అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పది కేసులు నమోదయ్యాయి. దాంతో శనివారం సాయంత్రానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 190కి చేరుకుంది. కొత్తగా కృష్ణా జిల్లాలో 5, గుంటూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఒక్కటేసి చొప్పున కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్ సోకి ఆంధ్రప్రదేశ్ లో మరో మరణం సంభవించింది. అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణించాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకి మరణించినవారి సంఖ్య రెండుకు చేరుకుంది. శనివారంనాడు మరణించిన ఆ వ్యక్తిని ముస్తాక్ ఖాన్ (56)గా గుర్తించారు. విజయవాడలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

శనివారం ఉదయానికి ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది. కర్నూలు జిల్లాలో కొత్తగా మూడు కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా కేంద్రం, బనగానపల్లి, అవుకుల్లో ఒక్కటేసి కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 190కి చేరుకుంది.

కరోనా వైరస్ పాజిటివ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో శుక్రవారం రాత్రి 10.30 నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు కొత్తగా కృష్ణా జిల్లాలో 4, కడప జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. కొత్తగా నమోదైన ఈ 16 కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 180కి చేరుకుంది.

నెల్లూరు జిల్లాతో కృష్ణా జిల్లా పోటీ పడుతోంది. నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో 32 చొప్పున కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఇప్పటి వరకైతే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ వ్యాధికి గురైనవారిలో ఎక్కువ మంది ఢిల్లీలో జరిగన మతప్రార్థనల్లో పాల్గొని వచ్చినవారే కావడం గమనార్హం. వారిని గుర్తించి, వారినీ వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్ కు పంపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

జిల్లాలవారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది....

అనంతపురం 3
చిత్తూరు 10
తూర్పు గోదావరి 11
గుంటూరు 26
కడప 23
కృష్ణా 32
కర్నూలు 4
నెల్లూరు 32
ప్రకాశం 19
విశాకపట్నం 15
పశ్చిమ గోదావరి 15