Asianet News TeluguAsianet News Telugu

టీం ఇండియా పరిస్థితి: సాకు టాస్.... ఆడలేక మద్దెల ఓడడమేనా

టెస్టుల్లో వరల్డ్‌ నం.1 జట్టు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో అగ్రస్థానం. టెస్టు చాంపియన్‌షిప్స్‌లో ఆడిన మూడు సిరీస్‌ల్లో ఓటమనేది ఎరుగని జట్టు. న్యూజిలాండ్‌ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ నెగ్గగల సత్తా ఉన్న బృందంగా కితాబు!. అయితేనేం, వెల్టింగ్టన్‌ తొలి టెస్టులో టీమ్‌ ఇండియా తేలిపోయింది.

India vs New Zealand: Is toss sole responsible for the  defeat in wellington test?
Author
Wellington, First Published Feb 27, 2020, 3:17 PM IST

ప్రపంచ క్రికెట్లో అగ్ర జట్టుగా దూసుకుపోతున్న ఒక జట్టు.... ప్రత్యర్థులకు వెన్నులో వణుకు పుట్టించేలా తయారయ్యిందని ప్రపంచ క్రికెట్ విశ్లేషకులు కొనిపోయాడుతున్నారు. ఒకరు కాకపోతే మరొకరు మ్యాచ్ విన్నర్లుగా ఉద్భవిస్తున్నారు. 

టెస్టుల్లో వరల్డ్‌ నం.1 జట్టు. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో అగ్రస్థానం. టెస్టు చాంపియన్‌షిప్స్‌లో ఆడిన మూడు సిరీస్‌ల్లో ఓటమనేది ఎరుగని జట్టు. న్యూజిలాండ్‌ గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్‌ నెగ్గగల సత్తా ఉన్న బృందంగా కితాబు!. 

అయితేనేం, వెల్టింగ్టన్‌ తొలి టెస్టులో టీమ్‌ ఇండియా తేలిపోయింది. అన్ని రంగాల్లోనూ ఆతిథ్య న్యూజిలాండ్‌ ముందు తలొంచింది. పది వికెట్ల తేడాతో దారుణ ఓటమి చవిచూసింది. వెల్లింగ్టన్‌ ఓటమికి కోహ్లిసేన వైఫల్యంతో పాటు అనేక కారణాలు కనబడుతున్నాయా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. 

టెస్టు క్రికెట్‌లో టాస్‌ పాత్రపై కొంతకాలంగా విపరీత చర్చ నడుస్తోంది. టాస్‌ కోల్పోగానే, పర్యాటక జట్లు దాదాపు మ్యాచ్‌పై ఆశలు వదులుకుంటున్నాయి!. టెస్టు క్రికెట్‌ భవిష్యత్‌పై, జనాదరణపై టాస్‌ ప్రతికూల ప్రభావం చూపుతుందని కొంతకాలంగా క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. 

టెస్టు క్రికెట్‌ నుంచి టాస్‌ను తొలగించి, పర్యాటక జట్టుకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ ఎంచుకునే అవకాశం కల్పించాలనే వాదన కూడా బాగా వినిపిస్తోంది. ఈ వాదనకు సానుకూల, ప్రతికూల అంశాలు చాలానేఉన్నాయి. 

ప్రపంచ క్రికెట్‌లో ఎక్కడైనా టాస్‌ ప్రభావం కనిపిస్తోంది. కానీ న్యూజిలాండ్‌ పిచ్‌లపై ఇది విచిత్రం. భారత్‌లో నాల్గో ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయటం గగనం. కానీ తొలి ఇన్నింగ్స్‌లో అలవోకగా 500కు పైగా పరుగులు బాదేయవచ్చు. 

భారత్ లో టాస్‌ ఓడితే, పర్యాటక జట్లు 2-3 రోజుల్లోనే మ్యాచ్ పై పట్టును పూర్తిగా కోల్పోతాయి. స్పిన్‌ తాకిడికి తట్టుకోలేక పర్యాటక జట్లు చెతులేత్తేస్తాయి. న్యూజిలాండ్‌ పిచ్‌లు అందుకు పూర్తి భిన్నం. 

