గుర్రం జాషువా ఎందుకు ఎల్లపుడూ గుర్తుంటాడో తెలుసా?

gurram joshua remembered forever for his fight against caste bias in literature

   నేడు నవయుగ కవి చక్రవర్తి 'పద్మభూషణ్ ' గుఱ్ఱం జాషువా వర్ధంతి
        (28-9-1895   24-7-1971)
                            ****
ఒక అంటరాని వాడు,పవిత్రమైన హిందూ గ్రంథాలు ,కావ్యాలు చదువుతున్నాడని ఇటు హిందూ ఛాందసులు కన్నెర్రజేస్తే,
క్రైస్తవుడైవుండి హిందూ నాటకాలు రాసి హిందూమతప్రచారానికి తోడ్పడుతున్నాడని  క్రైస్తవ మతాధిపతుల ఆగ్రహానికి గురైన జాషువా 1895 సెప్టెంబరు 28 న‌‌, గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు.తండ్రి వీరయ్యది యాదవ కులం,తల్లి లింగమ్మది అరుంధతీ కులం.క్రైస్తవ మతస్థురాలు.

ఒక వంక దారిద్య్రం, మరోవంక కుల మత పోటు. బాల్యంనుంచే జాషువా ఎన్నో అవమానాల్ని,అవహేళనల్ని,ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. చిన్నతనం నుంచే
తిరగబడే తత్త్వంతో వీటన్నింటినీ అధిగమించిన జాషువా, విద్యార్థి దశనుంచే వ్యంగచిత్రాలు గీయడం, గొల్లసుద్దులు పాడుకోవడం,ఇలా లలిత కళల పట్ల ఆసక్తి పెంచుకోవడం ప్రారంభించారు. దీపాల పిచ్చయ్యశాస్త్రి, జూపూడి హనుమచ్ఛాస్త్రి వంటి కొందరు జాషువా ఉన్నతికి తోడ్పడితే,
మరికొందరు జాషువాను కులంపేరుతో తీవ్రంగా అవమానించారు.

జీవితంలో ఎన్నోసార్లు, ఎన్నోచోట్ల జాషువా కవిత్వం విని ఆనందించిన వారు, కరతాళ ధ్వనులతో తమ హర్షాన్నిప్రకటించిన వారు, అతని కులం తెలుసుకొని అవమానించారని, జాషువా ఆవేదన పడినా,నిరుత్సాహంతో క్రుంగిపోక "కళకు కులమతాలున్నాయా?" అని ప్రశ్నిస్తూ, వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని గొప్పకవిగా ఖ్యాతిని పొందారు."విశ్వనరుడ నేను" అని సామాజిక వాస్తవికతను నిర్భయంగా చాటారు.

'భారతవీరుడు'అనేపద్యకావ్యాన్ని,'రుక్మిణీకళ్యాణం'అనేనాటకాన్ని,ఇక...ఫిరదౌసి,గబ్బిలం, నేతాజీ, బాపూజీ,,క్రీస్తు చరిత్ర‌,ముంతాజ్ మహల్(ఈ కావ్యాన్ని తాను అమితంగా ప్రేమించిన తన తల్లికి అంకితం ఇచ్చారు),శ్మశానవాటిక వంటి ఖండకావ్యాలు ఎన్నో రాసారు. మరెన్నో కవితా ఖండికలు అలనాటి ప్రముఖ సాహిత్య మాసపత్రిక 'భారతి 'లో వెలువరించారు.

కవితావిశారద,కవికోకిల‌,కవిదిగ్గజ,నవయుగ కవిచక్రవర్తి,మధుర శ్రీనాథ లాంటి బిరుదులను సాహితీ ప్రియులు ప్రదానం చేస్తే,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, అవార్డులతో సత్కరించాయి.వీటన్నిటికీ మకుటాయమానంగా భారత ప్రభుత్వం 'పద్మభూషణ్ 'అవార్డుతో  విశిష్ట పురస్కారాన్ని అందజేసింది.

"రాజు మరణించె,  నొక తార రాలిపోయె
కవియు మరణించె ,నొక తార గగనమెక్కె
రాజు  జీవించే ఱాతి విగ్రహములందు
సుకవి జీవించె ప్రజల నాలుకల యందు"

అన్న జాషువా,  ఆణిముత్యాల్లాంటి
రచనలను తెలుగుజాతికి అందించిన
జాషువా , 1971 జులై 24 న
గుంటూరులో కీర్తిశేషులయ్యారు.