Omicron: దేశ రాజధానిలో కొత్త వేరియంట్ కలకలం.. యాంటీ బాడీస్ ఉన్నా..
Omicron: ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ (ఎల్‌ఎన్‌జేపీ)లో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన నమూనాలో ఓమిక్రాన్ కొత్త వేరియంట్‌ని గుర్తించినట్లు ఆస్పత్రి ఉన్నత వైద్యాధికారి తెలిపారు. Omicron సబ్-వేరియంట్ BA 2.75 చాలా నమూనాలలో కనుగొనబడిందని LNJP హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు.
Omicron: భారత్ లో కరోనా కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ.. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం గత కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. నిత్యం రెండువేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఇన్‌ఫెక్షన్ రేటు 15 శాతం దాటింది. ఈ పరిణామంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జేపీ హాస్పిటల్‌లో ఒమైక్రాన్ కొత్త వేరియంట్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ వేరియంట్ ను BA,2.75 గా గుర్తించారు. ఇది ఓమిక్రాన్ యొక్క సబ్-వేరియంట్.
ఈ Omicron సబ్-వేరియంట్ గురించి LNJP హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. అధ్యయనం సమయంలో ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BA,2.75 తెరపైకి వచ్చిందని చెప్పారు. ఈ వేరియంట్ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడిందని, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన కరోనా సోకిన 90 నమూనాలపై ఒక అధ్యయనం జరిగింది. ఇందులో కొత్త వేరియంట్ గురించి సమాచారం అందిందని తెలిపారు.
ఉప వేరియంట్‌కి వేగంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉందని డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. ఇది కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిపై కూడా దాడి చేస్తుందనీ, ఢిల్లీలో వేగంగా కరోనా కేసులకు పెరగడానికి ఈ వేరియంట్ కూడా ఒక కారణమని తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించడం లేదనీ, చాలా మందిలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదనీ, కాబట్టి ఈ వేరియంట్ వేగంగా సోకుతోందని తెలిపారు.
ఇదిలా ఉంటే.. పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ల నేపథ్యంలో 7 రాష్ట్రాలకు కేంద్రం లేఖ రాసింది. పండుగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వృద్దులు, పిల్లల్లో ఈ వేరియంట్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని హెచ్చరించింది.
దేశ రాజధానిలో కోవిడ్-19 కేసుల్లో గణనీయమైన పెరుగుదల, పాజిటివిటీ రేటు లేదా 100 నమూనాలను పరీక్షించగా.. అందులో ఒక్కోటో రెండో కేసు ఈ సబ్-వేరియంట్ కేసులేనని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
యాంటీబాడీస్ ఉన్న వ్యక్తులు కూడా ఈ వేరియంట్ ప్రభావం చూపుతోంది. కొత్త సబ్-వేరియంట్ BA 2.75 అధిక ప్రసార రేటును కలిగి ఉందనీ, ఇప్పటికే ప్రతిరోధకాలను కలిగి ఉన్న లేదా వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులపై కూడా దాడి చేస్తుందనీ డాక్టర్ కుమార్ చెప్పారు. అయితే, కొత్త వేరియంట్ సంక్రమణ తీవ్రత తక్కువగా ఉంటుంది. కానీ, వృద్ధులు, కొమొర్బిడిటీలు ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో గత 24 గంటల్లో 2,445 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది ఫిబ్రవరి 6 నుండి అత్యధికం. పాజిటివిటీ రేటు 15.41 శాతానికి పెరిగింది. అలాగే. తాజాగా ఏడుగురు మరణించారు.