అన్నమయ్య మూడో కన్ను నరసింహ స్వామి

Annamayya third eye Narasimha Swamy

Annamayya third eye Narasimha Swamy

ఆదిశంకరాచార్య గురించి కొన్ని కథలు చదివుంటాము.కాపాలికులు బలి ఇచ్చే సమయంలో,మరోసారి మండనమిశ్రుడు,ఉభయభారతి కథల్లో పరకాయప్రవేశం చేసిన సమయంలో శరీరాన్ని దహనం చెయ్యబోయినప్పుడూ నరసింహస్వామి రక్షించాడని.ఆదిశంకరులు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చెప్పారని చదివాము.

ఇక పదకవితా పితామహుడు అన్నమయ్య విద్యాభ్యాసమంతా అహోబిలం లో జరిగింది,ఇక్కడ కొలువైన నవ నరసింహుల మీదే కాకుండా,కదిరి నరసింహస్వామి మీదా ఎన్నో కీర్తనలను రాసాడు.దశావతారాల్లో ఈ అవతారమూర్తి మీదే ఎక్కువ పాటలు రాసాడనీ అంటారు.

ఒక కీర్తన మాత్రం ఏ సందర్భంలో రాసాడో తెలియదు కానీ అన్నమయ్య సినిమాలో ఆ పాటను తనమీద కీర్తనలను రాయమన్న రాజు ఆజ్ఞను ధిక్కరించగా అన్నమయ్య ను బంధీ చేసినప్పుడు అన్నమయ్య నరసింహస్వామి ని వేడుకోగా ఆ బంధనాలనుంచి విముక్తుడిని చేసినట్టు చిత్రీకరించారు.

ఆ పాట గుర్తొచ్చిందనుకుంటాను....."ఫాల నేత్రానల ప్రభల విద్యుల్లతా కేళీ విహారా లక్ష్మీనారసింహా".......

 

సరే కానీ సంస్కృత సమాసాలతో నిండిన ఆ పాట ఎందరికర్ధమైందో(నాకూ తెలియదు మరి)కానీ మొదటి పదం మాత్రం "ఫాల నేత్రానల" అని ఉంటుంది.అగ్ని ఉన్న ఫాలనేత్రం....మరి అది ఉండేది శివుడికేగా?అన్నమయ్య తప్పుగా రాసాడా?

ఆ సందేహాలకు సమాధానం ఈ ఆలయం......

 

Annamayya third eye Narasimha Swamy

అహోబిలం నవనారసింహక్షేత్రం.ఇక్కడ జ్వాలా,మాలోల,పావన,క్రోడ(వరాహ),ఉగ్ర,యోగానంద,భార్గవ,కారంజ,ఛత్రవట నరసింహ మూర్తులుగా కొలువై ఉన్నాడు.అహోబిలం నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటి "కారంజ నరసింహాలయం".ఇక్కడ హనుమంతుడు తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనమివ్వగా... నువ్వూ నా రాముడు ఒకరు కాదనగా స్వామి ధనుర్భాణాలతో ఒక కారంజ (కానుగ మాను) వృక్షం కింద దర్శనమిచ్చాడట.అంతే కాదు ఈ స్వామికి ఫాల భాగాన మూడో నేత్రం ఉంటుంది.

ఇదండీ అన్నమయ్య మూడో కన్ను నరసింహ స్వామి కథ.దిగువ అహోబిలం(లక్ష్మీ నరసింహ ఆలయం) నుంచి ఎగువ అహోబిలం(ఉగ్ర నరసింహ స్వామి) కు వెళ్లే దారి లో ఒకప్పుడు రాళ్ల గుట్టగా కనిపించే ఈ ఆలయాన్ని 15 సంవత్సరాల క్రితం పునర్నిర్మించారు.ఆ పునర్నిర్మాణ సమయంలో మూలవిరాట్టును శుభ్రం చేసినప్పుడు ఈ ఫాలనేత్రం గురించి తెలిసింది.అంతవరకూ ఎక్కడా అన్న సందేహం ఉండేది.దిగువ అహోబిలం నుండి ఎగువనున్న ఉగ్రనరసింహాలయానికి వెళ్లే దారిలో దారి పక్కనే ఈ ఆలయం ఉంది.

అంతేకాదు...నవనారసింహా నమో నమో అన్న ఈ కీర్తనలోని కానుగుమాని నారసింహ అంటూ వర్ణించింది ఈ స్వామినే.

 

ప|| నవనారసింహా నమో నమో | భవనాశితీర యహోబలనారసింహా ||

చ|| సతతప్రతాప రౌద్రజ్వాలా నారసింహా | వితతవీరసింహవిదారణా |
అతిశయకరుణ యోగానంద నరసింహ | మతిశాంతపుకానుగుమానినారసింహ ||

చ|| మరలి బీభత్సపుమట్టెమళ్ళనరసింహ | నరహరి భార్గోటినారసింహ |
పరిపూర్ణశృంగార ప్రహ్లాదనరసింహ | సిరుల నద్భుతపులక్ష్మీనారసింహ ||

చ|| వదనభయానకపువరాహనరసింహ | చెదరనివైభవాల శ్రీనరసింహా |
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి | పదివేలురూపముల బహునారసింహ ||

Annamayya third eye Narasimha Swamy