నాగార్జున, ఆయన ముద్దుల తనయుడు అఖిల్‌, ఆమని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం `సిసింద్రీ`. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో నాగార్జున నిర్మించిన ఈ సినిమా 1995లో సెప్టెంబర్‌ 14న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో నాగార్జున తనయుడు అఖిల్‌ బాల నటుడిగా ఎంట్రీతోపాటు బాగా పాపులర్‌ అయ్యాడు. చిన్నప్పుడే స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడని చెప్పొచ్చు. 

అఖిల్‌ని ఇప్పటికీ `సిసింద్రీ`గానే పిలుచుకుంటాడు అభిమానులు. అంతగా అభిమానులను అకట్టుకున్నాడు బుల్లి అఖిల్‌. అయితే ఈ సినిమా విడుదలై నేటితో 25ఏళ్ళు పూర్తి చేసుకుంది. పాతికేళ్లు కంప్లీట్‌ చేసుకున్న సందర్భంగా ఈ సినిమాని గుర్తు చేసుకున్నారు. ఓ ఛానెల్‌ ఈ చిత్ర యూనిట్‌తో ప్రత్యేక చర్చ నిర్వహించింది. 

ఇందులో అఖిల్‌కి తల్లి పాత్రలో నటించిన ఆమని మాట్లాడుతూ, అఖిల్‌ ఇప్పటికీ తనకు బేబీ ఫీలింగే కలుగుతుందని చెప్పింది. ``సిసింద్రీ` సినిమా కోసం తల్లి పాత్రలో నన్ను నటించాలని నాగార్జున అడగ్గానే నో చెప్పకుండా నటించా. చాలా కష్టపడి ఈ సినిమా చేశాం. అఖిల్‌ నటించేందుకు అందరు సహకరించారు. ఇప్పటికే అఖిల్‌ ఎక్కడ కనిపించినా నన్ను అమ్మ అని పిలుస్తూ హత్తుకుంటాడు. అంతకంటే ప్రేమ ఎక్కడ లేదు` అని తెలిపింది. 

`అఖిల్‌ని చూస్తుంటే అప్పుడు ఎలాంటి ఫీలింగ్‌ ఉందో.. ఇప్పుడూ అదే ఫీలింగ్‌ ఉంటుంది. ప్రస్తుతం అఖిల్‌ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో తల్లిగా నటిస్తున్నా. అదొక మంచి అనుభూతి. అఖిల్‌ హీరో అయినప్పటికీ నాకు మాత్రం చిన్న బాబునే` అంటూ అమల తన సంతోషాన్ని పంచుకుంది. అయితే ఈ చర్చలో `సిసింద్రీ` సినిమా కంటే అఖిల్‌పైనే ఎక్కువ చర్చ జరగడం విశేషం. 

అఖిల్‌ ప్రస్తుతం `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఆమని ఆయనకు తల్లిగా నటిస్తుంది. దీంతోపాటు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ ఓ సినిమా చేయబోతున్నారు.