స్నేహమేరా జీవితం...

the meaning of friendship

 

 

“సృష్టి లో తీయనిది స్నేహమే” అన్నారు. ఇందుమూలంగా ప్రేమకు కూడా దక్కని గౌరవం స్నేహానికి దక్కింది.

 

స్నేహితుడంటే ఎవరు అని అడిగిన ప్రశ్న కు ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్ “రెండు వేర్వేరు శరీరాల్లో నివసించే ఒకే ఆత్మ” అని జవాబిచ్చాడు. స్నేహానికీ, నిజమైన స్నేహితులకీ ఇంతటి ఉదాత్తత ఉంది మరి.

 

ఈ ప్రపంచం లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపం లో స్నేహితులను కలిగే  వుంటారు.   అందుకే నిజమైన స్నేహితులు లేకపోవడం (ఏకాంతం లేదా ఒంటరితనం) అనేది అత్యంత దురదృష్టకరమైన విషయం అంటారు. అదో శాపం.

 

స్నేహితుల్నీ సంపాదించడం చాలా సుళువు, కానీ నిజమైన స్నేహితుల్ని గుర్తించడం ఆ స్నేహాన్ని నిలుపుకోవడం చాల కష్టమైన పని. ఎందుకంటే నిజమైన స్నేహాన్ని నిలుపుకోవడమనే ప్రక్రియలో, హక్కులకంటే బాధ్యతలెక్కువ వుంటాయి, తీసుకోవడం కంటే ఇవ్వడం ఎక్కువగా వుంటుంది, ప్రతిఫలం ఆశించకుండా చేయవలసిన పనులు చాలా వుంటాయి.  “నేను నా స్నేహితుల్ని, పిసినారులు తమ సంపదను చూసుకునేట్లు చూసుకుంటాను ఎందుకంటే విజ్ఞత మనకు ప్రసాదించిన అన్ని విషయాల్లోకీ స్నేహమే అత్యంత మెరుగైనదీ మరియు గొప్పది.” అన్నాడు ఇటాలియన్ రచయిత పీట్రో అరెటినొ.    

 

కొంతమంది స్నేహితులు మనం సుఖాల వెలుగులో వున్నప్పుడు మన నీడలా వెన్నంటే వుంటారు, మనం వెలుగులోంచి, కష్టాల చీకట్లోకి నడిచినప్పుడు నీడ మాయమైనట్లు  మాయమై పోతారు.  వీరు వారి అవసరాల నిమిత్తం మనతో స్నేహం చేసిన వారే. పని వున్నప్పుడే మాట్లాడటం, అవసరం వున్నప్పుడే కలవటం చేస్తూ వుంటారు.  “ప్రపంచమంతా నిన్నొదిలేసి నీకు దూరంగా వెళ్లిపోయినప్పుడు, నీ దగ్గరికి వచ్చేవాడే నిజమైన స్నేహితుడు” అన్నాడొక మహానుభావుడు.

 

రకరకాల మనుషులూ మనస్తత్వాలూ నిండి వున్న ఈ ప్రపంచంలో “స్నేహం చేయడం ఎలా? స్నేహాన్ని నిలుపుకోవడం ఎలా?” అనే విషయాలను, కొన్ని నియమాల్తో ఓ ప్రక్రియగా ప్రచురించడం సాధ్యం కాదేమో. అయితే కొన్ని సాధారణ సన్నివేశాలు తీసుకుని ఎలాంటి ప్రవర్తన వల్ల స్నేహం చేడిపోతుందీ అటువంటి సంఘటనలు జరగకుండా ఏం జాగ్రత్త తీసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకోవచ్చు.

 

ఇలాంటి  విషయాల్లో మొట్ట మొదటిదీ ముఖ్యమైనదీ ఏమిటంటే, మనం ఎదుటి వారినుంచి ఎలాంటి ప్రవర్తనను ఆశిస్తున్నామో వారిపట్ల మనప్రవర్తన కూడా అలాగే వుండాలి అనేది. మనం అలా ప్రవర్తిస్తున్నామా లేదా అని చూసుకోవాలి. ఇది చాలా కష్టమైన పని.  “తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు” అన్నాడు వేమన. ఒక పని ఎదుటి వాడు చేస్తే తప్పు మనం చేస్తే ఒప్పు అనేది ఎంతవరకు నిజం? ఈ విషయాన్ని ఋజువు చేయడానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సమంజసం?    

