బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీగ లాగితే టాలీవుడ్‌లో డొంక కదులుతోంది. నిన్న నలుగురు హీరోయిన్లను విచారించిన ఎన్సీబీ వారిచ్చిన వివరాల ఆధారంగా నలుగురు తెలుగు హీరోయిన్లకు, హీరోలకు సమన్లు జారీ చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా చూసుకుంటే బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరికొందరు యాక్టర్లపై దృష్టి పెట్టింది ఎన్సీబీ. ప్రస్తుతం దీపిక, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎవరెవరికి, ఎటువంటి లింక్స్ ఉన్నాయి.?, ఎవరెవరికి ఫెడ్లర్ల నుంచి డ్రగ్స్ సరఫరా అయ్యాయి..? వాటి మూలాల్ని పెకలించే పనిలో ఉంది ఎన్సీబీ.

దీనిలో భాగంగా మరో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లను త్వరలో విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్లను మళ్లీ ప్రశ్నించేందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సిద్ధమవుతోంది.

ఎన్సీబీ నెట్‌వర్క్‌లో టాప్ హిందీ హీరోయిన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. 2015లో దీపికా పదకొణే డ్రగ్స్ కోసం ఛాటింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ముగ్గురు హీరోయిన్లను చేసిన విచారణలో ఎన్సీబీ సంతృప్తి చెందలేదు. అలాగే నార్కో స్కానర్‌లో బాలీవుడ్ హీరోలు వున్నారు.

రేపో, మాపో ప్రముఖ హిందీ హీరోలందరికీ సమన్లు జారీ చేసే అవకాశం వున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్స్ వాడే హీరోల జాబితా సిద్ధం చేసింది. కాగా తనకు సిగరెట్లు కావాలని దీపిక కోడ్ ద్వారా ఛాట్ చేసింది.

సిగరెట్లకు ‘‘ మాల్ ’’ అని, ‘‘యాష్’’ అనే పేరుతో స్లిమ్ సిగరెట్లకు, ‘‘వీడ్’’ మందపాటి సిగరెట్లకు కోడ్‌లుగా దీపిక కోడ్ వాడింది. అయితే దీపిక సమాధానాలకు సంతృప్తి చెందని ఎన్సీబీ మరోసారి విచారణకు పిలిచే అవకాశం వుంది.