Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ పై ప్రధాని మోడీ నిర్ణయం ఆ తర్వాతనే

లాక్ డౌన్ ను కొనసాగించాలా, ఎత్తేయాలా అనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. శనివారంనాడు ఆయన సీఎంలతో చర్చలు జరుపుతారు.

Lockdown decision likely after PM's meet with CMs On Saturday
Author
New Delhi, First Published Apr 8, 2020, 11:55 AM IST

న్యూఢిల్లీ: దేశంలో విధించిన లాక్ డౌన్ పై ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగానే చర్చలు జరుపుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేయాలా, కొనసాగించాలా అనే విషయంపై శనివారం ముఖ్యమంత్రులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం నాడు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అభిప్రాయాలను తీసుకుంటారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖ రావు సహా పలువురు ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను కొనసాగించాలని అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ తప్ప మరోటి దేశాన్ని కరోనా వైరస్ లేదా కోవిడ్ 19 నుంచి రక్షించలేదని వారు అభిప్రాయపడుతున్నారు.

కరోనావైరస్ నానాటికీ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 5,194కు చేరుకుంది. కొత్తగా 773 కేసులు నమోదయ్యాయి. దేశంలో మరో 35 మరణాలు సంభవించాయి. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ కుదుటపడడానికి, ప్రాథమిక రంగాలు తిరిగి పనిచేయడానికి వీలుగా లాక్ డౌన్ చర్యలు ఉండాలని భావిస్తోంది. 

వచ్చే వారం విద్యాసంస్థలు ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. మరో నాలుగు వారాల పాటు విద్యాసంస్థలను మూసేయాలని మంత్రుల బృందం సూచించింది. మత సమ్మేళనాలపై, సమావేశాలపై కూడా నిషేధం కొనసాగాలని అభిప్రాయపడింది. 

ఈ నెల 14వ తేదీ తొలి దశ లాక్ డౌన్ ముగుస్తుంది. అయితే, ఆ తర్వాత నాలుగు వారాల పాటు షాపింగ్ మాల్స్ ను కూడా మూసి ఉంచాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశానికి హోం మంత్రి అమిత్ షాతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా హాజరయ్యారు. 

మహారాష్ట్ర (1018), తమిళనాడు (690), తెలంగాణ (364), కేరళ (336) రాష్ట్రాలు కరోనా వైరస్ వ్యాధితో విలవిలలాడుతున్నాయి. ఈ నాలుగు రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ను కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios