వెంకటసుబ్బారావు, మేడ్ ఈజీ...ఎవరీ వెంకటసుబ్బారావు?
గురజాడ “కన్యాశుల్కం” నాటకంలో తన శిష్యుడైన వెంకటేశానికి గిరీశం మొదటితొమ్మిది పుస్తకాల జాబితా చెబుతాడు, గుర్తుందా? అందులో "వెంకట సుబ్బారావు మేడ్ ఈజీ" అన్న పుస్త కం (Guide) ఒకటి.ఎవరీ వెంకటసుబ్బారావు? గరీశం చెవిదాకా ఆయన కీర్తి వెళ్లడం, దాన్ని అతగాడు తన పాండిత్యప్రకర్షను వెల్లడించేందుకు ఉపయోగించుకోవడం చూస్తే, ఈ వెంకట సుబ్బారావు గిరీశం తలకాయలోనుంచి ఊడిపడ్డ పేరు కాదు. అది అపుడు సమాజంలో బాగా చర్చల్లో నానుతూ ఉండాలి. అందుకే గిరీశం ఆయన పేరు వాడుకుని మేధావిగా హెచ్చులు దొబ్బాడు.
ఈ వెంకటసుబ్బారావంటే ఎవరో కాదు, రెంటాల వెంకటసుబ్బారావు అంటున్నారు, యడ్లవల్లి సుధాకర్.
రెంటాల వెంకట సుబ్బారావు గారు కన్యాశుల్కం రచనా కాలానికి జీవించి ఉన్న వ్యక్తి. అంటే 1890—1910 ప్రాంతాల వారన్న మాట. వారి గురించీ కొన్ని వివరాలు:
రెంటాల వెంకట సుబ్బారావు అత్యధ్యుత ప్రతిభాశాలి, ప్రజ్ఞాశాలి అయిన రచయిత. ఆయన బి.ఎ. బి.ఎల్ చేసి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసేవారు.
వేంకట సుబ్బారావు ప్రాక్టీసుకు స్వప్తి చెపుతున్నారని తెలిసి ఖిన్నుడై "అట్లా చేయవద్దు, నీవు త్వరలో హైకోర్టు జడ్జి పదవి నలంకరిస్తావు" అని ఒక ఇంగ్లీషు జడ్జి నచ్చచెప్పే లోగా సుబ్బారావు "నేను నా జీవితకా లంలో ఆర్జించే ధనంకన్నా సంపదకన్నా మూడునాలుగేళ్ళలో ఎక్కువే సంపాదిస్తానని" ఆత్మవిశ్వాసంతో అలవోకగా ఆయన అభ్యర్ధన తోసిపుచ్చారుట. రెంటాలవారు గొప్ప విద్వాంసుడు. తెలుగు జిల్లాల నుంచి ఏ పండితుడు, ఏ కవి, ఏ ప్రముఖుడు వచ్చినా ఆయన ఆదరించే వారనీ, వారింట్లోనే వసతి ఏర్పరచేవారుట.
ఆయన పాఠశాల విద్యార్థులకు గైడ్లు ప్రచురించగా అవి అత్యంత ప్రచారం పొందాయి ఆ నాటి విద్యార్ధి లోకంలో. ఆదిభట్ల నారాయణదాసుగారి స్వీయ చరిత్రలో “ఈయన (నియోగి బ్రాహ్మణుడు)ఆరోజుల్లో చెన్నపట్నం మైలాపూరు చెరువు ఉత్తర గట్టున నివశిస్తూ ఉండేవారనీ, ఆరోజుల్లోనే ఈరకమైన మేడీజీ పుస్తకాలు (గైడ్లు) ప్రచురించి రెండు లక్షలార్జించేడనీ, నారాయణదాసు గారికి కొన్నాళ్లు ఆతిథ్యమిచ్చి ఆయన చేత సంగీత సభలు చేయించినట్టు,హరికథలు చెప్పించినట్లు వ్రాసుకున్నారు. దాసుగారి సభలమీద హిందూ పత్రికలో వ్యాసాలు కూడా వ్రాసేరు. (యామిజాల వారి “పూర్ణపురుషుడు”- 65 పేజీ).
1837 లో ఫొటోగ్రఫీ ఫ్రాన్స్ లో కనిపెట్టబడగా, 1886 తరువాత మద్రాస్ లో శ్రీ సుబ్బా రావు గారు ఫొటో స్టూడియో లాంటిది పెట్టి (ఆ రోజుల్లో ఫొటోఫేక్టరీ అనేవారు), భారతదేశానికి సంబంధించిన ఫొటోలను పాశ్చాత్య దేశాలకు పంపుతూ ఉండేవారుట. ఆ తరువాత కలకత్తా, బొంబాయి ప్రాంతాల్లో ఈ స్టూడియో లు వెలిసి విజయనగరంలాంటి బస్తీ లకు కూడ వచ్చినట్టు కన్యాశుల్కం నాటకం ద్వారానే తెలుస్తుంది. అంతకు ముందు చిత్రకారులు జలవర్ణ చిత్రాలు, తైలవర్ణ చిత్రాలు సాంప్రదాయ చిత్రకారులు మాత్రమే చెతితో చిత్రీకరించేవారు. చాలా ఖర్చుతో కూడినది కావడంతో రాజులు, ధనవంతులు,జమీందారులవరకే పరిమితమైపొయింది. ఆ తరువాత ఫొటోగ్రఫీ పద్ధతి వచ్చి ఒక ఫొటో 16 రూపాయల కు తీసి అంచించేవారంట (ఈ ధర కూడ కన్యాశుల్కం లోనే పలికించారు బంట్రోతు పాత్రధారితో).
అలా కన్యాశుల్కం నాటకం ద్వారా మనకు కనిపించే పాత్రలు అప్పటి వ్యవస్థ లో జీవించి ఉన్న వ్యక్తుల మధ్యే తిరుగుతూ వారికి సమాజం పట్ల ఉన్న బాధ్యతలను కూడా చెప్పింది ప్రత్యక్షంగా, పరోక్షంగా.... ఆ సుబ్బారావు గారే దేశోద్ధారక శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు గారి మేనకోడలు రామబాయమ్మ ను వివాహం చేసుకున్నారు.
(రచయిత ఒక బ్లాగర్. ఆయన బ్లాగ్ నుంచి పునర్ముద్రితం)