నాన్న గొడుగలా మూలన పడిపోయింది...
కర్నూలులో వర్షం లేని కాలం.
పొద్దున్నే గొడుగు తీస్కొని మా వాడితో వాకింగ్ వెళ్తుంటే ఒకాయన మమ్మల్ని చూసి నవ్వాడు. అతనెవరో నాకు తెలియదు.
"ఎందుకండి నవ్వుతున్నారు?" అనడిగితే, 'మీరు కామెడి బాగా చేస్తారు సార్!. అయినా ఇప్పుడు గొడుగు తీసుకుని బైటికి రావడమేంటి సార్?" అన్నాడు కాని నవ్వు ఆపలేదు. నిజమే ననిపించింది. అసలు వర్షం పడితే కదా. అయితే వర్షాకాలంలో వర్షం పడినా, పడకపోయినా గొడుగు తీసుకుని బైటికి వచ్చే కాలం నుంచి వచ్చాన్నేను. అదీ విషయం.
ఓ యాభై ఏళ్ళ క్రితం వర్షా కాలంలొ గొడుగు (కొంతమంది ఎండాకాలంలో కూడా) ఎవరన్నా బైటి కొచ్చారంటే గొడుగు లేనివాళ్ళో, ఒకవేళ ఉన్నా మర్చిపోయిన వాళ్ళో అయి ఉంటారు! ఒకప్పుడు మూడు కాలాలు అంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అని ఉండేవి. ఇప్పుడు రెండే ఉన్నాయ్! “ఎండ” కాలం, “వర్షం” (పడితే) కాలం! వర్షాకాలంలో గోడకు ఓ మూలనో, మేకుకు వేలాడుతునో గొడుగులు, ఎండాకాలంలో పెరట్లో లేదా వంటింట్లో ఇసుక కుప్పల పై వొదిగి కూచున్న కుండలు, చలికాలంలో పెద్దవాళ్ళ మెడకో,తలకో చుట్టుకున్న మఫ్లర్లు కనిపించేవి. మా బీ.క్యాంప్(కర్నూలు) కాలనీలో అన్ని కాలాలు స్పష్టంగా కనపడేవి, కాలనీలో ఉండే చిన్నా, పెద్దా, ముసలి-ముతక-పిల్లా, మేకా కూడా కాలనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేవారు..అవి సరదాగా ఉండేవి..
వర్షా కాలం వచ్చీ రాగానే (ఏండా కాలం ఎండింగ్ లోనన్న మాట) ఆడాళ్ళందరూ గొడుగు(ఒక్కటే ఉండేది) బయటికి తీసి దులిపి అవసరమైతే దానికి మరమ్మత్తులు చేయటానికి మగాళ్ళను పురమాయించేవారు. అప్పట్లో గొడుగు ఒక్కసారి కొంటే కనీసం ఓ పది పదిహేను వర్షాకాలాలు ఉండేది. గొడుగు రిపేరికి గడియారం అస్పత్రి(ఇప్పటికి ఉంది) దగ్గర ఒక సాయిబు ఉండేవాడు(ఇప్పుడు లేడు). బీ.క్యాంప్ వాళ్ళకే కాకుండా సగం కర్నూల్ కి సాయిబే దిక్కు. ఆఫీసుకెళ్ళేటప్పుడు గొడుగు ఇచ్చి , ఇంటికి వెళ్లేటప్పుడు రిపేరయిన గొడుగు తీసుకొచ్చేవారు మగవాళ్ళంతా. సాయిబు దగ్గరికి ఒకట్రెండు సార్లు నేను వేళ్ళాను మా అమ్మతో పాటు. (మా నాన్న ఇట్లాంటి పనులు చేసే వాడు కాదు) భలే సరదాగా ఉండేది రిపేరీ వ్యవహారమంతా. ఒక్కక్క కడ్డీ తీసీ కొత్తది వేయటం, బట్ట చిరిగిపోతే అతుకేసి కుట్టటం. కడ్డిలకు ఆయిల్ వెయ్యటం. చాలా శ్రద్ధగా గొడుగు తనదేనన్నట్లు చేసేవాడు.ఓహ్! భలే టైం పాస్. అప్పట్లో సాయిబు దర్జా చూడాల్సిందే. సాయిబు తర్వాత వాడి కొడుకు సైకిలేస్కొని కాలని అంతా తిరిగి గొడుగులు బాగుచేసే వాడు. ఇప్పుడు సాయిబు లేడు, కొడుకు పనిలేకపోవటం వల్ల తాళాలు రిపేరి చేస్తున్నాడు.
ఇంట్లో ఒకటే గొడుగు ఉండేది కాబట్టి ఎవరూ ఎవరికి గొడుగిచ్చేవారు కాదు. మరీ దగ్గర వారికి , బంధువులకి మాత్రమే ఇచ్చేవారు. అప్పట్లో ఇంట్లో గోడుగుండటం స్టాటస్ సింబల్. మా అమ్మ గొడుగు ఎవ్వరికి ఇచ్చేది కాదు. సాయంకాలం స్కూల్ నుంచి వచ్చాక (తడుచుకుంటునే)నర్సిమ్ములు బంక్ నుండి టీ పొడో, చక్కేరో తిసుకురావటనికి నేను మా బాషా గాడు( నా కన్నా కొంచెం పెద్ద) పోటి పడేవాళ్ళం! ఎందుకంటే గొడుగు తీసుకుని బంక్ కు వెళ్ళోచ్చు! బాగా వర్షం పడుతుంటే గొడుగేస్కుని రెండు ఫర్లాంగులు వెళ్ళి రావటం భలే థ్రిల్లింగ్ గా ఉండేది. మా నాన్న మాత్రం సైకిలేస్కొని వెళ్ళేవాడు కాబట్టి గొడుగు తీసుకెళ్ళే వాడు కాడు. వర్షం పడితే తడుస్తూ వచ్చేవాడు.తర్వాత పొడవటి రెయిన్ కోట్ కొన్నాడు! అప్పట్లో ఖాకి కలర్లో ఉండే రెయిన్ కోట్లు బీ.క్యాంప్ మొత్తమ్మీదా నాలుగైదు మాత్రమే ఉండేవి! ఆ విషయం మాకు గొప్పగా అనిపించేది.నాన్న వర్షంలో వస్తే, రెయిన్ కోట్ నీళ్ళు పోయేంతవరకు వరండాలోని కొక్కేనికి తగిలించేది మా అమ్మ. నేను నీళ్ళన్ని పొయేదాక వరండాలోనే! ఒక్కసారి వేస్కునే అవకాశం లేదు. చాలా పొడుగ్గా ఉండేది. పెద్దయ్యక అలాంటి రెయిన్ కోట్ కొనటం, దాంతో పాటే మంచి గొడుగు కొనటం నా లక్ష్యంగా ఉండేది.
