జడేజా ఆల్ రౌండ్ షో.. పంజాబ్ పై గెలుపుతో పాయింట్ల పట్టికలో టాప్-3లో చెన్నై సూపర్ కింగ్స్
IPL 2024 PBKS vs CSK : 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ కు తుషార్ దేశ్ పాండే రెండో ఓవర్లో డబుల్ షాక్ ఇచ్చాడు. ఐదో బంతికి జానీ బెయిర్ స్టో (7)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి బంతికి రిలీ రోసోవ్ ను ఔట్ చేశాడు.
PBKS vs CSK: ధర్మశాలలో జరిగిన ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. రవీంద్ర జడేజా బ్యాట్, బాల్ తో రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ ఆశలను పెంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై చివరలో జడేజా మంచి బ్యాటింగ్ ప్రదర్శనతో 168 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. 26 బంతుల్లో 43 పరుగులతో చెన్నై టాప్ స్కోరర్ గా నిలిచిన జడేజా బౌలింగ్ లోనూ నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. చెన్నై గెలుపులో హీరోగా నిలిచాడు.
ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. ఈ ఓటమితో 11 గేమ్‌లలో 8 పాయింట్లతో పంజాబ్ ప్లేఆఫ్ ఆశలకు ఎదురుదెబ్బ తగిలింది. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 167-9 పరుగులు చేయగా, పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 139-9 పరుగులు సాధించింది. 168 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ రెండో ఓవర్ లోనే తుషార్ దేశ్ పాండే డబుల్ షాక్ ఇచ్చాడు. ఐదో బంతికి జానీ బెయిర్‌స్టో (7)ను క్లీన్ బౌల్డ్ చేసిన దేశ్‌పాండే తర్వాతి బంతికి రిలే రోసోను ఔట్ చేశాడు. ప్రబ్ సిమ్రాన్ సింగ్, శశాంక్ సింగ్ లు ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపయారు.
ఎనిమిదో ఓవర్లో 62-2తో మెరుగైన స్థితిలో ఉన్న పంజాబ్.. మిచెల్ సాంట్నర్ చేతిలో శశాంక్ సింగ్ (20 బంతుల్లో 27) వికెట్లు కోల్పోవడంతో ఎదురుదెబ్బ తగిలింది. తర్వాతి ఓవర్ చివరి బంతికి జడేజా ప్రభ్‌సిమ్రన్ (23 బంతుల్లో 30)ను వెనక్కి పంపి పంజాబ్ పతనాన్ని శాసించాడు. 10వ ఓవర్లో సిమర్‌జీత్ సింగ్, జితేష్ శర్మ (0)ను గోల్డెన్ డకౌట్ చేసి పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. జడేజా 13వ ఓవర్‌లో కెప్టెన్ సామ్ కుర్రాన్ (7), అశుతోష్ శర్మ (3)లను పెవిలియన్ కు పంపడంతో పంజాబ్ కు ఓటమి తప్పలేదు.
హర్‌ప్రీత్ బ్రార్ (17*), హర్షల్ పటేల్ (12), రాహుల్ చాహర్ (16), కగిసో రబాడ (11*) ఆఖరి ఓవర్‌లలో పోరాడి పంజాబ్ ఓటమి భారాన్ని తగ్గించారు. చెన్నై తరఫున రవీంద్ర జడేజా నాలుగు ఓవర్లలో 20 పరుగులిచ్చి మూడు వికెట్లు, సిమర్‌జీత్ సింగ్ మూడు ఓవర్లలో 16, తుషార్ దేశ్‌పాండే 35 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. రవీంద్ర జడేజా (43 పరుగులు), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (21 బంతుల్లో 32), డారిల్ మిచెల్ (19 బంతుల్లో 30) రాణించడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. 25 బంతుల్లో 43 పరుగులు చేసిన జడేజా చెన్నై టాప్ స్కోరర్ గా నిలిచాడు. పంజాబ్ తరఫున హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ చెరో మూడు వికెట్లు తీయగా, ఎంఎస్ ధోనీ, శివమ్ దూబే గోల్డెన్ డక్‌గా ఔట్ అయ్యారు.