ఎన్ని తరలింపులు ...ఎన్ని ఎదురుదెబ్బలు ?
ధర్నా చౌక్ తరలింపు అలోచన తెలంగాణా ప్రభుత్వం తరలింపు మైండ్ సెట్ కొనసాగింపే.
అదేమిటో తెరాస ప్రభుత్వం వచ్చినప్పటినుంచి తరలింపు ధోరణే చూపిస్తున్నది. ఎన్ని తరలింపు ప్రతిపాదనలు వచ్చాయి? ఎన్ని ఉద్యమాలు, ఎంత వ్యతిరేకత వచ్చింది? బహుశా, ఒక ఉద్యమం తర్వాత, ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చిన ఏ రాజకీయ పార్టీకి ఇంతగా ప్రజలనుంచి, మేధావులనుంచి,పర్యావరణ వేత్తలనుంచి, రైతులనుంచి,విద్యార్థులునుంచి, నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చి ఉండదేమో.
ఇతర తరలింపు వ్యతిరేక ఉద్యమాలన్నింటికంటే ధర్నాచౌక తరలింపు వ్యతిరేక ఉద్యమం తెలంగాణలో పెద్ద దుమారమైంది. కారణం ఇది ప్రజాస్వామిక నిరసన మీద దెబ్బవేసే ప్రతిపాదన. ధర్నా చౌక్ పెద్ద పార్టీల ధర్నాల కే కాదు, అనామక సంఘాలు, రాజకీయ ప్రాబల్యం ఏమాత్రం లేని నిరుద్యోగుల సంఘాలు, చిరుద్యోగుల సంఘాలు, చేపలు పెట్టేవాళు, గొర్లు కాసే వాళ్లు... ఇలా ఎవరెవరో వచ్చిన అక్కడ కూర్చొని ఒక రోజంతా నిరసన దీక్ష జరుపుతుంటారు. ఇది హైదరాబాద్ గొప్పతనం. తెలంగాణా ఉద్యమకారులు జై జై తెలంగాణా అని అరించింది ఇక్కడి నుంచే. ఇలాంటి వంద చదరపు మీటర్ల జాగాను నిరసన గొంతులకు అందకుండా చేయాలనే ప్రతిపాదన ఏమిటి? అన్నిరాజకీయ పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. ప్రజలూ వ్యతిరేకించారు. అందుకే ధర్నా చౌక్ ఆక్రమణ పిలుపు వచ్చింది.
అయితే, ప్రభుత్వ మద్ధతుతో వచ్చిన పోటీ ధర్నాల కారణంగా పచ్చని ఇందిరా పార్కు పరిసరాలు రక్తసిక్తమయ్యాయి. తెలంగాణ సర్కారు వెనక్కు తగ్గితే ఒట్టు అన్నట్లు వ్యవహరిస్తోంది. పోలీసులను, గ్రేటర్ పార్టీ లీడర్లను పోటీ ధర్నాలో కూర్చోబెట్టింది సర్కారు. మరోవైపు ఆందోళనకారులపై లాఠీలు జులిపించడం సర్కారుకు మచ్చ తెచ్చే అంశాలుగానే మిగిలిపోనున్నాయి.
తెలంగాణ సిఎం కెసిఆర్ ఆది నుంచీ తరలింపుల మీద ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆయన పాలన మొదలైన నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు ఏదో ఒకటి తరలిస్తామని ప్రకటనలు జారీ చేస్తూ... జనాల్లో ఆందోళన కల్గిస్తూ వస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రమంత చర్చనీయాంశమయ్యాయి. ఇంకా బాగా చెబితే,చర్చనీయాంశం కంటే గందరగోళం సృష్టిస్తున్నారు అన్న మాట సరిపోతుందేమో...? తొలుత సచివాలయం తరలిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు. దానికి ఆయన చెప్పిన కారణం వాస్తు దోషమట. వాస్తుదోషం కారణంగా సచివాలయం తరలిస్తామని చెప్పడం... ఆయన చెప్పినదానికి వామపక్ష భావజాలం కలిగిన ఈటల రాజేందర్, జగదీష్ రెడ్డి లాంటి మంత్రులు సైతం మద్దతుగా మాట్లాడడం విచిత్రమైన పరిణామమే. సచివాలయం తరలింపు పేరుతో తేపకోసారి కెసిఆర్ ప్రకటించడం... జనాల్లో దుమారం రేగడం జరిగాయి. తర్వాత ఛాతి ఆసుపత్రిని వికారాబాద్ అడవులకు తరలిస్తామని.... అక్కడకు సచివాలయం తరలిస్తామన్నారు. ఇది కూడా గడికోసారి ప్రకటించడం... జనాల్లో చర్చోప చర్చలు జరిగాయి.
