చిందని తమిళ మీడియాలోనూ,తెలుగులో మీడియాలోనూ వార్తలు  వస్తున్నాయి. అందులో నిజమెంత అనే క్లారిటీ మాత్రం లేదు. 

లైకా ప్రొడక్షన్స్‌కు ఉన్న అప్పుని విశాల్ (Vishal) చెల్లించకపోవడంతో ఆయన సినిమా ‘మార్క్ ఆంటోని’ (Mark Antony) విడుదలపై మద్రాస్ హైకోర్టు నిషేధం విధించిందని చెప్తున్నారు. సినిమా రిలీజ్ కు ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు చిత్ర యూనిట్‌కు షాకే.  లైకా ప్రొడక్షన్స్ నుంచి గతంలో హీరో విశాల్ రూ.21.29 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ డబ్బు తిరిగి చెల్లించే వరకు విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి వచ్చే అన్ని సినిమాల హక్కులను లైకా సంస్థకు ఇచ్చేలా ఎగ్రిమెంట్ చేసుకున్నారు. 

కానీ అప్పు ఇచ్చిన లైకాకు డబ్బులు క్లియర్ చేయకుండానే కిందటేడాది ‘వీరమే వాగై సూడుమ్’ (తెలుగులో ‘సామాన్యుడు’) సినిమాను థియేటర్లలో విడుదల చేయడానికి విశాల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ‘వీరమే వాగై సూడుమ్’ చిత్రం విడుదలను.. శాటిలైట్, OTT హక్కులను విక్రయించడాన్ని నిషేధించాలని లైకా ప్రొడక్షన్స్‌ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేసును విచారించిన సింగిల్ జడ్జి బెంచ్.. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట ఒక జాతీయ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేసి దానిలో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వులపై విశాల్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను విచారించిన ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి ఆదేశాలను ధ్రువీకరించింది. సింగిల్ జడ్జి ఆదేశానుసారం రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకపోతే ఈ కేసులో తీర్పు వచ్చే వరకు విశాల్ నిర్మించిన చిత్రాలను థియేటర్లలో, OTTలలో విడుదల చేయడానికి వీల్లేదని ఆదేశించింది. 

ఈ క్రమంలోనే విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోని’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఈరోజు హైకోర్టులో ఈ కేసు మరోసారి విచారణకు వచ్చిందని చెప్తున్నారు. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇప్పటి వరకు విశాల్ రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయలేదని హైకోర్టుకు లైకా ప్రొడక్షన్స్ సంస్థ విన్నవించింది. అంతేకాకుండా, రూ.15 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయకుండా ‘మార్క ఆంటోని’ సినిమాను ఈనెల 15న విడుదల చేస్తున్నారని చెప్పింది. దీంతో ఈ సినిమా విడుదలపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం సెప్టెంబర్ 12న విశాల్ వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిందని తమిళ మీడియా అంటోంది. 

అయితే ఇదే సమయంలో  ఈ వార్తలను చిత్ర నిర్మాత వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఇవి నిరాధారమైన వార్తలుగా కొట్టిపారేశారు. ఈ వార్తలను ప్రసారం చేసిన చానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అనుకున్నట్లుగానే ఈ సినిమా విడుదల అవుతుందని వెల్లడించారు. రీసెంట్ గా తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. గ్యాంగ్ స్టర్  కథాశంతో రూపొందిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios