ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత నిర్మాత ఛార్మీ ఇంట్లో విషాదం నెలకొంది. తన సమీప బంధువు మరణించటంతో తీవ్ర వేదనకు గురైన ఛార్మీ, తన భావోద్వేగాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. `ఇకలేరు.. ఈ విషయాన్ని నేను ఎప్పుడూ భరించలేను. కానీ జీవితం తనకు నచ్చినట్టుగానే నడుస్తుంది. నిన్న నువ్వు చేసిందే లాస్ట్ వీడియో కాల్‌. కానీ నేను అదే చివరి కాల్ అవుతుంది అనుకోలేదు.

నాకు మాటలు రావటం లేదు. నువ్వు నీ వైన్‌, ఇంకా భోజనాన్ని స్వర్గంలోనూ ఎంజాయ్ చేస్తావని అనుకుంటున్నాను. నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను. నీ స్థానాన్ని ఎవరూ భర్తి చేయలేరు` అంటూ తన ఆంటీకి నివాళులు అర్పించింది ఛార్మీ. ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్‌ లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్‌ నటించిన ఛార్మీ, బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.

అయితే జ్యోతి లక్ష్మీ సినిమాతో నటిగానే కాక నిర్మాతగానూ సత్తా చాటిన ఈ బ్యూటీ, తరువాత పూర్తిగా నటనకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసింది. పూర్తిగా నిర్మాణ రంగం మీద దృష్టి పెట్టి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మల్టీ లింగ్యువల్‌ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తోంది ఛార్మీ.