 

నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు అని వ్యాఖ్యానించే ముందు మనం ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకున్నామా ? అని ఆలోచించాలి. ప్రతి విషయం లో విమర్శించడం, నిందలు వేయడం మానేయాలి. స్నేహితుల గురించీ, వారు మనమీద చేసిన వ్యాఖ్యల గురించి మూడో వ్యక్తి ద్వారా విన్నప్పుడు, అ స్నేహితుల్ని సూటిగా కలిసి నిజానిజాలు తెలుసుకోవాలి. ముందే ఓ నిర్ణయానికీ నిర్ధారణకు రారాదు. ఆ తరువాత ఏం చేయాలనేది ఆలొచించ వచ్చు.    

 

ఒక సమస్యాత్మక సన్నివేశం తలెత్తినప్పుడు ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినాలి. వెంటనే నిర్ణయం తీసుకోవడం, తీర్పు చెప్పడం కంటే, కాస్త నిదానంగా అలోచించే సమయం తీసుకోవాలి. అవసరం లేనప్పుడు కూడ, తరచూ కాకపోయినా ఆప్పుడప్పుడు పలకరించడం అలవాటు చేసుకోవాలి. 

 

స్నేహితుడు సమస్యల్లో వున్నప్పుడు  మనం  ఆ సమస్యను  తీర్చ గలిగిన స్థితి లో లేక పోయినా, తోడుగా వుండి ధైర్యాన్ని కలుగచేయవచ్చు. ఆ తోడు ఒక చీకటి గుహలో చిరుదీపం లాంటిది. గుహ మొత్తం లో యేముందో ఆ దీపం చూపించలేకపోయినా తరువాతి అడుగు ఎలా వేయాలనే ఆత్మవిస్వాసాన్ని కలుగచేస్తుంది. అది చాలు.  

 

సమస్యల్ని సాధించే సహాయాన్ని అందించాలి. వీలైతే అధికతమ దూరం (extra mile) నడవగలగాలి. “నాకోసం ఏమైనా చేస్తాడు” అనే విశ్వాసాన్ని కలుగచేయాలి. “అవసరమైనప్పుడు వీరి మీద ఆధార పడొచ్చు” అనే భరోసా ఇవ్వగలగాలి.

 

స్నేహితుల పట్ల క్షమా గుణాన్ని అవలంబించాలి. చిన్న చిన్న తప్పుల్ని పొరపాట్లనీ సాగదీయకుండా వదిలేయడం అలవాటు చేసుకోవాలి.  కేవలం మనకు నచ్చే విషయాలకే కాకుండా,  అవతలి వారికి నచ్చే విషయాల పట్ల కూడా ఆసక్తి చూపగలగాలి.  స్నేహుతుల్ని ప్రొత్సహించడం వారు చేసే మంచి పనుల్ని మెచ్చుకోవడం చేయాలి.  ఇలాంటి పనులు చేయడం వల్ల మంచి స్నేహన్ని నిలుపుకోవడమే కాకుండా మన వ్యక్తిత్వాన్ని అందరూ అహ్వానించే విధంగా మలుచుకోవచ్చు.

 

చెప్పొచ్చేదేమిటంటే నిజమైన స్నేహం బీడు భూమిలోనూ మొలకలేస్తుంది, ఎడారిలోనూ చిగురిస్తుంది అయితే అప్పుడప్పుడూ కలవడాలూ,  పలకరింపులూ, చిన్ని చిన్ని బహుమతులూ, స్నేహితులనే మొక్కల సముదాయాన్ని మరింత అందంగా పెంచి మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఓ పూల తోటగా మారుస్తాయి. మనం అలసి పోయినప్పుడు నిక్షేపంగా ఆ తోటలో సేద తీరవచ్చు.  

 

బ్రిటిష్ రచయిత నార్మన్ డగ్లాస్ మాటల్లో “ఒక స్నేహితుడిని సంపాదించడానికి  ఒక కన్ను మూసుకోవాలి. ఆ స్నేహితుడిని పోగొట్టుకోకుండా వుండటానికి రెండు కళ్లూ మూసుకోవాలి”

 

(* రచయిత ప్రాజక్టు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ csahmedsheriff@gmail.com)