వాల్మీకి రాయామణం రాయాలని ఎందుకు అనుకున్నాడు?

వాల్మీకి రాయామణం రాయాలని ఎందుకు అనుకున్నాడు?

‘‘వ్యక్తి ఆరాధన’’ 

ఈ విషయమై ఆ మధ్య కొందరు పెద్ద రచ్చ చేశారు. 

ఒకానొక ఉద్యమంలో ఉన్నవారికి వ్యక్తి ఆరాధన తగదు, అటువంటి వారు ఉద్యమానికి తగరు, వారు బహిష్కరణీయులు అని ఒకాయన వాదించడం మొదలు పెట్టారు.

అసలు వ్యక్తి అంటే ఏమిటో,

ఆరాధన అంటే ఏమిటో,

ఆయన గమనిక ప్రకారం ఉద్యమంలో ఎవరు ఎవరిని ఆరాధిస్తున్నారో,

ఎవరు ఎవరిని ఎందుకు ఆరాధించరాదో,అసలు అందరూ కలిసి చేసే ఉద్యమంలో కొందరి మీద ఆయన అత్తగారి పెత్తనం లాంటిది చేయబోయి నిషేధం విధించడం ఏమిటో, ఆయన "నిషేధ ఆజ్ఞలను" లెక్కచేయని వారిమీద తన అనుచరులతో పథకం ప్రకారం బురదజల్లించటం ఏమిటో, అసలు అందరికీ చెందిన ఉద్యమాన్ని ఆయన ఒక్కడే తనకు నచ్చినట్టు తన కనుసన్నలలో నడిపించబూనుకొనటం ఏమిటో - అదంతా ఓ పెద్ద గందరగోళం.

అసలు ఆయన మాటలు ఆయనకే అర్థం అయినాయి లేదో కానీ,అర్థం ఐనాయనుకున్న కొందరు అనుచరులు మాత్రం వ్యక్తి ఆరాధన మహానేరం అని, ఆ మహానేరాన్ని కొందరు తెగ చేసేస్తున్నారని, అట్లా నేరం చేసినవారు ఉద్యమాన్ని ఎక్కడికో హైజాక్ చేస్తున్నారని తెగ భ్రమపడి అడ్డదిడ్డంగా నోరు పారేసుకున్నారు.

చివరకు ఛీపో అని కొందరు చిరాకు పడి ఆ అల్లరిగుంపుకు దూరమైతే "ముసుగు తొలగించి" పంపేశాము అని వాళ్లకు వాళ్ళే చీర్స్ చెప్పుకుని చాలా సంతోషపడిపోయారు కూడా. సరే, ఎవరి స్వర్గంలో వారిదే ఆనందం. దానికి మనం భంగం కలిగించరాదు.

అది సరే గాని, మీరు అసహ్యించుకుంటున్న "వ్యక్తి ఆరాధన" అనే పదానికి ఏమైనా ఒక నిర్వచనం మీదగ్గర ఉన్నదా అని ఒకటి రెండు సార్లు నేను వారిని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాని, దాదాపు సంవత్సరం దాటినా ఇంతవరకు నా ప్రశ్నకు సమాధానం వారినుండి లభించలేదు.

అనాలోచితంగానూ, నిష్కారణంగానూ నోటికొచ్చినట్టు కొందరిని నిందించడంలోనూ దూషించడంలోనూ ఉన్నంత మజా తామే పరిశోధించి వెలుగులోనికి తెచ్చిన ఒకానొక పదాన్ని నిర్వచించడంలో వారికి కనబడినట్టు లేదు.కాబట్టి, వ్యక్తి ఆరాధన అంటే ఏమిటో నేను అనుకుంటున్న దాని ప్రకారం వివరిస్తాను.


వ్యక్తి అనేది ఒక స్త్రీలింగపదం. 
పృథగాత్మ అని అమరకోశం అర్థం చెబుతుంది. అంటే - ఒక పదార్ధం నుండి మరొక పదార్థాన్ని వేరుగా చూపే విశేషమే వ్యక్తి. వ్యక్తము అయినది వ్యక్తి అనే భావంలో స్పష్టత అనే అర్థం కూడా ఉన్నది.

మానవుని స్వభావము మానవత్వము. 
పశువు స్వభావము పశుత్వము. 
అలాగే, వ్యక్తి స్వభావము వ్యక్తిత్వము.

అంటే, ఒక మనిషిని (అనుకుందాము) వేరొకమనిషి నుండి వేరు చేసి చూపే ప్రత్యేకస్వభావమే వ్యక్తిత్వము.

వేరు చేయడం అంటే ఇక్కడ దురర్థం ఏమీ లేదు. 
ప్రతి ఒక్కరికి తమదైన ప్రత్యేకత ఉంటుంది. 
అలా ఉండకపోతే అసలు ఓ మనిషిని మనం గుర్తు పట్టలేము.

ఓ బియ్యపు గింజను చూపి బియ్యం బస్తాలో పడేసి, కలిపేసి, ఏదీ, ఇపుడు చూపించిన బియ్యపు గింజను తిరిగి చూపమంటే చూపగలమా? చూపలేము కదా? అంటే, వాటికంటూ ఒక వ్యక్తిత్వం లేదు అని అర్థం అన్నమాట.

శారీరకంగానూ, మానసికంగానూ, ఆలోచనల ప్రకారంగానూ, నడవడిక ప్రకారంగాను, సంస్కృతిపరంగాను, నేర్చుకున్న విద్యల ప్రభావం వల్లను, పెరిగిన ప్రాంతం వల్లను, వివిధ అవగాహనలవల్లను - ఇలా మనిషి అనేకరకాలుగా ప్రభావితుడై తనకంటూ ఒక ప్రత్యేకతను ఒక స్వభావాన్ని సంతరించుకుంటాడు. అది అతడి వ్యక్తిత్వం. అది సాంఘికంగా ఆమోదయోగ్యం కావచ్చు, కాకపోవచ్చు కూడా. కాబట్టి వ్యక్తి అంటే మనిషి కాదు, వ్యక్తిత్వమే.
***

ఇక ఆరాధన అనే పదం. దీనికి వాచస్పత్యనిఘంటువు ప్రకారం 1సంసిద్ధి 2సాధన 3సంతోషపరచడం 4సేవించడం అనే అర్థాలు ఉన్నాయి.

భగవదారాధన అనే పదం తీసుకుంటే - భగవంతుని సిద్ధింపజేసుకొనటం, భగవంతుని సాధించటం, భగవంతుని సంతోషపరచడం లేదా భగవంతుని సేవించడం అనే అర్థాలు వస్తాయన్నమాట.
***

ఇపుడు వ్యక్తి ఆరాధన అంటే ఏమిటో అర్థమైంది కదా?
వ్యక్తిత్వాన్ని సిద్ధింపజేసుకొనడం, 
వ్యక్తిత్వాన్ని సాధించడం.
వ్యక్తిత్వంతో సంతోషపరచడం, (& సంతోషపడడం) 
వ్యక్తిత్వాన్ని సేవించడం.
***

వాల్మీకి రాముడిని ఆరాధించి అతని చరిత్రను రామాయణంగా మనకు అందించాడు. రాముడు ఒక మనిషిగా పుట్టాడు. కానీ, అతని వ్యక్తిత్వానికి ఆకర్షింపబడి, అతనిని ఘనంగా కీర్తించిన వాల్మీకి అతడిని దేవుడిగా మార్చేశాడు!

కాని, వాల్మీకి గుడ్డిగా రాముని పట్ల "వ్యక్తి ఆరాధన" కనబరచిన దాఖలాలు లేవు. తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుడిని పట్టుకుని - "నా సమకాలికులలో...

1.గుణవంతుడు 2.వీరుడు 3.ధర్మం తెలిసినవాడు 4.కృతఙ్ఞతకలిగినవాడు 5.సత్యవంతుడు 6.దృఢవ్రతుడు 7.మంచి నడవడిక కలిగినవాడు 8.అన్ని ప్రాణుల పట్ల దయకలిగినవాడు 9.విద్వాంసుడు 10.సమర్థుడు 11.దర్శనమాత్రంతో ఆహ్లాదం కలిగించేవాడు 12.ఆత్మవంతుడు, 13.కోపాన్ని జయించినవాడు 14. తేజస్వి 15.అసూయలేనివాడు 16.రోషం కలిగితే దేవతలను కూడా భయపెట్టగలిగినవాడు; ఇన్ని గుణాలు కలిగినవాడు ఎవడున్నాడని" అడిగి, అవన్నీ కలిగినవాడు రాముడని నారదుడు చెప్పగా, తనకు సృష్టికర్త ప్రసాదించిన జ్ఞానంతో నారదుని మాటలు నిజమేనని తెలుసుకుని, అప్పుడు రామాయణ రచన చేశాడు.

అదీ వ్యక్తి ఆరాధన.

అర్జునినితో సహా పాండవులు అందరూ శ్రీకృష్ణుని ఆరాధించారు. పాండవుల ప్రతి అభ్యుదయంలోనూ శ్రీకృష్ణుని పాత్ర సుస్పష్టంగా ఉన్నది. అతడు తమకు దూరమైనపుడు...

"మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురుడు, దేవర, మనలను దిగనాడి చనియె మనుజాధీశా!"

అని ఎంతగానో శోకించారు. అతడు లేని లోకంలో బ్రతకడం దుర్భరంగా తోచి రాజ్యాన్ని సంపదలను వదలుకొని మహాప్రస్థానానికి బయలుదేరారు.

అదీ వ్యక్తి ఆరాధన.

అయితే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. తమ ఆరాధకులైన వాల్మీకిని గాని పాండవులను గాని వారు ఆరాధించిన వ్యక్తులు ఎన్నడూ అసంతృప్తికి గురిచేయలేదు. వారి నమ్మకానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు.

ముందుగానే చెప్పినట్టు, వారు చేసినది వ్యక్తి ఆరాధన అని మనం అంటున్నా, నిజానికది ఆ వ్యక్తులలో ఉన్న గుణాల ఆరాధన. అదే వ్యక్తిత్వ ఆరాధన కూడా.

ఈవిధంగా మహామహులే వ్యక్తి ఆరాధన చేశారు. తప్పేమీ లేదు. వ్యక్తి ఆరాధనను మన సంస్కృతి నిరుత్సాహపరచదు. అలాగని ప్రోత్సహించదు కూడా. ఎందుకంటే మనం ఆరాధింపబూనుకున్న వ్యక్తులు సరైనవారు కాకపోతే, తత్ఫలితంగా మంచిదైన మన వ్యక్తిత్వాన్ని కూడా బలవంతంగా చంపుకొనవలసి వస్తుంది.

తనకు ఆశ్రయం కల్పించాడన్న ఒకే ఒక్క కారణంగా కర్ణుడు దుర్యోధనుని కోసం తనదైన వ్యక్తిత్వాన్ని చంపుకొనవలసి వచ్చింది. దుర్యోధనుడి వ్యక్తిత్వాన్నే తన వ్యక్తిత్వంగా స్వీకరించి దుష్టచతుష్టయంలో ఒకడిగా మిగిలిపోవలసి వచ్చింది.
***

ఈ విషయాలపై కుప్పలు తెప్పలుగా బోలెడన్ని ఉదాహరణలను ఇవ్వవచ్చు. కాని, అన్నం ఉడికిందని తెలుసుకొనేందుకు ఒకటి రెండు మెతుకులు చాలు కదా?

నేటి కాలంలో సర్వసుగుణాలూ మూర్తీభవించిన వ్యక్తి ఎవరూ లేరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని సుగుణాలు ఉన్నాయి, కొన్ని దుర్గుణాలు కూడా ఉన్నాయి. సంపూర్ణ వ్యక్తి ఆరాధనకు తగినవారు ఎవరూ లేరు. ఉన్నారనే భ్రమలు కూడా ఎవరికీ లేవు.

కాబట్టి హంసైర్యథా క్షీరమివామ్బుమధ్యే అన్నట్టు - నీటిని వదిలి పాలను స్వీకరించే రాజహంసల మాదిరి ఆయా వ్యక్తులలో సుగుణాలను మెచ్చుకుంటూ, దుర్గుణాలను ఖండిస్తూ తామరాకుపై నీటిబొట్టులా ఉండటమే మనం ఈనాడు చేయగలిగింది.

అది మాత్రం ఎందుకని మౌనం ఆచరిస్తే మరీ మంచిది. మౌనం సర్వార్థసాధకం అవునో కాదో గాని, మౌనం మునేర్లక్షణం అనే మాట ప్రకారం, అది మునుల లక్షణం.

ఈ వివేకం ఓ సంవత్సరం క్రితం నిష్కారణంగా నిందింపబడిన ప్రతి ఒక్కరికి స్పష్టంగా ఉంది. ఆ వివేకం మాకు తప్ప వేరెవరికీ లేదనుకున్నవారిది మాత్రం పెద్ద అవివేకం అని మాత్రం ఘంటాపథంగా చెప్పగలను.


సరే, గతం గతః.

మీ పనుల్లోనో, మీ ఉద్యమంలోనో జోక్యం చేసుకొనేందుకు గాని, ఆటంకాలు కలిగించేందుకుగాని, అభ్యంతరాలు చెప్పేందుకుగాని, మధ్యలో దూరటానికి గాని మాకు ఎటువంటి ఆసక్తీ లేదు.

ఎప్పట్నుంచో చెప్పాలనుకుంటున్న మాటలు ఇప్పుడు చెప్పే వీలు కుదిరింది, చెప్పాను.

అంతే.

ఇప్పుడెందుకీ పోస్టు అని ఎవరూ తలలు వేడెక్కించుకోవద్దు. 
 ఇది కేవలం సమాచారం కోసమే...

మేమే నికార్సైన ఉద్యమవాదులం అనుకుంటున్న వారందరికీ కూడా మీ ఉద్యమం సఫలం కావాలని హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.

 

(* రచయిత శ్రీనివాస కృష్ణ సంస్కృత పండితుడు.  'రాష్ట్రీయ  సంస్కృత విద్యాపీఠం’ లో అధ్యాపకుడు)

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos