కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి
కాలినడకన తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడి భద్రత విషయంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు
తిరుమల: కాలినడకన తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక చేతికర్ర ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.సోమవారంనాడు టీటీటీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి తిరుమలలో మీడియాతో మాట్లాడారు. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు భద్రతను కల్పించే విషయమై హైలెవల్ కమిటీ చర్చించింది.ఈ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు.
తిరుమలకు వచ్చే భక్తుల భద్రత అంశంపై హైలెవల్ కమిటీలో చర్చించినట్టుగా ఆయన చెప్పారు.తిరుమలకు వచ్చే భక్తులపై చిరుతల దాడుల గురించి చర్చించినట్టుగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. అలిపిరి నడక మార్గంలో ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకే పిల్లలకు అనుమతిని ఇస్తామని ఆయన చెప్పారు. భక్తుల భద్రతకు నైపుణ్యం ఉన్న ఫారెస్ట్ సిబ్బందిని సెక్యూరిటీని నియమిస్తామన్నారు.భక్తుల భద్రత కోసం వినియోగించుకొనే ఫారెస్ట్ సిబ్బంది ఖర్చును టీటీడీ భరిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి వివరించారు.
నడక మార్గంలో సాధు జంతువులకు ఆహారం ఇవ్వకూడదని టీటీడీ చైర్మెన్ భక్తులను కోరారు. ఒకవేళ అలా ఆహారం ఇచ్చిన భక్తులపై చర్యలు తీసుకుంటామని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. వ్యర్థ పదార్ధాలను బయటే వదిలేసే దుకాణాలపై చర్యలు తీసుకుంటామని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. భక్తులు గుంపులు గుంపులుగా నడక మార్గంలో వెళ్లాలని ఆయన సూచించారు. అలిపిరి, ఏడో మైలు రాయి, గాలి గోపురం వద్ద క్రూర మృగాల గురించి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే విధంగా వీడియోలను కూడ ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వివరించారు.నడక మార్గంలో ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీశాఖ నిబంధనలు అడ్డుగా ఉన్నాయన్నారు. ఈ విషయమై అటవీశాఖ వద్ద ప్రతిపాదన పెట్టినట్టుగా టీటీడీ చైర్మెన్ చెప్పారు. అయితే అధ్యయనం చేసి చెబుతామని అటవీశాఖాధికారులు చెప్పారని ఆయన తెలిపారు.