మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ చిన్నారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ. 41.50 లక్షలు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు.
అమలాపురం : ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఆపన్న హస్తం అందజేశారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు మానవతా దృక్పథంతో స్పందించి.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 41.50 లక్షలు మంజూరు చేశారు.
దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక పలివెల బ్లేస్సీ కొద్ది రోజులుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంది. రోజురోజుకు తలనొప్పి ఎక్కువ అవుతుండడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. ఆమెకు అన్ని పరీక్షలు చేయించిన వైద్యులు బ్రెయిన్ క్యాన్సర్ గా నిర్ధారించారు. చిన్నారికి చికిత్స చేయడం కోసం రూ.41.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.
కొండపల్లిలో గుండెలు పిండేసే ఘటన... పసికందును సంచిలో కుక్కి తరలిస్తూ పట్టుబడ్డ వృద్దుడు (వీడియో)
అంత డబ్బులు ఖర్చు చేసే స్తోమత లేని కుటుంబం కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సీఎం జగన్ ఈనెల 11వ తేదీన అమలాపురంలో పర్యటించారు. ఆ సమయంలో ఆ చిన్నారి తండ్రి రాంబాబు తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ద్వారా తీసుకువెళ్లారు.
వైఎస్ జగన్ ఆ చిన్నారి సమస్య విని చలించిపోయారు. వెంటనే స్పందించి రూ. 41.50 లక్షలు మంజూరు చేశారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ భార్య బేబీ మీనాక్షి, కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ లు ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును సోమవారం బాధిత కుటుంబానికి అందించారు.