విశాఖపట్నం: పర్యాటక రంగంలోనే కాకుండా రాబోయే రోజుల్లో క్రీడల హబ్ గా కూడా విశాఖను తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు.  స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో రోటరీ క్లబ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, లూయీస్ ఫిలిప్స్, తదితరమైన వాటి ఆధ్వర్యంలో 12 మరియు 13 తేదీలలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్సీస్ ఓపెన్ టోర్నమెంట్ ను ఆయన శనివారం ప్రారంభించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విదేశాల నుండి వచ్చే పర్యాటకులు సౌకర్యవంతంగా వుండేందుకు విశాఖలో స్టార్ హోటల్స్ ఉన్నాయన్నారు. వాటిలో వుంటూ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చని ఆయన జపాన్ డెలిగేట్స్ కు వివరించారు.  

పిల్లల ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతో దోహద పడతాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి క్రీడాకారులు ఈ టోర్నమెంటులో పాల్గొంటున్నట్లు  చెప్పారు.  రాష్ట్రంలోని చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాలోని అగనంపూడిలో 150 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.  

అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే విధంగా స్టేడియంలు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వం క్రీడాకారులను ఆదుకుంటుందని తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కప్ (ఫుట్ బాల్) ఈ నెల 14,15,16 తేదీల్లో విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  బాలికలకు రైల్వే గ్రౌండ్ లోను, బాలురు కు పోర్టు స్టేడియంలో ఫుట్ బాల్ పోటీలు నిర్వహిస్తామన్నారు.  

క్రీడలకు తమవంతు పూర్తి సహాయ, సహకారాలు అందించనున్నట్లు వెల్లడించారు.  ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న  ఆయా సంస్థలను ఆయన అభినందించారు.  
విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎం.వి.వి. సత్యనారాయణ మాట్లాడుతూ... క్రీడలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమన్నారు.  ఇలాంటి క్రీడలు జిల్లాలో మరిన్ని నిర్వహించాలని ఆయన మంత్రిని కోరారు.  ఈ క్రీడలు ఏర్పాటు చేసిన కమిటీని ఆయన అభినందించారు.  

అంతకు ముందు మంత్రి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడలకు సంబంధించిన సావనీర్ ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో సెట్విస్ సిఇఓ శ్రీనివాసరావు, డిఎస్డిఓ ఎన్. సూర్యారావు, రోటరీక్లబ్ అధ్యక్షులు బాబ్జీ, కార్యదర్శి శర్మ, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మరియు హనీ గ్రూప్ ఎం.డి. ఓబుల్ రెడ్డి, సన్ రే ఎం.డి. రాజ్ కమల్ రాజబాబు, లూయీస్ ఫిలిప్స్ అధ్యక్షులు కంటిపూడి వెంకటరావు, జపనీస్ చీఫ్ నగౌర, వరదారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.