లాక్‌ డౌన్‌ ఎఫెక్ట్ సెలబ్రిటీల మీద కూడా భారీగానే ఉంది. తమ ఇంట్లో చిన్న చిన్న పార్టీలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునే తారలు, లాక్ డౌన్‌ కారణంగా అన్ని వేడుకలను సాధాసీదాగా  జరుపుకుంటున్నారు. ఇటీవల అల్లు అర్జున్‌ తన బర్త్‌ డే పాటు, తన కొడుకు బర్త్‌ డేను కూడా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నాడు. అయితే తాజాగా తన అసిస్టెంట్ పుట్టిన రోజును కూడా తన ఇంట్లోనే జరిపాడు అల్లు అర్జున్‌. శివ అనే వ్యక్తి చాలా కాలంగా అల్లు అర్జున్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

అయితే అతని పుట్టిన రోజును స్వయంగా బన్నీనే సెలబ్రేట్ చేశాడు. బయట కేక్‌ లాంటివి ఏవీ అందుబాటులో లేకపోయినా తన ఇంట్లోనే కేకును తయారు చేయించి మరి ఈ వేడుకను జరిపించాడు. బన్నీతో పాటు అల్లు అయాన్‌ కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావటంతో బన్నీ మంచి మనసును అభిమానులు మెచ్చుకుంటున్నారు. తమ అభిమాన నటుడు అసిస్టెంట్ల పట్ల కూడా ప్రవర్తిస్తున్న తీరుతో సంబరపడిపోతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. అల వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బన్నీ ఆ సినిమా తరువాత  షార్ట్ గ్యాప్ తీసుకొని సుకుమార్ సినిమాను ప్రారంభించాలని ప్లాన్ చేశాడు. కానీ లాక్ డౌన్‌ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. దీంతో బన్నీ కూడా ఇంట్లో నే ఉంటే లుక్ విషయంలో మరింతగా కేర్ తీసుకుంటున్నాడు.