హర్యానా హత్యాకాండకు, విధ్వంసానికి ఎవర్ని నిందించాలి?
ఆధ్యాత్మిక గురువు ముసుగులో మూఢనమ్మకాలకు బానిసలైన అమాయక ప్రజలను వంచిస్తూ, అత్యాచారాలకు, హత్యలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అఘాయిత్యం కేసులో నేరస్తుడని నిర్ధారించిన సిబిఐ ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేయడానికి సిద్ధమైన పూర్వరంగంలో నకిలీ ఆధ్యాత్మిక గురువు మద్ధతుదారులు హర్యానాలో విధ్వంసానికి తెగబడ్డారు. ఇప్పటికి 30 మంది ప్రాణాలు గాలిలో కలిపోయాయని ప్రసారమాధ్యమాల్లో చూస్తున్నాం.
విధ్వంసకాండ పంజాబ్, డిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లోను కొనసాగింది. అనేక వాహనాలు, రైలు బోగీలు, ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆస్తులు ఈ విధ్వంసకాండలో ధ్వంసమైనాయి. ఒక నేరస్తుడ్ని శిక్షించడానికి కోర్టు నిర్ధారణకు వస్తే నేరస్తుడి మద్ధతుదారులు పదుల వేల సంఖ్యలో వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి బరితెగిస్తే నిరోధించే శక్తి ప్రభుత్వాలకు లేక పోవడాన్ని చూస్తే మన రాజకీయ వ్యవస్థ డొల్లతనం బయట పడుతున్నది.
అధికారమే పరమావధిగా భావిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు ఈ తరహా నేరస్తుల మద్ధతు కోసం వెంపర్లాడుతూ, వారి చుట్టూ ప్రదక్షణలు చేస్తూ, కాళ్ళ మీద పడి దండాలు పెడుతున్న ఉదంతాలు కోకొల్లలు. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ మద్ధతును 2007 & 2012 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, 2014 హర్యానా శాసనసభ ఎన్నికల్లోను, అటుపై డిల్లీ మరియు బిహార్ శాసనసభల ఎన్నికల్లోను బిజెపి పొందాయి. ఆధ్యాత్మిక గురువులుగా ఛలామణి అవుతూ నేర సామ్రాజ్యాలను నిర్మించుకొన్న కరుడుకట్టిన నేరస్తులకు, రాజకీయ పార్టీలకు, నాయకుల మధ్య ఉన్న గాడాను బంధానికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఉదంతమే ప్రత్యక్ష ఉదాహరణ.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ పేరును బట్టే వివిధ మతాల విశ్వాసాలకు బానిసలైన అమాయక ప్రజానీకాన్ని మోసం, వంచనతో నేరప్రపంచాన్ని నిర్మించుకొనే దుర్భుద్ధి కనబడుతున్నది. 'డేరా సాఛా సౌదా' ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆ పునాదులపైనే నిర్మించుకొన్నారు. ఆధ్యాత్మిక గురువుగానే కాకుండా కొన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించడం, సినిమాలు తీయడం, నటించడం, పాటలు పాడడం వగైరా కలళు ప్రదర్శించారు. బడుగు బలహీన తరగతులకు చెందిన అమాయక ప్రజలను తన అనుచరులుగా మార్చుకొన్నారు.
ఒక మహిళా 'డేరా సాధ్వి' 2002లో నాటి ప్రధాన మంత్రి అతల్ బిహార్ వాజ్ పేయికి ఒక లేఖ ద్వారా తనపై గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అఘాయిత్యం చేశాడని, తనలాగే పలువురు మహిళలను మానభంగం చేశాడని ఫిర్యాదు చేసినా స్పందన కరవైయ్యింది. కానీ, పంజాబ్-హర్యానా హైకోర్టు కేసును సూమోటోగా స్వీకరించి, కేసు నమోదు చేసి, విచారణ జరపమని సిబిఐని ఆదేశించడంతో 15 ఏళ్ళ విచారణానంతరం నేటికి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నేరస్తుడని ప్రత్యేక కోర్టు నిర్ధారణ చేసింది. డేరా నేరాలపై కథనాలు వ్రాస్తున్నాడని ఒక విలేకరిని, అలాగే డేరా కేంద్రం మేనేజరుగా పని చేసిన మరొక ఉద్యోగస్తుడను కూడా హత్య వేయించాడన్న కేసులు విచారణలో ఉన్నాయి.
ఇలాంటి నేరస్తుడి మద్ధతు తీసుకొన్న, అతడ్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రదక్షిణలు చేసిన, ప్రశంసించిన కాంగ్రెస్, బిజెపి పెద్ద మనుషులను ఏమనాలి? స్వఛ్ఛ భారత్ కార్యక్రమంలో భాగస్వామి అయ్యాడని ప్రధాన మంత్రి మోడీ సహితం అత్యంత హేయమైన ఆరోపణలను ఎదుర్కొంటూ సిబిఐ కేసులో ముద్ధాయిగా ఉన్న వ్యక్తిని ప్రశంసించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!
స్వార్థ రాజకీయాల పరాకాష్టకు హర్యానా విధ్వంసకాండే ప్రబల నిదర్శనం. గుర్మీత్ రామ్ రహీ సింగ్ పై హర్యానా ముఖ్యమంత్రికి ఉన్న స్వామి భక్తే ఈ దుష్పరిణామాలకు దారి తీసిందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ లాంటి వారిని ప్రోత్సహిస్తూ, పెంచి పోషిస్తున్న రాజకీయ నాయకులున్నంత కాలం మన సమాజం ఇలాంటి దుష్పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది.
దేశంలో నకిలీ ఆధ్యాత్మిక గురువులు, దొంగ బాబాలు, స్వాముల సంఖ్య గణనీయంగా పెరిగి పోయిన నేపథ్యంలో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హత్యా నేరాలు, మానభంగాలు వగైరా నీచమైన చరిత్ర నుండి సమాజం సరియైన గుణపాఠాలు నేర్చుకోవాలి.
(టి.లక్ష్మీనారాయణ తెలుగు నాట బాగా పేరున్న రాజకీయ విశ్లేషకుడు)