శ్రీకాంతాచారి - ఇరోమ్ షర్మిల - మాయావతి
16 ఏళ్ల పాటు ఉద్యమాలే ఊపిరిగా ఉన్న ఇరోమ్ షర్మిలకు 90 ఓట్లు వచ్చాయి. తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లికి డిపాజిట్ కూడా దక్కలేదు.
ఏఎఫ్ఎస్పీఏను రద్దు చేయడమే తన లక్ష్యమని, ఆర్మీకి ప్రత్యేక హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇరోం చేసిన నిరసన దీక్షకు మద్దతిచ్చిన పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఆమె రాజకీయాలకు దిగడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
ప్రజలు విచిత్రంగా ఉంటారు. ఉద్యమకారులు ఉద్యమాలకు పనికి వస్తారు కానీ... పాలనకు పనికి రారని. 'వి వాంట్ బ్యాడ్ బాయ్స్' అన్నట్టు 'మగతనం', ఆడంబరం, భావోద్వేగాలు, ఏమి చేసి అయినా సరే తమను మంచిగా చూసుకునే మొగుడు లాంటి వాడు కావాలి ప్రజకి. వాడు బయట దుర్మార్గుడు అయినా ఫరవాలేదు.
పాత సినిమాల్లో కన్నాంబ అనేది అక్కినేనితో - 'పాపిష్టి వాడా, ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు. ఈ రక్తపు కూడు మాకు అక్కరలేదు' అని.
నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోటే చిగురులు తొడిగే ఘడియొస్తుంది
ఇప్పటి సినిమాల్లో, మన జీవితాల్లో కూడా మనని ఎవరూ అడగడం లేదు ఎలా సంపాదిస్తున్నామని. యెంత సంపాదిస్తున్నాం అన్నదే లెక్క.
రాజకీయాల్లో కుట్రాకూహకాలను ఎదిరించి నిలవడం, తమను రక్షించడం జరగాలి అంటే... ప్రత్యర్థి తో సమానమైన, లేక అంతకంటే ధీటైన దుర్మార్గుడే ఉండాలి అన్న కాంక్ష సామాన్య ప్రజది.
ఉద్యమకారులది మరీ విచిత్రం. వీరు జీవితాంతం ఉద్యమాలు చేస్తూ ఉందాం అంటారు. పాలన మాట ఎత్తితే భయపడతారు. దానికి 'భ్రష్ట రాజకీయాలు, బూర్జువా రాజకీయాలు' అనే ముసుగు కప్పి తప్పుకుంటారు. తమ స్వంత పనులు మాత్రం పాలకులతో చేయించుకుంటూ ఉంటారు. భారత కమ్యూనిస్టులు 'పోరాటం' అనే మాటను ఎంతగా భ్రష్టు పట్టించారు అంటే... చట్టపరిధిలో అతి సునాయాసంగా పరిష్కారం అయ్యే సమస్యలకు కుడా 'పోరాటం' ట్యాగ్ తగిలించి ఎప్పటికీ వీడని పీటముడి వేస్తూ ఉంటారు. సమస్యలు సమస్యలుగా ఉంటే మాత్రమే తమకు ఆ కాస్త మనుగడ అయినా ఉంటుంది అని. తమ భావదారిద్య్రానికి, రాజకీయ శూన్యతకు ఆ తర్వాతి కాలాల్లో ముద్దుగా 'చారిత్రక తప్పిదం' అని పేరు పెట్టేసుకుంటారు.
అంతే తప్ప, ప్రజాక్షేత్రంలో రాజ్యాంగ బద్ధంగా ఎన్నికల రాజకీయాల్లో అమీ తుమీ తేల్చుకుందాం అనేవారు కరువు. అక్కడక్కడ ఉన్నా, 'ఉద్యమ ప్రజలు' వారిని వెనక్కి లాగుతూ ఉంటారు.
అంబేడ్కర్ ఫిలాసఫీని పూర్తిగా వంటబట్టించుకున్న ఒకే ఒక్కడు కాన్షీరాం. ఆయన దార్శనికతను పుణికిపుచ్చుకుని ఆయన 'కారవాన్' ను ముందుకు తీసుకెళ్తున్న మాయావతి లాంటి వారు ఈ సమాజానికి అవినీతి పరులుగా, ఆడంబరాలకు మారు పేరుగా కనపడతారు.
మాయావతి గురించి ప్రస్తావన రాగానే ఆమె ఒక సంస్కర్తలా ఉండాలని కోరుకుంటారు. ఆల్టర్నేటివ్ కల్చర్ ఏదీ అంటారు. అసలు కాన్షీరాం, మాయావతి ఫిలాసఫీ 'ఆల్టర్నేటివ్ కల్చర్' కాదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వదిలేసిన ఈ బాధ్యత వారినే మోయాలనడం దురాశ!
నిజానికి, 'బహుజనులకు రాజ్యాధికారం' వారి నినాదం. రాజ్యాధికారం ద్వారానే బహుజనులు అన్నిరంగాల్లో వికాసం చెందగలరని కూడా అంబేడ్కర్ నినాదం. బుద్ధిజం మీద ఆమెకే కాదు, నాకు కూడా పెద్ద గౌరవం ఏమీ లేదు. నేడు బర్మాలో బుద్ధిస్టు, హక్కుల కార్యకర్త ఆంగ్సాన్ సూకీ పాలనలో ముస్లింల ఊచకోత సాగుతున్నది. శ్రీలంకలో కూడా బౌద్ధ తీవ్రవాదం పెచ్చరిల్లుతున్నది.
ఇక విగ్రహాల విషయానికి వస్తే... వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి వారికి వారు పోయాక విగ్రహాలు పెట్టేందుకు వారసులు ఉంటారు. వారి కుల సమాజం ఉంటుంది. మాయావతికి ఎవరూ ఉండరు. కాబట్టి ఒక్క ఆమె అవినీతినే, ఆమె ఆడంబరాలనే ప్రశ్నించడం న్యాయం కాదు.
ఏతావాతా చెప్పొచ్చేది ఏమంటే - పాపులర్ కల్చర్, మోనో కల్చర్ ప్రబలిన చోట... ప్రజలకు ఆ దారి నుంచి ఏమాత్రం కాస్త పక్కకు చూడమన్నా నచ్చదు. కొట్టుకుపోవడంలో ఉన్న సుఖం ఎదురీతలో లేదు కదా.
అందుకే... శ్రీకాంతాచారి(ఎడమ ఫోటో) తల్లి, ఇరోమ్ షర్మిల లకు ఓటమి. మాయావతి లాంటి మొండిఘటాలకు నిరాదరణ.
అయితే, యూపీలో గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడు ప్రజాపతికి 50 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి కాబట్టి... ప్రజల అభీష్టం దేశమంతా రేప్ లు జరగాలని అనుకోగలమా?
మన సినారె అన్నట్టు - నిప్పులు చెరిగే వేసవితోనే తేనెలు కురిసే వానొస్తుంది. ఆకులు రాల్చే కాలంతోటే చిగురులు తొడిగే ఘడియొస్తుంది. తెలుగు తెలియక పోవడం వల్లనే 'నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా' అన్నది షర్మిల అని... ప్రస్తుతానికి ఊరట చెందుదాం!