అధికారం తమ చేతిలో ఉంది కదా అని ఓ వైసీపీ ఎమ్మల్యే కుమారుడు వీరంగం సృష్టించాడు. అతను చేసిన నిర్వాకం కారణంగా  మూడు గంటలపాటు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోనసమీ ప్రాంతం అంబాజీ పేట నాలుగు రోడ్ల సెంటర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కుమారుడు వికాస్ తన జన్మదిన వేడుకలను నడి రోడ్డుపై జరుపుకున్నారు. ప్రజల రాకపోకలను అడ్డుకొని... ఆ ప్రాంతం మొత్తం స్వాధీనం చేసుకొని మరీ ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం గమనార్హం. దాదాపు మూడు గంటలపాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. 

అందులోనూ అది నాలుగు రోడ్ల కూడలి  కావడంతో... మరింత ఎక్కువగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కనీసం ద్విచక్రవాహనాలు  కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో... ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజకీయ పలుకుబడి ఉందికదా అని ఈ విధంగా ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఒక్క వాహనం ముందుకు కదలకపోవడంతో వాహనదారులు తీవ్రమైన అవస్థకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.