ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారిని భారత అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించాలని కోరారు. 5 దశాబ్దాలకు పైగా దేశ చలన చిత్ర పరిశ్రమకు సేవలు అందించిన అరుదైన గాయకుడు బాలుకు భారతరత్న సరైన గౌరవం అని అభిప్రాయపడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ చేసిన అభ్యర్థనకు సర్వత్రా ప్రసంశలు దక్కాయి. కాగా విశ్వనటుడు కమల్ సైతం సీఎం జగన్ లేఖపై ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. 

కమల్ హాసన్ ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ లేఖపై స్పందించారు. ' ఆంధ్రప్రదేశ్ గౌరవముఖ్యమంత్రికి ధన్యవాదాలు, అన్నయ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం కేంద్రానికి మీరు చేసిన విజ్ఞప్తికి కృతజ్ఞతలు. ఒక్క తమిళనాడే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల సెంటిమెంట్ గా ఇది ఉంది'' అని కమల్ ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా బాలుతో అనుబంధం కలిగి ఉన్న కమల్ హాసన్ ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారు. 

ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ములకు మించిన అనుబంధం కమల్, బాలు మధ్యన వుంది. బాలు మృతికి అత్యంత కృంగిపోయిన వ్యక్తులలో కమల్ ఒకరు. కమల్ హాసన్ ప్రతి సినిమాకు తెలుగు డబ్బింగ్ బాలు చెప్పారు. కమల్ హీరోగా బాలు కొన్ని సినిమాలు నిర్మించడం విశేషం. దీనితో సీఎం జగన్ బాలును భారతరత్నతో సత్కరించాలన్న అభ్యర్ధనకు కమల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సింగర్ గా లతా మంగేష్కర్ ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.