పిచ్ లందు న్యూజిలాండ్ పిచ్ లు వేరు....

న్యూజీలాండ్ పిచ్‌లపై తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులు చేయటం గగనం. ఇక్కడ తొలి రెండు రోజుల్లో పిచ్‌ నుంచి పేసర్లకు గొప్ప సహకారం లభిస్తుంది. ఆట సాగుతున్న కొద్ది పిచ్‌ పరుగుల సాధనకు ఉపకరిస్తుంది. 

అందుకే ఈ పరిస్థితుల్లో టాస్‌ ఓడి, తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడే పర్యాటక జట్టు మ్యాచ్‌పై సగం ఆశలు కోల్పోతుంది. భారత్‌, న్యూజిలాండ్‌ వెల్లింగ్టన్‌ టెస్టులోనూ ఇదే జరిగింది. 

Also read: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా: పృథ్వీషా ఔట్, శుభ్ మన్ గిల్ ఇన్

2013 డిసెంబర్‌ నుంచి టెస్టు టాస్‌ గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. న్యూజిలాండ్‌లో (2013 నుంచి) 28 టెస్టులు జరిగాయి. అందులో టాస్‌ నెగ్గిన జట్లు 25 సార్లు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాయి. అందులో 12 సార్లు విజయాలు సాధించగా, 8 మ్యాచుల్లో మాత్రమే ఓటమి ఎదురైంది. 

ఇదే సయమంలో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన 253 టెస్టుల్లో ప్రత్యర్థి జట్లు కేవలం 58 సార్లు మాత్రమే ఫీల్డింగ్‌ ఎంచుకున్నాయి. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా టాస్ నెగ్గిన జట్టు టెస్టుల్లో బ్యాటింగ్ కు మొగ్గు చూపుతుంది. పిచ్ స్వభావం లో గణనీయమైన మార్పు ఉందనుకుంటే మాత్రమే సెకండ్ బ్యాటింగ్ కు దిగుతుంది. 

న్యూజిలాండ్ పిచ్ లపై ఉన్న జీవం, అదనంగా లభించే పేస్‌, సీమ్‌లను వినియోగించుకునే అవకాశం పేసర్లకు కల్పిస్తున్నాయి. న్యూజిలాండ్‌లో టెస్టు పిచ్‌లు తొలి రెండు రోజులు సీమర్లకు సహకరిస్తాయి. 

బంతి ఆలస్యంగా సీమ్‌, స్వింగ్‌ అయ్యే కివీస్‌ పరిస్థితుల్లో ముందుగానే షాట్‌కు ఉపక్రమిస్తే కొంప కొల్లేరయినట్టే. ముందుగా గనుక బాల్ ను అంచనావేసి షాట్ ఆడబోతే మాత్రం వికెట్‌ ను పువ్వుల్లో పెట్టి వికెట్ సమర్పించుకోవడమే. వెల్లింగ్టన్‌ టెస్టులో భారత్‌కు సరిగ్గా ఇదే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకు కుప్పకూలటంలో పిచ్‌ పాత్ర విస్మరించలేం. 

టాస్... మ్యాచ్ ల మధ్య సంబంధం

టాస్‌ కోల్పోవటం ప్రతికూల ప్రభావం చూపించిందని చాలాసార్లు వివిధ దేశాల కెప్టెన్లు చాలాసార్లు అన్నారు. భారత్‌లో 0-3 ఓటమి తర్వాత సఫారీ కెప్టెన్‌ డుప్లెసిస్‌, వెల్లింగ్టన్‌ ఓటమి తర్వాత విరాట్‌ కోహ్లి చెప్పిన మాటలు కూడా ఇవే! 

ఓటమికి ఇది సాకు అని చెప్పలేం, పూర్తిగా టాస్‌దే బాధ్యత అని తోసేయలేం. కానీ టాస్‌ ప్రభావం మాత్రం ఖచ్చితం. సొంతగడ్డపై భారత్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు భీకర జట్లు. టాస్‌ నెగ్గిన సొంతగడ్డ టెస్టుల్లో న్యూజిలాండ్‌ 10 విజయాలు సాధించింది. 2009 నుంచి టాస్‌ నెగ్గిన ఒక్క టెస్టులోనూ ఓటమి చెందలేదు. 

Also read: ఘోర పరాజయం... టాప్ ప్లేస్ కోల్పోయిన విరాట్ కోహ్లీ

స్వదేశంలో భారత్‌ సైతం 23 టెస్టుల్లో 18 విజయాలు సాధించింది. చివరగా 2012లో కెవిన్‌ పీటర్సన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో టాస్‌ నెగ్గి కూడా భారత్ స్వదేశీ టెస్టులో పరాజయం పాలైంది తప్ప వేరే దాఖలాలు లేవు.  

ఆస్ట్రేలియా కూడా సొంత గడ్డపై అమోఘమైన రికార్డు ఉంది. సొంతగడ్డపై 29 టెస్టుల్లో 21 విజయాలు సాధించింది ఆసీస్.  2011 నుంచి టాస్‌ నెగ్గి, టెస్టును ఇప్పటివరకు కోల్పోయిన చరిత్రలేదు ఆస్ట్రేలియా జట్టుకు. 

2018 లో టీమ్‌ ఇండియా పర్యటించిన వేళ స్మిత్‌, వార్నర్‌ లేకపోయినా పెర్త్‌ టెస్టులో టాస్‌ నెగ్గి.. విజయం సొంతం చేసుకుంది కంగారూ జట్టు. ఇదే సమయంలో స్వదేశంలో టాస్‌ ఓడినప్పుడు ఆతిథ్య జట్ల ఓటమి శాతంలో గణనీయ మార్పు కనిపిస్తోంది. 

న్యూజిలాండ్‌ (2010 నుంచి) టాస్‌ ఓడిన 24 టెస్టుల్లో 11 విజయాలు సాధించి, 7 ఓటములు చవిచూసింది. ఆస్ట్రేలియా 27 టెస్టుల్లో 17 విజయాలు, ఆరు ఓటములను చవిచూసింది. 

ఇదే సమయంలో భారత్‌ 27 టెస్టుల్లో 19 విజయాలు సాధించగా, 2 టెస్టుల్లో ఓటమి పాలైంది. 

సొంతగడ్డపై భారత్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ బలీయమైన జట్లు. పర్యాటక జట్లు టాస్‌ నెగ్గినా వారిని ఇంట ఓడించటం కష్టం. అలాంటిది, టాస్‌ కోల్పోయి మ్యాచ్‌ను దక్కించుకోవటం అద్భుతానికి ఏమాత్రం తక్కువ కాదు. 

వెల్లింగ్టన్‌ ఓటమికి భారత్‌ వ్యూహాత్మక తప్పిదాలు సైతం ఒకింత కారణమయ్యాయి. ఓపెనర్ల నుంచి సరైన ఆరంభాలు లోపించటం, మిడిల్‌ ఆర్డర్‌ పూర్తిగా వైఫల్యం చెందటం సహా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టడంలో విఫలమయ్యారు. 

ఇక ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను తీసుకోకపోవడం కూడా భారత్ కు ఒకింత కలిసిరాని అంశం. భీకర ఫామ్ లో ఉన్న రాహుల్ ను ఎందుకు టెస్టు సిరీస్ కు ఎంపిక చేయలేదో కూడా అర్థంకాని మరో విషయం. 

కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లికి టాస్‌ విషయంలో ఘనమైన రికార్డుంది. 21 టెస్టుల్లో టాస్‌ నెగ్గిన విరాట్‌ కోహ్లి అన్నింటా విజయాలు సాధించాడు. విదేశాల్లో పది టెస్టుల్లో టాస్‌ నెగ్గి, ఏకంగా ఎనిమిది టెస్టులో విజయఢంకా మోగించాడు. 

వరల్డ్‌ నం.1 కోహ్లిసేన బ్యాటింగ్‌, బౌలింగ్‌ మెరుపులకు తోడు క్రైస్ట్‌చర్చ్‌లో టాస్‌ సైతం కలిసొస్తేనే విలువైన 60 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్స్‌ పాయింట్లతో పాటు టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసుకునే అవకాశం దక్కనుంది. లేదంటే భారత్ టెస్టు పాయింట్లపై ప్రభావం చూపే ఆస్కారం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios