మతిస్థిమితం లేని ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను బంధించి రోజుల తరపడి అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ  మహిళ గర్భం దాల్చింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... అనంతపురం జిల్లా కణేకల్లు మండలం పెనకలపాడు గ్రామ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న ఓ మహిళకు మతిస్థిమితం లేదు. కొంతకాలం క్రితం ఆమెకు ఓ వ్యక్తితో వివాహం జరిపించారు. అయితే... ఆమెకు మతిస్థిమితం సరిగాలేని కారణంతో ఆమెను భర్త వదిలేశాడు. దీంతో అప్పటి నుంచి ఒంటరిగా జీవిస్తోంది.  కాగా.. ఆమెపై ముగ్గురు యువకులు కన్నేశారు.

నెలల తరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కనీసం తనపై అత్యాచారం జరిగిన విషయం కూడా ఆమె తెలియకపోవడం గమనార్హం.  ఆమెలో మార్పును గమనించిన స్థానిక మహిళలు ఆరా తీయగా అసలు విషయం బయటికొచ్చింది. ముగ్గురు యువకులు ఈ పైశాచికత్వానికి పాల్పడినట్లు తెలియడంతో పెద్ద మనుషులు రంగంలోకి దిగారు. అబార్షన్‌ చేయించి చేతులు దులుపుకోవాలని చూడగా.. అప్పటికే ఐదు నెలల గర్భం కావడంతో అలాగే వదిలేశారు. కాన్పు అయ్యాక ఆలోచిద్దామని అనుకొని వదిలేశారు.

కాగా... తాజాగా ఇటీవల ఆమెకు డెలివరీ అయ్యింది. పుట్టిన బిడ్డ కూడా అనారోగ్యంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. తల్లీ,బిడ్డ ఆరోగ్యం సరిగా లేదని వారు తెలిపారు. సరైన పోషకాహారం అందకపోవడం వల్లే తల్లీ, బిడ్డ ఆరోగ్యం సరిగాలేదని వారు చెబుతున్నారు.