శివమ్ దూబే రెండవ గోల్డెన్ డక్.. ప్రపంచకప్ ఆటగాళ్ల ఫామ్‌పై భారత్ ఆందోళన
T20 World Cup India squad: టీ20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడే శివమ్ దుబే కు కూడా చోటుదక్కింది. అయితే, జట్టు ప్రకటించిన తర్వాత వరుసగా గోల్డెన్ డక్ కావడం, అతని ఫామ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది.
T20 World Cup India squad: ఐపీఎల్ 2024 53వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. రవీంద్ర జడేజా బ్యాట్, బాల్ తో రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 28 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ప్లేఆఫ్ ఆశలను పెంచుకుంది. ఈ మ్యాచ్ లో శివమ్ దుబె మరోసారి నిరాశపరిచాడు. పరుగులు చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టును ప్రకటించిన తర్వాత 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఆటగాళ్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్ తొలి అర్ధభాగంలో మెరిసిన శివమ్ దుబే ఇప్పుడు నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఐపీఎల్ 2024 53వ మ్యాచ్ లో శివమ్ దూబే గోల్డెన్ డక్‌గా నిలిచాడు. రెండు సార్లు పంజాబ్ కింగ్స్ ఇలానే ఔటయ్యాడు. గత వారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో వికెట్ ముందు దొరికిపోయిన శివమ్ దూబే.. తొలి బంతికి రాహుల్ చాహర్ బౌలింగ్‌లో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఐపీఎల్ 2024 లో మొదటి తొమ్మిది గేమ్‌లలో 43.75 సగటు, 170.73 స్ట్రైక్ రేట్‌తో 350 పరుగులు చేసిన శివమ్ దూబే.. భారత ప్రపంచ కప్ జట్టులో చేరిన తర్వాత వరుసగా పరుగులు చేయకుండా నిరాశ పరుస్తున్నాడు. దీంతో అతని ఫామ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత జట్టుకు ఈ ప్రదర్శన ఆందోళన కలిగించే విషయం. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతకుముందు ప్రపంచకప్ జట్టులో చేరిన తర్వాత గోల్డెన్ డక్‌తో ఔట్ కాగా, హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా డకౌట్ అయ్యాడు.
ప్రపంచకప్ భారత జట్టులోకి స్పిన్నర్‌గా వచ్చిన యుజ్వేంద్ర చాహల్ నాలుగు ఓవర్లలో 62 పరుగులతో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు. ప్రపంచకప్ జట్టు ప్రకటన తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌ల్లో కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. ప్రపంచకప్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ కోల్‌కతాపై హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అయితే, విరాట్ కోహ్లి.. ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన తర్వాత కూడా పరుగుల వరద పారిస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
అలాగే, ప్రపంచకప్ జట్టు ప్రకటనకు ముందు, తర్వాత నిలకడగా రాణిస్తున్న ఏకైక ఆటగాడు ముంబై పేసర్ జస్ప్రీత్ బుమ్రా. జట్టు ప్రకటనకు ముందు మహ్మద్ సిరాజ్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు, అయితే ప్రకటన తర్వాత ఫామ్‌లోకి వచ్చాడు. అయితే, అర్ష్‌దీప్ సింగ్ మళ్లీ నిరాశపరుస్తున్నాడు. కాబట్టి అందరు ఆటగాళ్లు మంచి ప్రదర్శన ఇస్తేనే భారత జట్టు మెగా టోర్నీ ట్రోఫీని గెలుచుకోగలదు. మన ప్లేయర్లు మళ్లీ మంచి ఫామ్ లోకి రావాలని భారత క్రికెట్ లవర్స్ కోరుకుంటున్నారు.