అన్నమయ్య పదాల్లో రాయలసీమ
ఒక భాష పరిఢవిల్లాలన్నా,నిరంతరం కొనసాగాలన్నా ఎన్నో పదాల చేర్పు జరుగుతుండాలి.కాలక్రమంలో కొన్ని పదాల అర్ధాలూ మారుతుంటాయి.ఉదాహరణకు "కంపు" అన్న పదానికి అర్ధం గంధము,వాసన.కానీ నేడు దుర్గంధానికి పర్యాయపదంగా వాడుతున్నాము.
ఇక 600 ఏళ్లకు పూర్వం పదకవితలు చెప్పిన అన్నమయ్య సంకీర్తనలను అర్ధం చేసుకోవడం ఒకింత కష్టతరమే.అందుకే రవ్వా శ్రీహరి గారు "అన్నమయ్య పదకోశం" అంటూ పదాల అర్ధాన్ని తెలియజేసే నిఘంటువును తితిదే వారి సహకారంతో వెలువరించారు.
నిజానికి ఇన్నివందల ఏళ్లైనా సజీవంగా వాడుకలో ఉండి రాయలసీమకే ప్రత్యేకమైన మూడు పదాల గురించి ముచ్చటించుకుందాం...
సూసకము.....
అన్నమయ్య సంకీర్తనల్లో "సూసకము" అనే పదం వినిపిస్తుంది.ఆ పదానికి అర్ధం స్త్రీలు తలపై పెట్టుకునే ఒక ఆభరణం..అంటే పాపిటబిళ్ల లాంటిది,మరొక అర్ధం మొహం కనిపించకుండా తల పైన ధరించే పూల ముసుగు లాంటిది.
మా రాయలసీమ లో ఒకప్పుడు పెళ్లి కూతుర్లు ఈ సూసుకం ధరించి,వడిబియ్యం తో పెళ్లిపీటలపైన కూర్చునేవారు.ఇప్పుడు పద్దతి మారిపోయింది.ఇంకా కొన్ని ప్రాంతాల్లో సూసకం ధరించే ఆచారం ఉంది .
ఆ సూసకం పదం ఉన్న ఒక సంకీర్తన,ఆ నాటి పెళ్లి పద్దతులు మీరూ చదవండి.
అదె శ్రీవేంకటపతి అలమేలుమంగయును
కదిసి యున్నారు తమకమున పెండ్లికిని
బాసికములు కట్టరో పైపై దంపతులకు
శేసపాలందియ్యరో చేతులకును
సూసకాల పేరంటాండ్లు సోబనాలు పాడరో
తెలంగాణా ప్రాంతంలోనే మరి కొన్ని చోట్ల వధువు తల పూర్తిగా కప్పబడేట్టుగా పువ్వుల చదరపు పట్టీలని ఒక గుండ్రని బిళ్ళ పాపిటివద్ద వచ్చేట్టు తయారు చేస్తారు. దీన్ని కూడా బిళ్ళ "చు(సు)ట్టుకము" అంటారు.
బీగం.....
వేంచేయరయ్యా మీరు విడిదింటికి
పాంచజన్య హరుడు పవ్వళించి ఉన్నాడు అన్న సంకీర్తనలో
గరుడకిన్నెరకింపురుషులారా,సిద్ధవరులారా విద్యాధరులారా
గిరివల్లభులారా శరణాగతత్రాణ బిరుదు వేల్పుని నగరు బీగముద్రలాయె......అంటాడు.
రాయలసీమ ప్రాంతంలో తాళంకప్పను బీగం గా వ్యవహరిస్తారు.తాళం చెవులను బీగంచెవులనీ అంటారు.
అల్లెం....
పాతకాలం లో అన్నిప్రాంతాల్లో చాలా చిన్న వయసులో పెళ్లి చేసేవారు.కొందరు అమ్మాయి యుక్తవయస్కురాలు కాకముందే చేస్తే కొందరు ఆ తర్వాత 3,4 ఏళ్లకే......
సరే పెళ్లయ్యాక ఎన్నేళ్లకో అమ్మాయిలు కాపురాలకు వచ్చేవారు...ఈలోగా అమ్మాయిని అత్తారింటికి పంపేముందు అల్లుడిని "అల్లెం" కు పిలిచేవారు.
ఈ అల్లెం పెట్టడం కొన్ని నెలలపాటు సాగేదంట.....
ఈ అల్లెం సమయంలో రోజూ అల్లుడు గారికి రకరకాల ఆహారపదార్థాలు(veg and non.veg) చేసిపెట్టేవారంట.ఇక పిండివంటలు చెప్పాల్సిన పనేలేదు.నేతి అత్తరాసులు(అరిసెలు),లడ్డు,కజ్జికాయలు..అంతేనా మళ్లీ వీటిని నెయ్యి లో కలుపుకుని తినాలి.
ఇక అల్లుడు గారు నీడపట్టున తింటూ కాలక్షేపం చెయ్యడం,మరీ విసుగనిపిస్తే అలా పొలాలవెంట షికార్లు తిరిగిరావటం.....
ఈ అల్లెం పెళ్లి కొడుకుల వంటిమీద ఈగ వాలితే ఆ శరీరం నునుపుకు అది జారిపోవాలంట.....
మరీ ఇంతలా తినిపించి స్థూలకాయులు అవుతారనుకోకండి....
గ్రామీణ క్రీడలకు సంబంధించిన రాతిగుండును ఎత్తటం కూడా చెయ్యాలంట...
అందుకే ఈ రాతిగుండ్లకు "అల్లెం గుండు" అనేపేరొచ్చింది.....
(ఆ గుండును భుజమ్మీదకు ఎత్తుకుని వీపు మీదుగా కిందకు జారవిడవాలి)
urbanisation, busy life ,గ్రామాల విధ్వంసం.....ఏదైతేనేం ఈ ఆచారం మాయమైనా "అల్లెం పెళ్లికొడుకు" అనే మాట మాత్రం అక్కడక్కడా వినిపిస్తుంది.....
ఈ అల్లెం అన్న పదానికి మూలం "అల్లిరము" అన్న పదం.కొన్నిప్రాంతాల్లో ఈ అల్లెం ను మనుగుడుపుగా వ్యవహరిస్తారు.
అన్నమయ్య ఈ సంకీర్తనలో ఆ దేవదేవుణ్ణీ అల్లీరము/అల్లెం తిందురమ్మని పిలుస్తుస్తున్నాడు చూడండి.......
విచ్చేయవయ్యా వేంకటాచలము పొంత
కచ్చుగా నేమున్నచోటి కచ్యుత నారాయణా॥
అల్లనాడు లంక సాధించందరు మెచ్చగ
మల్లడి నయోధ్యకు మరలినట్లు
యెల్లగా గైలాసయాత్ర కేగి కమ్మరి మరలి
వెల్లివిరి ద్వారకకు విచ్చేసినట్లు॥
యెన్నికెతో గోమంతమెక్కి జయము చేకొని
మన్ననతో మధురకు మరలినట్లు
అన్నిచోట్లానుండి అల్లిరము లారగించ
వెన్నుడవై వేడుకతో విచ్చేసినట్లు॥
వహికెక్క ద్రిపురాలవనితల బోధించి
మహి నిందిరవొద్దికి మరలినట్లు
విహగగమన శ్రీవేంకటేశ మమ్ము గావ
విహితమై నామతిలో విచ్చేసినట్లు॥
.......ఇవీ నేటికీ వాడుకలో ఉన్న కొన్ని అన్నమయ్య పదాలు.