నాయుడిగారి ‘కనెక్ట్ సిఎమ్’ భ్రాంతియేనా???
'ఎపి సియం కనెక్ట్' యాప్ ను చంద్రబాబే స్వయంగా చూస్తానని ప్రకటిస్తే భ్రమించి, మూడు పోస్టులు పెట్టాను. వాటిలో రెండు ఉత్తరాలు. వాటిని రాసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ 'ఆటోమాటిక్ డిజిటల్' సమాధానాలు కూడా వచ్చాయి.
ఒకటి: గాలేరు - నగరి సృజల స్రవంతి, రెండవ దశ నిర్మాణ పనులను అటకెక్కించడం దుర్మార్గమని, యుద్ధ ప్రాతిపదికపై నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేస్తూ వ్రాశాను.
రెండవది: హంద్రీ - నీవా సృజల స్రవంతి ప్రధాన కాలువ నిర్మాణాన్ని వెడల్పు చేయడానికి పరిపాలనా పరమైన అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ, తుంగభద్ర నదిపై గుండ్రేవుల జలాశయాన్ని నిర్మించడం ద్వారా రాయలసీమ నీటి సమస్యకు కాస్త ఊరట కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ వ్రాశాను.
ఒక రోజు ప్రభుత్వ ఫిర్యాదుల విభాగం(ఇటీవలే దీన్ని ప్రారంభించారు) నుండి ఫోన్ చేసి ఆధార్ నెంబరు, మండలం పేరు అడిగారు. ఎందుకని అడిగా. మీరు ఫిర్యాదు చేశారు కదా! మీకు నీటి సమస్య ఉన్నదా? విచారించమని మాకు ఉన్నతాధికారుల నుండి ఆదేశాలు వచ్చాయని సమాధానం చెప్పారు. ప్రభుత్వ పని తీరు విచిత్రంగా అనిపించింది. నేను వ్రాసిన ఉత్తరాల కాపీలను మీకు పంపలేదా? అని అడిగితే, లేదన్నారు.
నాకు నీటి సమస్య లేదు. రాయలసీమ ప్రాంతం నీటి కోసం పరితపిస్తున్నది. ఆ సమస్యపై ముఖ్యమంత్రి గారికి రెండు ఉత్తరాలు వ్రాశాను. ఆ రెండు ఉత్తరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళమని సలహా ఇచ్చి, ఫోన్ చేసినందులకు ధన్యవాదాలు చెప్పి, ఫోన్ కట్ చేశా.
ఇదీ 'ఎ.పి. సి.యం.కనెక్ట్' యాప్ అనుభవం. ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకొనే ముందు నిశితంగా పరిశీలించి, ఆచరణలో పెట్టగలమా! లేదా! అన్న దానిపై చిత్తశుద్ధితో ఆలోచించాలి. గొప్పగా ప్రకటించడం, ఆచరణలో తుస్సుమని పించడం, నవ్వుల పాలు కావడానికే దోహదపడుతుందని ఎంత త్వరగా గుర్తిస్తే, అంత మేలు.
విజయవాడ సమీపంలోని గుంటుపల్లిలో రాష్ట్ర ప్రభుత్వ ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించారు.1200 మంది సిబ్బందితో దాన్ని నిర్వహిస్తారట. ఇప్పటికే 900 మంది సిబ్బందిని నియమించారట. వారు చేసే పనేంటో పైన ఉదహరించిన దాన్ని బట్టి బోధ పడుతున్నది గదా! ఏదైనా ఒక వ్యవస్థను నెలకొల్పినప్పుడు, దాని వల్ల ప్రజలకు ప్రయోజనం జరిగేలా ఉండాలి, లేక పోతే, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది.
(*టి లక్ష్మీనారాయణ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు)