యంగ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు, డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ని షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు ఘటనలు బాలీవుడ్‌ని నాలుగు నెలలపాటు ఉక్కిరి బిక్కిరి చేశాయి.  ఆ వేడి క్రమంగా తగ్గుతుంది. డ్రగ్స్ కేసుకి బాలీవుడ్‌కి సంబంధాలు ఉన్నాయనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ కేసులో దీపికా పదుకొనె మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సారా అలీఖాన్‌లపై ఆరోపణలు వచ్చాయి. వారిని నార్కొటిక్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించింది. 

అయితే దీపికా పదుకొనె మేనేజర్‌ కరిష్మా ప్రకాష్‌కి, డ్రగ్స్ పెడ్లర్‌ లతో సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన డ్రగ్‌ పెడ్లర్‌ లను విచారించగా, కరిష్మా పేరు బయటకు వచ్చిందని ఎన్‌సీబీ అధికారులు తెలిపారు. వెర్నోవాలోని కరిష్మా నివాసంలో మంగళవారం ఎన్సీబీ అధికారుల దర్యాప్తులో 1.7గ్రాముల హషీష్‌, మూడు సీబీడీ ఆయిల్‌ బాటిళ్లని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెకి సమన్లు జారీ చేశారు. దీనిపై ఇప్పటి వరకు కరిష్మా స్పందించలేదు. అయితే తాజా సమాచారం మేరకు ఆమె పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. 

దీనిపై ఎన్‌సీబీ అధికారులు సీరియస్‌ అవుతున్నారు. కరిష్మాకి డ్రగ్స్ డీలర్లతో సంబంధాలుండగా, ఆమె నివాసం నుంచి డ్రగ్స్ రికవరీ చేయడం, తమకి సహకరించకపోవడం, సమన్లు జారీ చేసినా రెస్పాండ్‌ కాకపోవడం వంటి దాన్ని బట్టి చూస్తే కరిష్మా మరింత రిస్క్ లో పడిందని అధికారులు అంటున్నారు. ఆమెపై కఠినమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి పేరు బయటకు రావడం, ఆమె విచారణలో డ్రగ్స్ మాఫియా బయట పటడం వంటివి బాలీవుడ్‌కి నిద్ర లేకుండా చేశాయి.