Asianet News TeluguAsianet News Telugu

శామ్‌సంగ్ కూడా ఆదర్శమే: ఇండియాలో ఆఫ్‌లైన్ బిజినెస్‌పై షియోమీ

మార్కెట్లో ప్రత్యర్థులు శామ్‌సంగ్, షియోమీ.. కానీ మార్కెట్ వ్యూహాల అమలులో మాత్రం రెండు పరస్పరం అనుకరిస్తున్నాయి. తాము ఆఫ్ లైన్ బిజినెస్ వ్యూహం అమలులో శామ్ సంగ్ సంస్థను అనుసరిస్తున్నామని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ తెలిపారు.

Xiaomi's Manu Jain learning offline game from Samsung
Author
Hyderabad, First Published Apr 29, 2019, 11:29 AM IST

దేశీయంగా ఆఫ్‌లైన్ బిజినెస్ వ్యూహం దక్షిణ కొరియా మేజర్ శామ్ సంగ్ నుంచి నేర్చుకున్నామని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ చెప్పారు. దేశీయ మొబైల్‌ మార్కెట్‌లో అగ్రస్థానం కోసం శామ్‌సంగ్‌, షియోమీ సంస్థలు నిరంతరం పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

‘అవును! చాలా విషయాలను ఇతర బ్రాండ్‌ల నుంచి నేర్చుకున్నాం. అందులో శామ్‌సంగ్‌ కూడా ఉంది. ఆఫ్‌లైన్‌లో శామ్‌సంగ్ మార్కెట్‌ సేల్స్‌ ఎలా ఉన్నాయో పరిశీలించాం. అందుకు తగినట్లు మా బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నాం’ అని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.

ఇప్పటి వరకు భారత ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో శామ్‌సంగ్‌దే అగ్రస్థానం. బ్రాండ్‌, ఫోన్ల తయారీలో నాణ్యత ఇవన్నీ ఆ మొబైల్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాయి. అయితే, ఆన్‌లైన్‌లో మాత్రం షియోమీదే పైచేయి. 

ఈ నేపథ్యంలో ఆఫ్‌లైన్‌లోనూ తమ మొబైల్‌ విక్రయాలను పెంచాలన్న ఉద్దేశంతో రెండేళ్లుగా ఆ దిశగా అడుగులు వేస్తోంది షియోమీ. ఇప్పటికే 20శాతం మార్కెట్‌ వాటాను సొంతం చేసుకుంది. 

‘ఆఫ్‌లైన్‌లో విక్రయాలు ప్రారంభించినప్పుడు సులభంగా ఏమీ లేదు. మొదటి ఆరు నెలల్లో మా స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఇతర బ్రాండ్‌లు ఏం చేస్తున్నాయో పరిశీలించాం. ముఖ్యంగా శామ్‍సంగ్‌, వీవోలకు ఆఫ్‌లైన్‌లో బలమైన మార్కెట్‌ ఉంది. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకుని మేము ఏం చేయాలో ప్రణాళికలు రూపొందించి, అమలు చేశాం’ అని జైన్‌ తెలిపారు.

మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ కథనం ప్రకారం భారత్ స్మార్ట్ ఫోన్ల విక్రయంలో షియోమీ టాప్ పొజిషన్‌లోకి రావడానికి ఆఫ్‌లైన్ బిజినెస్‌లోకి దూకుడుగా దూసుకెళ్లడమే కారణం. 2019 మార్చితో ముగిసిన త్రైమాసికంలో షియోమీ సేల్స్ రెండు శాతం తగ్గినా 29 శాతానికి చేరాయి. శామ్ సంగ్ ఇటీవల ఆన్‌లైన్‌లో ‘ఎం’ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ ఫోన్లను ప్రవేశపెట్టినా మూడు శాతం బిజినెస్ తగ్గి 23 శాతానికి పడిపోయింది. 

షియోమీ దేశవ్యాప్తంగా 10వేల రిటైల్ షోరూమ్‌లను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వాటి సాయంతో తన స్మార్ట్ ఫోన్ల విక్రయాలను 50 శాతం పెంచాలన్నదే టార్గెట్. అయితే ఆఫ్‌లైన్ బిజినెస్‌లో లాభాలు గడించినా ఆన్‌లైన్‌లో కంటే ఎక్కువ ఖర్చు భరించక తప్పడం లేదని మనుకుమార్ జైన్ పేర్కన్నారు.

ఇతర బ్రాండ్లకు సాధారణంగా మూడు, నాలుగు లేయర్ల డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. తమ బిజినెస్ లో మాత్రం ఒకే లెవెల్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. డాలర్స్ విలువ పెరిగితే వ్యయం పెరుగుతుందని మను కుమార్ జైన్ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios