కర్నూలు: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారులు నేరుగా కాకుండా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా లంచం తీసుకుంటున్నారని అందుతున్న ఫిర్యాదులు ఏసిబి స్పందించి చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే  కర్నూలు ఏసీబీ డీఎస్పీ  నాగభూషణం ఆద్వర్యంలో సోదాలు చేపట్టారు.  

ఏసిబి అధికారులు మూకుమ్మడిగా వచ్చి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు... డాక్యుమెంట్ రైటర్ల దగ్గర కూడా  తనిఖీలు చేపట్టారు. కేవలం గంట సమయంలోనే 14 మంది డాక్యుమెంట్ రైటర్ల దగ్గర లెక్క తేలని నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు.  అలాగే కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు ఆధీనంలోకి తీసుకుని అక్కడి అధికారులను విచారించారు.

 ఆఫీసుతో పాటు డాక్యుమెంట్ రైటర్ల షాపుల్లోనూ ఏకకాలంలో తనిఖీలు చేయడం చూసి కొంత మంది సిబ్బంది పరారైనట్లు సమాచారం. క్రయ విక్రయాల కౌంటర్ కు వస్తున్న దస్తావేజులను స్వాధీనం చేసుకుని.. వారు ఎవరెవరికి ఎంతెంత  మొత్తం ఇచ్చింది కనుక్కుని.. ఈ మేరకు డాక్యుమెంట్ రైటర్ల దగ్గర ఏసిబి అధికారులు వాంగ్మూలం తీసుకున్నారు. 

ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు మొత్తం తీసుకుని ఆఫీసు సిబ్బందితో కలసి వాటాలు వేసుకుని పంచుకుంటున్నట్లు తేలింది. దీంతో మొత్తం 14 మంది 
డాక్యుమెంట్ రైటర్ల దగ్గర పట్టుబడిన లంచం సొమ్ము లక్షా 57 వేల 360 రూపాయలు సీజ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తున్నామని.. ఎక్కువ మొత్తం ఎలా వసూలు చేసేది.. వాటాలను ఎలా పంచుకునేది పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం చెప్పారు.