ఒకసారి వద్దన్నా వినకుండా పెద్ద గాలి వానలో గొడుగు తీస్కొని బైటకి వెళ్ళాను. గాలికి గొడుగు తిరగబడి పొయింది!! అంతే నా వీపు విమానం మోత మోగింది! మళ్ళీ రిపేర్ చేయించాక నన్ను గొడుగు ముట్టనివ్వలేదు.మా బాషా గాడు హ్యాపీ! వాడికి మాత్రమే గొడుగు తీసుకెళ్ళే అవకాశం ఇచ్చింది మా అమ్మ! ఒక అగ్రిమెంటు ఏంటంటే వాడితో పాటు నేను కూడా గొడుగులో వెళ్ళవచ్చు.కాని అది మాత్రం వాడే పట్టుకోవాలి..
ఒక సంఘటనతో మా కాలానిలో ఆడాళ్ళంతా ఆడిపోసుకున్నారు, ఒకామెను. మా ఇంటికి దగ్గరగా ఉన్న క్వార్టర్స్ లోకి ఒకామె వచ్చింది. అప్పట్లో ఆమె ఏదో గవర్నమెంట్ ఉద్యోగం లో ఉండేదనుకుంటా. అది పెద్ద విషయం కాదు కాని.. ఆమె గొడుగు కాలనీలో దుమారం లేపింది. చిన్న సైజులో రంగురంగుల క్లాత్ తో ఒయ్యారంగ ఉన్న గొడుగుతో ఆమె నడుస్తూవుంటే ఆడాళ్ళందరు మూతి (మూతులు)విరిచారు. గుసగుసలాడుకున్నారు..అసూయ పడ్డారు.. బటన్ అలా నొక్కితే అందమైన పువ్వులా గొడుగు విచ్చుకునేది. అందరికి అది మరింత క్షోభ కలిగించింది. మాకైతే గొడుగు అలా విచ్చుకోవటం భలే ఫ్యాసినేటింగా ఉండేది. ఒకరోజు ఆమె వర్షంలో ఒకటో నంబర్ సిటీ బస్సు దిగి వస్తూంటే గొడుగు తిరగబడి పొయింది! సాయిబు,ఆయన కొడుకు దాన్నీ రిపేర్ చెయ్యటం సాధ్యంకానే కాదన్నారు. కాలనీ అంతా ఎంత రిలీఫ్ ఫీలయ్యారో. అంత స్టయిల్ పనికిరాదన్నారు. తర్వాత ఆమె మాములు గొడుగు కొనుక్కుంది.. ఆడాళ్ళ కళ్ళు చల్లబడ్డాయి. నాకు ఎలాగో అనిపించింది. కొన్ని రోజుల తర్వాత ఆమె వెళ్ళిపోయింది.. ఆడాళ్ళందరూ మరీ రిలీఫ్ ఫీలయ్యారు. ఎందుకో నాకు తర్వాత తెలిసింది!
మా రాయలసీమలో అలాంటి వర్షా కాలం ఇప్పుడు లేదు, వర్షమూ లేదు..అపుడపుడుచినుకులు పడ్డా... గొడుగులు కూడా బటన్ వి వచ్చాయి. పెద్ద గొడుగులు లేవు. నాన్న రెయిన్ కోటు ఎప్పుడో చిరిగిపోయింది.ఇప్పటికి నలభై అయిదు సంవత్సరాల కింద కొన్న పెద్ద గొడుగు నా దగ్గర ఉంది. కడ్డీలు విరిగిపోయి, చిలుము పట్టి, బట్ట పూర్తిగా చిరిగిపోయి..వాడిపోయిన పువ్వులా ఉంది. రిపేర్ చేయించటానికి అమ్మ లేదు..ఉన్నా సాయిబు లేడు.. ఇద్దరూ ఉన్నా వర్షం లేదు!!!
*ఈ రచయిత కథలూ కాకరకాయలు రాసే కర్నూలు వాసి. స్పోర్ట్స్ జర్నలిజాన్ని పురిట్లోని వదిలేసి చాన్నాళ్లయింది. ఇపుడేమో పర్సనాలిటి డెవెలప్ మెంటు అంటూ తెగ ఉపన్యాసాలిస్తూ,పర్వాలేదు, బాగానే సంపాయిస్తున్నాడు. కనిపించినోళ్లకంతా హోమియో వైద్యం ఉచితంగా చేస్తాడు. ఫోటో మరొకసారెపుడైనా అచ్చేస్తాం.మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి-9393737937
మరిన్ని వార్తల కోసం క్లిక్ చేయండి