ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ప్రసారమవుతున్న 'జబర్దస్త్' షోకి జనాల్లో ఎంత పాపులారిటీ దక్కిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ షోలో చేసే కొన్ని స్కిట్ లు కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉండడం లేదని గతంలో ఈ షోపై ఫిర్యాదులు చేశారు.

కొన్ని సన్నివేశాలు జుకుప్సాకరంగా ఉంటున్నాయని చాలా రోజులుగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. కొన్ని సామాజిక వర్గాల వారిని, వారి వృత్తులను కించపరిచే విధంగా షోలో స్కిట్ లు ఉండడంతో గతంలో చాలా వివాదాలు చోటుచేసుకున్నాయి.

తాజాగా ఈ షోలో చేసి గల్ఫ్ కార్మికుల స్కిట్ వివాదాస్పదంగా మారింది. గల్ఫ్ కార్మికులను వారి కుటుంబ సభ్యులను, మహిళలను అవమానించే విధంగా ఆ స్కిట్ ఉందని జగిత్యాలలో తెలంగాణా గల్ఫ్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 

గల్ఫ్ కార్మికులను అవమానించే విధంగా అసభ్యకరమైన పదజాలంతో స్కిట్ చేయడంపై వారు మండిపడుతున్నారు. ఆ స్కిట్ చేసిన కమెడియన్లపై, జబర్దస్త్ షోపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తోన్న నాగబాబు, రోజా, యాంకర్ రష్మిలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.