ఇక ట్యాంక్ బండ్ మీద ఎవలెవలివో విగ్రహాలు ఉండుడేంది..? మన తెలంగానోళ్ల విగ్రహాలే ఉండాలె... ట్యాంక్ బండ్ మీదున్న సీమాంధ్ర ప్రముఖుల విగ్రహాలన్నీ ఆంధ్రాకు తరలిస్తామని ఒకసారి చర్చను లేవనెత్తిర్రు కెసిఆర్. పంద్రాగస్టు, రిపబ్లిక్ వేడుకలు పరేడ్ మైదానంలో జరిగితే బాలేదని... గోల్కొండ కోటకు తరలించిర్రు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మీద మస్తు లోడు పడుతుందని చెప్పి... దాని మీద వత్తిడి తగ్గించేందుకు చుట్టుముట్టు స్టేషన్ల మీదకు వత్తిడిని తరలిస్తామని చెప్పిరి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లల్ల ఉన్న ఫిల్మ్ సిటీ బాగాలేదని... మస్తు జాగా ఉన్న ముచ్చర్ల గుట్టలల్లకు ఫిల్మ్ సిటీని తరలిస్తామని చెప్పిరి. ఫార్మా కంపెనీలతో పొల్యూషన్ వస్తుందని రాచకొండ గుట్టలల్లకు ఫార్మా కంపెనీలను తరలిస్తామన్నారు. ఇంకో ముచ్చటేదంటే... ఎన్టీఆర్ స్టేడియం లో కళాభారతి కడతామని... ఆ స్టేడియం వల్ల ఏం లాభం లేదని చెప్పిర్రు సిఎం గారు. అయినా... మూడేళ్లలో అక్కడ కళాభారతి కట్టిందిలేదు కానీ... దుమారమైతే లేవనెత్తడంలో కెసిఆర్ సక్కెస్ అయ్యిర్రు.
ఎప్పుడు ఏదో ఒకటి తరలిస్తామనడం... జనాల్లో చర్చ జరగడం... వాదోపవాదాలు, నిరసనలు జరగడం తప్ప ఇప్పటి వరకు జనాలకు ఉపయోగపడే పని ఒక్కటంటే ఒక్కటి కూడా జరిగిన దాఖలాలు లేవు. సచివాలయం తరలించింది లేదు. కళాభారతి కట్టిందిలేదు. ఛాతి ఆసుపత్రి తరలించింది లేదు. కేవలం మాటల గారడీ నడుస్తుంది తెలంగాణలో అన్న చర్చలు ఇటీవల కాలంలో ఊపందుకున్నాయి. తెలంగాణ రాకముందు ఇదే కెసిఆర్ ధర్నా చౌక్ లో ఎన్నోసార్లు మీటింగ్ లలో పాల్గొన్నరు. లెచ్చర్లు దంచిర్రు. మరి అప్పుడు జనాలకు ఇబ్బంది కాలేదా..? కెసిఆర్ కుమార్తె కవిత అయితే... ఏకంగా ఇందిరాపార్కు వద్ద నిరహారదీక్షకు దిగిర్రు. దీన్నేమంటారు..? తరలింపుల రాజకీయం పైకి ఉత్తుత్తిగా కనిపిస్తున్నా... చాలా పకడ్బందీ వ్యూహంతోనే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రజాసమస్యలపై జనాల దృష్టి మరలించే కోణం కూడా ఇందులో ఉందన్నది కఠిన వాస్తవం.
మొత్తానికి సచివాలయ తరలింపుతో మొదలైన కెసిఆర్ తరలింపుల ప్రస్తానం.. ప్రస్తుతం ఇందిరా పార్కు వద్ద ఆగింది. ఇది ఇలాగే ఉంటదా... లేకపోతే రేపటినాడు కంపు కొడుతుంది కాబట్టి హుస్సేన్ సాగర్ ను తరలిస్తాం.. వాకర్స్ కు ఇబ్బంది అవుతుంది కాబట్టి అసెంబ్లీని తరలిస్తాం... రోడ్లు ఇరుకుగా ఉన్నాయి... ట్రాఫిక్ పెరిగిపోతుంది కాబట్టి చార్మినార్ ను తరలిస్తాం.. అన్న ప్రకటనలు కూడా వస్తాయోమో... అన్న చలోక్తులు వినబడుతున్నాయి. రోజు ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేయడం... జనాల్లో చర్చ పెట్టడం తరలింపుల పేరిట తతంగాలు నడపడం అన్ని రోజులు సాధ్యం కాదని గుర్తించేసరికే... టిఆర్ ఎస్ కు జరగాల్సిన నష్టం జరగడం ఖాయమన్న హెచ్చరిక ఇందిరాపార్కు ఘటనతో తేలిపోయింది.
(* రచయిత అల్లి నాగరాజు , జర్నలిస్టు, హైదరాబాద్)